సోలార్‌ ప్యానెలే ఇక రూఫ్‌

1 Sep, 2017 00:24 IST|Sakshi
సోలార్‌ ప్యానెలే ఇక రూఫ్‌

విశాక ఇండస్ట్రీస్‌ నుంచి ‘ఆటమ్‌’
మిర్యాలగూడలో 60 మెగావాట్ల ప్లాంటు
 

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వివిధ రంగాల్లో ఉన్న విశాక ఇండస్ట్రీస్‌ తాజాగా సోలార్‌ విపణిలోకి ప్రవేశించింది. ఆటమ్‌ పేరుతో సోలార్‌ రూఫింగ్‌ సిస్టమ్స్‌ను గురువారమిక్కడ ఆవిష్కరించింది. సంప్రదాయ రూఫింగ్‌ సిస్టమ్స్‌కు భిన్నంగా భారత్‌లో తొలిసారిగా వినూత్న డిజైన్‌తో వీటిని రూపొందించింది. ఫైబర్‌ సిమెంటు బోర్డుకు సోలార్‌ సిస్టమ్‌ను జోడించడంతో సోలార్‌ ప్యానెలే రూఫ్‌గా మారిపోయింది. దీని మందం కేవలం 12 మిల్లీమీటర్లు. చదరపు అడుగుకు ధర రూ.700గా నిర్ణయించామని విశాక జేఎండీ జి.వంశీకృష్ణ ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. ఆటమ్‌ జీవిత కాలం 25 ఏళ్లని చెప్పారు. ఏడాదిన్నరపాటు పరిశోధన చేసిన అనంతరం వీటిని విడుదల చేస్తున్నట్టు తెలియజేశారు. పారిశ్రామిక, వాణిజ్య వినియోగదార్లను తొలుత లక్ష్యంగా చేసుకున్నట్టు తెలిపారు. నూతనంగా నిర్మించే గృహాలకు ఇవి ఉపయుక్తంగా ఉంటాయన్నారు.

మూడు నెలల్లో ప్లాంటు..
సోలార్‌ ప్యానెళ్ల తయారీకి నల్గొండ సమీపంలోని మిర్యాలగూడ వద్ద ప్లాంటును నిర్మిస్తున్నట్టు వంశీకృష్ణ తెలిపారు. ‘60 మెగావాట్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో ఇది రానుంది. రెండు మూడు నెలల్లో పూర్తిస్థాయి ఉత్పత్తి ప్రారంభమవుతుంది. ప్లాంటుకై తొలి దశలో రూ.10 కోట్లు వెచ్చిస్తున్నాం. ఉత్పాదనకు పేటెంటు దాఖలు చేశాం. పర్యావరణానికి ఇది అనుకూలమైంది. మార్కెట్లో సంచలనం సృష్టించడం ఖాయం.

ఆటమ్‌ను విదేశాలకూ ఎగుమతి చేసేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని వివరించారు. పశ్చిమ బెంగాల్‌లో వి–బోర్డుల తయారీ ప్లాంటు 2019లో ఏర్పాటు చేసే అవకాశం ఉందని విశాక ఇండస్ట్రీస్‌ వైస్‌ చైర్మన్‌ జి.వివేకానంద్‌ తెలిపారు. హర్యానాలోని జజ్జర్‌ వద్ద రూ.100 కోట్లతో నిర్మిస్తున్న మూడో ప్లాంటు వచ్చే ఏడాది మార్చికల్లా సిద్ధం అవుతుందని చెప్పారు. కాగా, ఆవిష్కరణ కార్యక్రమంలో డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌  సీఈవో జి.వి.ప్రసాద్, విశాక ఎండీ సరోజ వివేకానంద్‌ పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు