ఆర్‌బీఐ రూటు ఎటు?

3 Oct, 2016 01:38 IST|Sakshi
ఆర్‌బీఐ రూటు ఎటు?

* వేచిచూసే దోరణి ఉండొచ్చంటున్న నిపుణులు...
* ఈసారికి పాలసీ రేట్లు యథాతథమేనని అంచనా
* గవర్నర్‌గా ఉర్జిత్ పటేల్‌కు తొలి పరీక్ష
* కొత్తగా ఏర్పాటైన పరపతి విధాన కమిటీకి కూడా
* రేపు ఆర్‌బీఐ పరపతి విధాన సమక్ష...

ముంబై: రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) కొత్త గవర్నర్ ఉర్జిత్ పటేల్ రేపు తొలి పరీక్షను ఎదుర్కోనున్నారు. గవర్నర్‌గా ఆయన చేపట్టనున్న తొలి సమీక్షపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అదేవిధంగా వడ్డీరేట్లపై నిర్ణయం కోసం కొత్తగా ఉర్జిత్ నేతృత్వంలో ఏర్పాటైన పరపతి విధాన కమిటీ(ఎంపీసీ)కి కూడా ఇదే మొట్టమొదటి భేటీ కావడం గమనార్హం.

అయితే, మంగళవారం(అక్టోబర్ 4న) జరగనున్న సమీక్షలో ఆర్‌బీఐ పాలసీ రేట్లను యథాతథంగానే కొనసాగించే అవకాశాలున్నాయని బ్యాంకర్లు, ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతున్నట్లుగా మరింత నమ్మకమైన గణాంకాల కోసం ఆర్‌బీఐ వేచిచూడొచ్చనేది వారి అభిప్రాయం. ద్రవ్యోల్బణం కట్టడే ఆర్‌బీఐ ప్రధాన లక్ష్యమంటూ డిప్యూటీ గవర్నర్‌గా ఉర్జిత్ కఠిన వైఖరినే అవలంభించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఆర్‌బీఐని ఆయన గుడ్లగూబ(కఠిన విధానాన్ని ఇలా పోలుస్తారు)గా అభివర్ణించారు కూడా. ప్రస్తుతం ఆర్‌బీఐ రెపో రేటు 6.5 శాతం, రివర్స్ రెపో 6 శాతం, నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్‌ఆర్) 4 శాతంగా కొనసాగుతున్నాయి.
 
ధరల కట్టడికే ఉర్జిత్ మొగ్గు..!
ఆగస్టులో రిటైల్ ద్రవ్యోల్బణం ఐదు నెలల కనిష్టస్థాయి అయిన 5.05 శాతానికి దిగిరాగా... టోకు ధరల ఆధారిత(డబ్ల్యూపీఐ) ద్రవ్యోల్బణం రేటు రెండేళ్ల గరిష్టానికి(3.74%) ఎగబాకడం గమనార్హం. ఆగస్టులో రిటైల్ ధరలు తగ్గినప్పటికీ.. రెండు సూచీలూ కొద్ది నెలలుగా పెరుగుతూనే ఉన్నాయి. మరోపక్క, వచ్చే ఐదేళ్లకాలానికిగాను రిటైల్ ద్రవ్యోల్బణం లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వం 4 శాతంగా(రెండు శాతం అటూ ఇటుగా) నిర్ణయించిన సంగతి తెలిసిందే. డిప్యూటీ గవర్నర్‌గా గతంలో ఆర్‌బీఐ ద్రవ్యోల్బణం లక్ష్యాన్ని ఖరారు చేసిన ఉర్జిత్.. ఇప్పుడు కొత్త గవర్నర్‌గా ధరల కట్టడికే ఎక్కువగా మొగ్గుచూపవచ్చనేది విశ్లేషకుల అభిప్రాయం.

