అసెట్స్ అమ్మకంపై చర్చలు జరుగుతున్నాయ్..

21 Jul, 2016 02:00 IST|Sakshi
అసెట్స్ అమ్మకంపై చర్చలు జరుగుతున్నాయ్..

బ్యాంకర్లతో రెండు సార్లు సమావేశమయ్యాం
ల్యాంకో ఇన్‌ఫ్రా వివరణ

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : కార్పొరేట్ రుణ పునర్‌వ్యవస్థీకరణ (సీడీఆర్) స్కీము కింద కొన్ని ఆస్తులను విక్రయించే ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని ల్యాంకో ఇన్‌ఫ్రా వెల్లడించింది. ఇందుకు సంబంధించి రుణ దాతలు, కన్సల్టెంట్లతో చర్చలు జరుపుతున్నామని పేర్కొంది. గ్రూప్‌లో భాగమైన విద్యుత్ విభాగంలో ఓపీజీ పవర్ 51 శాతం వాటాలు కొనుగోలు చేయనున్నట్లు వార్తలొచ్చిన నేపథ్యంలో ల్యాంకో ఇన్‌ఫ్రా బుధవారం ఈ మేరకు వివరణిచ్చింది. ‘సీడీఆర్ స్కీము, రుణదాతలు గతంలో ఆమోదించిన ఇతరత్రా నిధుల సమీకరణ ప్రతిపాదనలకు అనుగుణంగా కొన్ని ఆస్తులను విక్రయించే విషయంపై రుణదాతలు, కన్సల్టెంట్లతో చర్చలు జరుపుతున్నాం.

ఇందులో భాగంగానే విద్యుత్ పోర్ట్‌ఫోలియోకు సంబంధించి హోల్డింగ్ స్థాయిలో లేదా స్పెషల్ పర్పస్ వెహికల్ స్థాయిలో గానీ వ్యూహాత్మక భాగస్వామిని తెచ్చే విషయంపైనా చర్చిస్తున్నాం’ అని సంస్థ తెలిపింది. వివిధ ప్రతిపాదనలపై బ్యాంకర్లతో ఈ నెలలో రెండు సార్లు సమావేశమైనట్లు పేర్కొంది. దాదాపు రూ. 40,000 కోట్ల పైచిలుకు రుణాల భారంతో కుంగిపోయిన ల్యాంకో ఇన్‌ఫ్రాను బ్యాంకులు తమ చే తుల్లోకి తీసుకోనున్నట్లు, విద్యుత్ వ్యాపారాన్ని విడగొట్టి అందులో 51 శాతం వాటాలను ఓపీజీ పవర్ సంస్థకు విక్రయించాలని యోచిస్తున్నట్లు వార్తా కథనాలు వచ్చాయి. బుధవారం బీఎస్‌ఈలో కంపెనీ షేరు సుమారు అయిదున్నర శాతం పెరిగి రూ. 5.35 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు