నోట్ల రద్దుతో నగదు గుట్టు రట్టు

1 Sep, 2017 00:30 IST|Sakshi
నోట్ల రద్దుతో నగదు గుట్టు రట్టు

► గోప్యత పూర్తిగా తొలగిపోయింది...
► బ్యాంకుల్లో భారీగా సొమ్ము జమైంది
► ఇబ్బందులను ముందే ఊహించాం..
► దీర్ఘకాలంలో మంచి ఫలితాలు
► ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ వ్యాఖ్యలు..


న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు(డీమోనిటైజేషన్‌)తో బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి భారీమొత్తంలో నగదు డిపాజిట్లు వచ్చిచేరాయని... దీనివల్ల నగదుపై గోప్యత పూర్తిగా తొలగిపోయిందని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ పేర్కొన్నారు. డీమోనిటైజేషన్‌ తర్వాత రద్దయిన రూ.1,000; రూ.500 నోట్లలో(రూ.15.44 లక్షల కోట్లు) దాదాపు 99 శాతం(రూ.15.28 లక్షల కోట్లు) వెనక్కి వచ్చేశాయని స్వయంగా ఆర్‌బీఐ తన నివేదికలో వెల్లడించిన నేపథ్యంలో జైట్లీ తాజా వివరణ ఇచ్చారు.

గురువారమిక్కడ జరిగిన ఎకనమిస్ట్‌ ఇండియా సదస్సులో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారీ మొత్తంలో నల్లధనం, దొంగనోట్లు వ్యవస్థలో పేరుకుపోయాయని.. దీన్ని తొలగించడానికే నోట్ల రద్దును చేపట్టినట్లు మోదీ సర్కారు ప్రచారం చేసుకున్న విషయం విదితమే.సుప్రీంకోర్టుకు ప్రభుత్వం తరఫు లాయర్లు సమర్పించిన అఫిడవిట్లలో కూడా... సుమారు రూ.5 లక్షల కోట్ల విలువైన రద్దయిన కరెన్సీ బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి డిపాజిట్‌ కాకుండా ఉండిపోవచ్చని చెప్పడం గమనార్హం. ఇప్పుడు ఆర్‌బీఐ నివేదిక అసలు విషయాన్ని బయటపెట్టడంతో  ప్రతిపక్షాలు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాయి.

నల్లధనాన్ని రూపుమాపడం అసాధ్యం..: పెద్ద నోట్ల రద్దు వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలను ముందే ఊహించామని జైట్లీ చెప్పారు. దీనివల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ... దేశ ప్రజలు ఈ విధమైన మార్పునకు సంసిద్ధత వ్యక్తం చేశారని అన్నారు. ‘నల్లధనాన్ని పూర్తిగా రూపుమాపడం ఎవరితరమూ కాదు. ఇప్పటికీ కొంతమంది  పన్నుఎగవేత లావాదేవీలకు పాల్పడుతూనే ఉన్నారు. అయితే, నోట్ల రద్దు తర్వాత భారీమొత్తంలో నగదు బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి వచ్చిచేరింది.

బ్యాంకుల్లో డిపాజిట్‌ అయిన, నోట్ల మార్పిడి చేసుకున్న సొమ్మంతా చట్టబద్ధమైనదని భావించలేం. నోట్ల రద్దు.. దీని గుట్టు విప్పేలా చేసింది. నోట్ల డీమోటిటైజేషన్‌ వల్ల రెండు మూడు త్రైమాసికాలపాటు ఆర్థిక వ్యవస్థ మందగించవచ్చు. మధ్య, దీర్ఘకాలికంగా మాత్రం ఈ చర్యలు సానుకూల ఫలితాలు ఇస్తాయి. ఆర్థిక వ్యవస్థలో అనధికారిక కార్యకలాపాల ప్రక్షాళనకు దోహదం చేస్తుంది. డీమోనిటైజేషన్‌తో పన్ను చెల్లింపు పరిధిలోకి మరింత మంది ప్రజలను తీసుకురాగలిగాం’ అని జైట్లీ వివరించారు.

బకాయిలు చెల్లించండి లేదా వ్యాపారాలను వదులుకోండి!
రుణ ఎగవేతదారులకు జైట్లీ హెచ్చరిక
న్యూఢిల్లీ: బ్యాంకులకు భారీ మొత్తంలో రుణాలు బకాయిపడిన కార్పొరేట్‌ కంపెనీలు తక్షణం వాటిని చెల్లించాలని.. లేదంటే వ్యాపారాలపై నియంత్రణను వదులుకోవాల్సిందేనని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ హెచ్చరించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన దివాలా చట్టంతో ఆర్‌బీఐకి మొండిబకాయిల పరిష్కారం దిశగా విశేష అధికారాలు లభించిన సంగతి తెలిసిందే.

ఆర్‌బీఐ ఆదేశాలతో 12 బడా కార్పొరేట్‌ రుణ ఎగవేత సంస్థలపై బ్యాంకులు దివాలా ప్రక్రియను కూడా మొదలుపెట్టాయి.  బ్యాంకులకు మరింత మూలధనాన్ని అందించేందుకు ప్రభుత్వం సిద్ధమేనని.. అయితే, దీనికంటే ముందు మొండిబకాయిల ప్రక్షాళనే తమకు అత్యంత ప్రాధాన్య అంశమని జైట్లీ పేర్కొన్నారు. అదేవిధంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల మధ్య విలీనాలపై కేంద్రం మరింత దృష్టిపెట్టిందని చెప్పారు. ‘ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ బ్యాంకులు ఎక్కువగా ఉండటం అనవసరం. అతితక్కువ సంఖ్యలో బలమైన బ్యాంకులు కావాలి’ అని జైట్లీ వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు