2018లో రియల్ బూమ్!

9 Apr, 2016 06:10 IST|Sakshi
2018లో రియల్ బూమ్!

‘సాక్షి రియల్టీ’తో మై హోం ఈడీ శ్యాం రావు
సాక్షి, హైదరాబాద్: ‘‘అభివృద్ధికి పక్కా ప్రణాళికలు.. చక్కటి పరిపాలన.. శాంతిభద్రతలకు పెద్దపీట.. పూర్తిస్థాయి పారదర్శకత.. భాగ్యనగరికి పెరుగుతున్న ఆదరణ.. టీఎస్-ఐపాస్, ఐటీ పాలసీలతో నగరానికి క్యూ కడుతున్న ఐటీ, ఇతర సంస్థలు.. నిర్మాణ రంగ వృద్ధికి సరికొత్త నిర్ణయాలు.. మొత్తానికి తెలంగాణ అభివృద్ధికి ప్రభుత్వం నడుం బిగించిందని’’ మై హోం ఈడీ శ్యాంరావు అభిప్రాయపడ్డారు.

ఇది స్థిరాస్తి రంగానికి హైదరాబాద్‌లో నేటికీ అందుబాటులో ఉన్న స్థిరాస్తి ధరలు, త్వరలో ప్రారంభం కానున్న మెట్రోరైలు, పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్న ఔటర్ రింగ్ రోడ్డు.. బెస్ట్ లివింగ్ సిటీ జాబితాలో ముందు వరుసలో నిలిచే భాగ్యనగరి.. ఇవన్నీ నగర స్థిరాస్తి రంగానికి ఊతకర్రలా నిలుస్తున్నాయని వివరించారు. అందుకే 2018 నాటికి హైదరాబాద్‌లో మళ్లీ రియల్ బూమ్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారాయన. ‘సాక్షి రియల్టీ’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయనింకా ఏమన్నారంటే..
 
* 1 చ.అ. కమర్షియల్ స్థలం అమ్ముడయ్యిందంటే.. 200 చ.అ. రెసిడెన్షియల్ స్థలం అవసరముంటుంది. ఈ లెక్కన చూస్తే నగరంలో గత నాలుగేళ్లతో పోల్చుకుంటే కమర్షియల్ స్థలం అమ్మకం/లీజుకు తీసుకోవటం మెరుగ్గా ఉంది. ఏడాది కాలంగా ఈ-కామర్స్, ఐటీ, హెల్త్ కేర్ సంస్థలు నగరంలో సుమారు 3-4 మిలియన్ల స్థలం అద్దెకు తీసుకున్నాయి. ఎక్కడైనా సరే స్థిరాస్తి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగాలంటే.. ఎయిర్‌పోర్ట్, ఐటీ, ఫార్మా కంపెనీలుండాలి. అంటే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే సంస్థలు రావాలని దానర్థం. ఈ లెక్కన దేశంలోని ఇతర నగరాలతో పోల్చుకుంటే భాగ్యనగరం ముందువరుసలోనే ఉందని చెప్పాలి.

* 2012 వరకు కూడా స్థిరాస్తి కొనుగోళ్ల విషయంలో ప్రజల్లో చాలా సందేహాలుండేవి. ధరలు మరింత తగ్గుతాయనో, రాష్ట్రం ఏర్పాడ్డాక పరిస్థితులు ఎలా ఉంటాయనో రకరకాల సందేహాలు. కానీ, ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. తెలంగాణ రాష్ట్రం కూడా అభివృద్ధి దిశగా దూసుకెళుతుంది. నూతన పారిశ్రామిక విధానం, టీ-హబ్, హైరేజ్ బిల్డింగ్‌లు.. ఇలా భాగ్యనగరాన్ని విశ్వనగరంగా మార్చే ప్రణాళికలు చేస్తోంది. దీంతో అంతర్జాతీయ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్నాయి. దీంతో పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలుంటాయి. తెలంగాణ రాష్ర్టం ఏర్పాడ్డాక నగరంలో ఎయిర్ ట్రాఫిక్ కూడా పెరిగింది. 8 నుంచి 12 మిలియన్ల ప్రయాణికులకు చేరింది.

* ప్రస్తుతం నగరంలో స్థిరాస్తి వ్యాపారం వెస్ట్రన్ రీజియన్‌లో బాగుంది. ఎయిర్‌పోర్ట్, హైటెక్ సిటీలుండటమే ఇందుకు కారణం. నార్సింగి, రాయదుర్గం, పుప్పాలగూడ, మాదాపూర్ ప్రాంతాల్లో భారీ వెంచర్లు, ప్రాజెక్ట్‌లు వెలుస్తున్నాయి. మరో 10-15 ఏళ్ల వరకు ఇక్కడి స్థిరాస్తి వ్యాపారానికి డోకా లేదు.

* ఈస్ట్, నార్త్ ప్రాంతాల్లో స్థిరాస్తి వ్యాపారం అంతగా వృద్ధి చెందకపోవడానికి ప్రధాన కారణం.. విమానాశ్రయానికి దూరంగా ఉండటం, పెద్ద సంఖ్యలో ఐటీ కంపెనీలు లేకపోవడం. పెపైచ్చు ఇక్కడి స్థిరాస్తి ధరలు రూ.2-3 వేల మధ్య ఉంటాయి. అంటే మధ్య తరగతి ప్రజలకు ఇది సరైన ప్రాంతం. పోచారం, యాదాద్రి, గుండ్లపోచంపల్లి, ఆదిభట్ల ప్రాంతాల్లో మరింత అభివృద్ధి జరగాలి. కమర్షియల్, రిటైల్ స్పేస్ అమ్మకం పెరిగితే ఈ ప్రాంతంలోనూ భారీ ప్రాజెక్ట్‌లను చూడొచ్చు.

