బీమా క్లెయిమ్ కష్టమేమీ కాదు!

27 Jun, 2016 02:04 IST|Sakshi
బీమా క్లెయిమ్ కష్టమేమీ కాదు!

ఇన్సూరెన్స్ సంస్థలు ఒక విషయంలో ఎప్పుడూ పోటీపడుతూనే ఉంటాయి. అది క్లయింట్స్ నమ్మకాన్ని, విశ్వాసాన్ని గెలుచుకోవడం!!. ఎందుకంటే ప్రజల నమ్మకాన్ని గెలుచుకున్న సంస్థలకే మనుగడ ఉంటుంది. వృద్ధి బాటలో పయనిస్తాయి. ఇది బీమా క్లెయిమ్ సెటిల్‌మెంట్ అంశంపై ఆధారపడి ఉంటుంది. క్లెయిమ్ చెల్లింపుల్లో ఏ బీమా కంపెనీ అయితే అధిక రేషియోను కలిగి ఉంటుందో... ఆ సంస్థ నుంచి బీమాను తీసుకోవడానికే కస్టమర్లు ఎక్కువ ఆసక్తి చూపుతారనేది బహిరంగ రహస్యం.

చాలా మందిలో బీమా క్లెయిమ్‌కు సంబంధించి కొన్ని అపోహలుంటాయి. ఇన్సూరెన్స్ సంస్థలు క్లెయిమ్ చెల్లింపునకు ఇష్టపడవని, సరిగా చేయవని, చాలా కష్టమని, ఎక్కువ సమయం పడుతుందనే వ్యాఖ్యలను తరచూ వింటూనే ఉంటాం. వీటిల్లో ఏమాత్రం నిజం లేదు. క్లెయిమ్ చెల్లింపు అంశం.. ఇన్సూరెన్స్ కంపెనీపై కన్నా పాలసీదారుడిపైనే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది.
 
క్లెయిమ్ వద్దే సమస్య
బీమా కంపెనీలకు, పాలసీదారులకు మధ్య సమస్యలు క్లెయిమ్ సెటిల్‌మెంట్ సమయంలోనే తలెత్తుతాయి. పాలసీదారుడు బీమా పాలసీని పూర్తిగా అర్థం చేసుకోలేకపోవడం.. పాలసీ తీసుకునే సమయంలో ఆరోగ్యం, ఆదాయం వంటి తదితర అంశాలకు సంబంధించిన వివరాలను తప్పుగా అందించడం వంటి వాటివల్ల క్లెయిమ్ సెటిల్‌మెంట్‌లో సమస్య ఉత్పన్నమౌతుంది.

ఉదాహరణకు ప్రమాదం జరిగి మరణం సంభవించినప్పుడు... పోస్ట్‌మార్టమ్ సహా పాలసీ నివేదికలను సదరు బీమా కంపెనీకి సమర్పించాలి. అదే అనారోగ్యం కారణంగా చనిపోతే.. అప్పుడు ఇన్సూరెన్స్ సంస్థలు హాస్పిటల్ రికార్డులను, వివిధ టెస్టుల నివేదికలను కోరతాయి. అందుకే క్లెయిమ్ చేసే వ్యక్తి ఈ విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి. అంటే క్లెయిమ్ కోసం బీమా సంస్థలు ఏ ఏ లీగల్ డాక్యుమెంట్లను, పత్రాలను కోరతాయో వాటినే సమర్పించాలి. క్లెయిమ్‌కు సంబంధించిన సమస్త సమాచారం ఆయా బీమా సంస్థల వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంటుంది. అలాగే కాల్ సెంటర్‌కు ఫోన్ చేసి కూడా అవసరమైన సమాచారాన్ని పొందొచ్చు. తగిన సమాచారం సమర్పించడం ద్వారా ఎటువంటి సమస్యలూ, ఆలస్యానికి తావు లేకుండా క్లెయిమ్ సెంటిల్‌మెంట్‌ను వేగవంతం చేసుకోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో జరిగే లోటుపాట్లే ఇబ్బందులకు కొంత కారణం.
 
సరైన పత్రాలతో నిర్ణీత సమయంలోనే సెటిల్‌మెంట్
బీమా సంస్థలకు అన్ని అవసరమైన పత్రాలను సమర్పిస్తే.. నిర్ణీత సమయంలోనే క్లెయిమ్ చెల్లింపు జరిగిపోతుంది. అదెలాగో చూద్దాం.. శర్మకు వయసు 32 ఏళ్లు. ఈయన భార్య ఒక రోడ్డు ప్రమాదంలో చనిపోయింది. ఆమె రెండేళ్ల కిందటే ఇన్సూరెన్స్ తీసుకుంది. ఆమె అన్ని అవసరమైన పత్రాలను ఇన్సూరెన్స్ కంపెనీకి అందించారు. అయినా కూడా ఆమె క్లెయిమ్‌ను కంపెనీ తిరస్కరించింది. దీనికి కారణం ఏంటి? అంటే.. శర్మ తన భార్య గుండెకు సంబంధించిన ఆరోగ్య వివరాలను  కంపెనీకి తెలియజేయలేదు. వైద్య పరీక్షల నివేదికల ప్రకారం ఆమె గుండె అనారోగ్యంతో మరణించింది. అందుకే పాలసీ తీసుకునే సమయంలో ఆరోగ్యం, ఆదాయానికి సంబంధించి ఎలాంటి విషయాలను దాచకూడదు. అదే శర్మ అప్పుడు అన్ని వివరాలను కంపెనీకి తెలియజేసి ఉంటే ఇప్పుడు క్లెయిమ్ సులువుగా వచ్చేది.
- సమీర్ బన్సాల్
డెరైక్టర్, బ్యాంక్ అస్యూరెన్స్ పీఎన్‌బీ మెట్‌లైఫ్

మరిన్ని వార్తలు