బ్యాంకింగ్ రంగం పటిష్టతే ధ్యేయం

5 Mar, 2016 00:03 IST|Sakshi
బ్యాంకింగ్ రంగం పటిష్టతే ధ్యేయం

ఆర్థిక శాఖ సహాయ మంత్రి సిన్హా
అవసరమైతే మరింత మూలధనం  అందిస్తామని హామీ

 గుర్గావ్: ప్రభుత్వ రంగ బ్యాంకుల పటిష్టతకు కేంద్రం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి జయంత్ సిన్హా పేర్కొన్నారు. 2016-17 బడ్జెట్‌లో బ్యాంకింగ్‌కు తాజా మూలధనంగా కేంద్రం రూ.25,000 కోట్లను కేటాయించిన విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ... అవసరమైతే మరింత మూలధనం అందించడానికి సైతం సిద్ధమని ఇక్కడ జరిగిన రెండవ జ్ఞాన సంగమ్ కార్యక్రమంలో అన్నారు. మొండి బకాయిలుగా మారే అవకాశం ఉన్న రుణాల విలువ ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకుల్లో దాదాపు రూ.8 లక్షల కోట్లు (బ్యాంకింగ్ వ్యవస్థ లోన్ బుక్ విలువ దాదాపు రూ.69 లక్షల కోట్లు) బ్యాంకుల  ఉంటుందన్నది తమ అంచనా అని తెలిపారు. అయితే ఈ తరహా రుణాల పెరుగుదల వేగం దాదాపు నిలిచిపోయిందని ఆయన అన్నారు. సమస్యకు సంబంధించి ఇది ఒక సానుకూల పరిణామంగా ఆయన పేర్కొన్నారు. సమస్య ఎక్కడుందో తెలుసని, ఎలా పరిష్కరించాలో కూడా తెలుసని ఆయన ఈ సందర్భంగా అన్నారు. ఇక ఇప్పటికే భారం గా మారిన మొండిబకాయిల సమస్య పై ఆయన మాట్లాడుతూ, ఇది ఆందోళనకరమైన అంశమే అయినప్పటికీ సమస్యను నియంత్రించగలుగుతున్నట్లు పేర్కొన్నారు. సమస్య పరిష్కారం దిశలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)తో కలిసి తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు.

 2019 మార్చి నాటికి గడచిన నాలుగేళ్లలో ప్రభుత్వ రంగ బ్యాంకులకు తాజా మూలధనంగా కేంద్రం రూ.70,000 కోట్లు ఇవ్వాలన్నది ప్రణాళిక. వీటిలో 2015-16, 2016-17ల్లో రూ.25,000 కోట్లు చొప్పున అందుతోంది. అటు తర్వాతి రెండు ఆర్థిక సంవత్సరాల్లో రూ.10 వేల కోట్ల చొప్పున బ్యాంకింగ్‌కు అందజేస్తారు. నిజానికి బ్యాంకింగ్‌కు నాలుగేళ్లలో తాజా మూలధనంగా రూ.1.85 లక్షల కోట్లు అందాలన్నది అంచనా. అయితే ప్రభుత్వం సమకూర్చగా మిగిలినది మార్కెట్ ద్వారా సమీకరించుకోవాలన్నది ప్రణాళిక.

>
మరిన్ని వార్తలు