* కస్టమర్‌కు సేఫ్టీ అనేది ముఖ్యం. బిల్డర్/ సంస్థ మీద నమ్మకం, నాణ్యతలకే ప్రాధాన్యమిస్తాడు. విశ్వసనీయత ఉన్న బిల్డర్లు/సంస్థలు రియల్ ఎస్టేట్ బూమ్‌ను మళ్లీ కోరుకోరు. ఎందుకంటే బూమ్ మార్కెట్ అనేది ఆర్టిఫియల్ మార్కెట్. రాత్రికి రాత్రే ధరలు పెరగడం సరైంది కాదు. మార్కెట్ అనేది స్థిరంగా అభివృద్ధి జరగాలి. స్థిరాస్తి రంగంలో పారదర్శకత, త్వరితగతిన అనుమతుల మంజూరు కోసం ఆన్‌లైన్ విధానాన్ని తీసుకొచ్చింది. తెలంగాణ ప్రభుత్వం పరిపాలన విభాగం కూడా బాగుంది. క్రెడాయ్, ట్రెడా వంటి నిర్మాణ రంగ సంస్థలతో నిత్యం చర్చిస్తూ.. స్థిరాస్తి రంగం అభివృద్ధికి బాటలు వేసే నిర్ణయాలను తీసుకుంటుంది. దీంతో హైదరాబాద్‌లో మరో 2-3 ఏళ్లలో రియల్టీ బూమ్ వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
 
రాయదుర్గంలో భూజ!
గడువులోగా కొనుగోలుదారులకు ఇంటి తాళాలందించే సంస్థగా బ్రాండ్ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది మై హోం. లొకేషన్ ఎంపికే మా సక్సెస్‌కు కారణం. ఆ తర్వాతే ధరలు, వసతుల గురించి ఆలోచిస్తాం. మై హోం సంస్థ ప్రాజెక్ట్‌ను ప్రారంభించిందంటే.. ఆ ప్రాంతం అభివృద్ధికి చిరునామా అని అర్థం. మా ప్రాజెక్ట్‌లు పూర్తిగా ఎగువ మధ్యతరగతి, ప్రీమియం విభాగానివే. చ.అ. ధరలు రూ.4 నుంచి 8 వేల మధ్య ఉంటాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో 15-16 మిలియన్ చ.అ. స్థలంలో పలు ప్రాజెక్ట్‌లు నిర్మాణంలో ఉన్నాయి.3-5 ఏళ్లలో బెంగళూరు, పుణెల్లోనూ ప్రాజెక్ట్‌లను ప్రారంభిస్తాం.

* రాయదుర్గంలోని బయోడైవర్సిటీ పార్క్ ప్రాంతంలో 32 ఎకరాల్లో భూజ పేరుతో ఏసీ అపార్ట్‌మెంట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించాం. ఇందులో 18 ఎకరాలు నివాస సముదాయానికి, 14 ఎకరాలు వాణిజ్య సముదాయాలకు కేటాయించాం. మొత్తం 1,700 ఫ్లాట్లు. అన్నీ 3,4 పడక గదులే. ఐజీబీసీ ప్లాటినం రేటెడ్ పొందిందీ ప్రాజెక్ట్. ఇందులో 85 వేల చ.అ.ల్లో క్లబ్ హౌజ్‌తో పాటూ అన్ని రకాల వసతులుంటాయి.

* పుప్పాలగూడలో అవతార్ ప్రాజెక్ట్‌ను చేస్తున్నాం. మొత్తం 2,700 ఫ్లాట్లకు గాను తొలి విడతగా 1,400 ఫ్లాట్లను ప్రారంభించాం. ఒక్క రోజులోనే వెయ్యికి పైగా ఫ్లాట్లను విక్రయించేశాం. చ.అ. ధర రూ.4 వేలు. 2 బీహెచ్‌కే 1,300 చ.అ., 3 బీహెచ్‌కే 1,835 చ.అ. మధ్య ఉన్నాయి. 60 వేల చ.అ.ల్లో క్లబ్ హౌజ్‌తో పాటు అన్ని రకాల ఆధునిక వసతులుంటాయిందులో. 42 నెలల్లో ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తాం.

* ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో 21 ఎకరాల్లో నిర్మిస్తున్న విహాంగ ప్రాజెక్ట్‌ను ఈ ఏడాది డిసెంబర్ కల్లా పూర్తవుతుంది. ఇప్పటికే 85 శాతం అమ్మకాలు పూర్తయ్యాయి. ఇందులో మొత్తం 2 వేల ఫ్లాట్లుంటాయి. ధర చ.అ.కు రూ.4,500.

* సిమెంట్, ఇసుక, ఇనుము వంటి నిర్మాణ సామగ్రి ధరలు గత నాలుగేళ్లతో పోల్చుకుంటే 30-40 శాతం పెరిగాయి. కానీ, స్థిరాస్తి ధరలు విషయానికొస్తే 10 శాతానికి మించలేదు. ఇక నుంచి ఏటా 8-10 శాతం ధరలు పెరుగుతాయి.

మరిన్ని వార్తలు