రేపే పీఎఫ్‌సీలో వాటాల విక్రయం

26 Jul, 2015 02:07 IST|Sakshi

 షేరు ధర రూ. 254

 న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్‌సీ)లో 5 శాతం వాటాలను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) మార్గంలో జూలై 27న  (సోమవారం) కేంద్రం విక్రయించనుంది. ఇందుకోసం షేరు కనీస ధరను మార్కెట్ రేటుతో పోలిస్తే 2 శాతం డిస్కౌంటుతో రూ. 254గా నిర్ణయించింది. ఫ్లోర్ ప్రైస్ ప్రకారం పీఎఫ్‌సీలో 6.60 కోట్ల షేర్ల విక్రయం ద్వారా కేంద్రానికి రూ. 1,600 కోట్లు రాగలవని అంచనా. సంస్థలో కేంద్రానికి ప్రస్తుతం 72.80 శాతం వాటాలు ఉన్నాయి.

డిజిన్వెస్ట్‌మెంట్ తర్వాత వాటాలు 67.80 శాతానికి తగ్గుతాయి. రెండు ట్రేడింగ్ పనిదినాలు కాకుండా రెండు బ్యాంకింగ్ పని దినాలకు ముందు వాటాల విక్రయ యోచనలు వెల్లడించే వీలు కల్పిస్తూ ఓఎఫ్‌ఎస్ నిబంధనలు మార్చిన తర్వాత షేర్ల విక్రయం జరుపుతున్న తొలి కంపెనీ పీఎఫ్‌సీనే.

మరిన్ని వార్తలు