ఒక కార్డుతోనే అన్ని దేశాలు చుట్టేయొచ్చు

10 Aug, 2014 01:27 IST|Sakshi
ఒక కార్డుతోనే అన్ని దేశాలు చుట్టేయొచ్చు

వ్యాపారం పనిమీద లేదా విహార యాత్రల కోసం ఒకేసారి రెండు మూడు దేశాలు తిరగాల్సి ఉంటుంది. ఇలా దేశం మారినప్పుడల్లా కరెన్సీ కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. దేశం నుంచి మరో దేశం మారినప్పుడల్లా కరెన్సీ మార్చుకోవడం, దీనికి సంబంధించిన కరెన్సీ ఎక్స్ఛేంజీ కార్యాలయాలు వెతుక్కోవడం అనేది చాలా వ్యయప్రయాసలతో కూడిన పని.

 ఈసమస్యకు మల్టీ కరెన్సీ కార్డులు  చక్కటి పరిష్కారాన్ని చూపుతున్నాయి. ఒకే కార్డులో మీకు కావాల్సిన దేశాల కరెన్సీలు లోడ్ చేసుకుని విదేశాలు చుట్టి వచ్చేయొచ్చు. త్వరలోనే యూఏఈ ఎక్స్ఛేంజ్ కూడా మల్టీ కరెన్సీ కార్డుని ప్రవేశపెడుతోంది.

 ఎన్ని కరెన్సీలు
 ఇటీవలి కాలంలో వివిధ పనుల మీద విదేశాలు సందర్శించేవారి సంఖ్య పెరుగడంతో వీరి అవసరాలను తీర్చే విధంగా బ్యాంకులు, ఇతర సంస్థలు మల్టీ కరెన్సీ ట్రావెల్ కార్డులను అందుబాటులోకి తీసుకొచ్చాయి. ప్రధానమైన 15 నుంచి 20 దేశాల కరెన్సీలను ఈ కార్డులో లోడ్ చేసుకునే అవకాశాన్ని ఈ సంస్థలు అందిస్తున్నాయి. కాని చాలా సంస్థలు ఒక కార్డులో గరిష్టంగా 8 నుంచి 10 దేశాల కరెన్సీలను లోడ్ చేసుకోవడానికి అనుమతిస్తున్నాయి. ఒక సారి కరెన్సీ లోడ్ చేసుకున్న తర్వాత ఆయా దేశాల షాపింగుల్లో, ఏటీఎంల్లో నగదును విత్‌డ్రా చేసుకోవడానికి వినియోగించుకోవచ్చు.

 భద్రతకి ఢోకా లేదు: నేరుగా కరెన్సీ తీసుకు వెళ్లడంతో పోలిస్తే ఈ మల్టీ కరెన్సీ కార్డులు చాలా సురక్షితమైనవని చెప్పొచ్చు. ఈ కార్డులు పోగొట్టుకున్నా పిన్ నంబర్ ఉంటుంది కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అలాగే ఒకసారి కార్డు పోయిన తర్వాత ఆ విషయాన్ని సంస్థకు తెలియచేస్తే ఆ కార్డు లావాదేవీలను వెంటనే స్తంభింప చేయడమే కాకుండా మరుసటి రోజుకల్లా మీరున్న చోటకే కొత్త కార్డును అందిస్తాయి. అంతేకాదు సాధారణంగా నేరుగా నగదు రూపంలో అయితే 3,000 డాలర్లకు మించి తీసుకెళ్లడానికి ఉండదు. అదే ఈ కార్డు ద్వారా అయితే గరిష్టంగా 20,000 డాలర్ల వరకు తీసుకెళ్ళొచ్చు. అంతేకాదు ఇతర ఫారిన్ ఎక్స్ఛేంజీలతో పోలిస్తే ఈ కార్డుల్లో రుసుములు కూడా తక్కువ.

 ఏమేం కావాలి?..
 ఈ కార్డుల కోసం ప్రత్యేకంగా ఎటువంటి కాగితాలు సమర్పించాల్సిన అవసరం లేదు. పాస్‌పోర్టుతో పాటు, ఇతర కేవైసీ వివరాలు ఇస్తే సరిపోతుంది. అదే కొన్ని సందర్భాల్లో అంటే 10,000 డాలర్లు మించి తీసుకెళుతుంటే వీసా కాపీలు కూడా జత చేయాల్సి ఉంటుంది.

>
మరిన్ని వార్తలు