మరీముఖ్యంగా కేంద్రం నిర్ధేశించిన ద్రవ్యోల్బణం కొత్త లక్ష్యానికి అనుగుణంగానే ఆయన చర్యలు ఉంటాయని వారు పేర్కొంటున్నారు. తొలిసారి భేటీ అవుతున్న ఎంపీసీకి ప్రభుత్వం, ఆర్‌బీఐ తరఫున ఉన్న ముగ్గురేసి సభ్యులు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కమిటీకి ఆర్‌బీఐ గవర్నర్ ఉర్జిత్ నేతృత్వం వహిస్తారు. పాలసీ రేట్ల విషయంలో కమిటీలోని ఆరుగురు సభ్యులు సగంసగంగా విడిపోతే.. తుది నిర్ణయం గవర్నర్(వీటో అధికారం) తీసుకుంటారు. కాగా, ఇప్పటివరకూ ఉదయం 11 గంటలకు ఆర్‌బీఐ పాలసీ నిర్ణయాన్ని ప్రకటిస్తుండగా.. దీన్ని మధ్యాహ్నానికి(2.30) మార్చారు.
 
రేటింగ్ ఏజెన్సీల మాట ఇదీ..
‘రేపటి సమీక్షలో ఆర్‌బీఐ ఎలాంటి రేట్ల కోతనూ ప్రకటించే అవకాశం లేదు. రానున్న కాలంలో ద్రవ్యోల్బణం మరింత పెరిగే సూచనలు ఉన్న నేపథ్యంలో పాలసీపరంగా రేట్ల తగ్గింపునకు కొంతకాలం వేచిచూసే ధోరణిని అవలంభించవచ్చు’ అని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ తాజా నివేదికలో అభిప్రాయపడింది. ‘ఆర్‌బీఐ ద్రవ్యోల్బణం లక్ష్యానికి(వచ్చే ఏడాది మార్చికల్లా 5 శాతం) అనుగుణంగా రిటైల్ ద్రవ్యోల్బణం ఆగస్టులో భారీగా తగ్గిననేపథ్యంలో రేట్ల కోత అంచనాలు పెరిగాయి.

అయితే, గతంలో కూడా రిటైల్ ధరలు తీవ్ర హెచ్చుతగ్గుల ధోరణిని కనబరిచిన నేపథ్యంలో తాజా తగ్గుదలను మాత్రమే ఎంపీసీ పూర్తిగా పరిగణనలోకి తీసుకునే అవకాశం లేదు. ప్రధానంగా ఆహార ధరల ద్రవ్యోల్బణం అదుపులోకి రాకపోవడం ఆందోళనకరమైన అంశం’ అని మరో ఇండియా రేటింగ్స్ పేర్కొంది. డిసెంబర్ పాలసీ సమీక్షలో పావు శాతం రేట్ల కోత ఉండొచ్చని.. 2017లో ఇక కోతకు విరామం ఉంటుందని జపనీస్ బ్రోకరేజి దిగ్గజం నోమురా అభిప్రాయపడింది. ‘తొలిసారి సమావేశం అవుతున్న ఎంపీసీ.. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతున్న బలమైన సంకేతాల కోసం వేచిచూసే అవకాశం ఉంది. డిసెంబర్ పాలసీలోనే రేట్ల కోతకు ఆస్కారం ఉండొచ్చు’ అని బీఎన్‌పీ పారిబా చీఫ్ ఎకనమిస్ట్ రిచర్డ్ ఐలే వ్యాఖ్యానించారు.
 
బ్యాంకర్లు ఏమంటున్నారు...
టోకు ధరలు, అదేవిధంగా రిటైల్ ధరలకు సంబంధించి ద్రవ్యోల్బణం రేట్లు పెద్దగా దిగిరాలేదు. ఈ నేపథ్యంలో రేపటి సమీక్షలో ఆర్‌బీఐ కీలక వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులూ చేయకపోవచ్చు.
- ఆర్‌పీ మరాతే, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎండీ, సీఈఓ
 

పాలసీ రేట్లు యథాతథంగానే ఉండొచ్చు. అయితే, బ్యాంకుల మొండిబకాయిల(ఎన్‌పీఏ) కట్టడి విషయంలో మరికొన్ని చర్యలను ఉర్జిత్ తన తొలి సమీక్షలో ప్రకటించే అవకాశం ఉంది.
- అరుణ్ తివారీ, యూనియన్ బ్యాంక్ సీఎండీ

మరిన్ని వార్తలు