సేవల రంగం పేలవం: నికాయ్‌

4 Aug, 2017 01:50 IST|Sakshi
సేవల రంగం పేలవం: నికాయ్‌

 జూలైలో అసలు వృద్ధిలేకపోగా క్షీణత
న్యూఢిల్లీ: సేవల రంగం జూలై నెలలో పేలవ పనితనాన్ని ప్రదర్శించింది. ఈ నెలలో అసలు వృద్ధిలేకపోగా, క్షీణతను నమోదుచేసుకుందని నికాయ్‌ ఇండియా సర్వీసెస్‌ పర్చేజింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌ (పీఎంఐ) పేర్కొంది. దీనిప్రకారం, 45.9గా జూలై సూచీ నమోదయ్యింది. ఇది నాలుగేళ్ల కనిష్టం. 2013 సెప్టెంబర్‌ తరువాత ఈ స్థాయిలో ఎప్పుడూ సూచీ పతనం కాలేదు.

నెల క్రితం అంటే జూన్‌లో ఏకంగా ఎనిమిది నెలల గరిష్టస్థాయి 53.1 స్థాయి నుంచి మరుసటి నెలలోనే నాలుగేళ్ల కనిష్ట స్థాయి 45.9 స్థాయికి సూచీ పడిపోవడం గమనార్హం. వస్తు, సేవల పన్ను అమల్లోక్లిష్టత, అనిశ్చితి కొత్త బిజినెస్‌ ఆర్డర్లపై ప్రభావం చూపడమే తాజా భారీ ‘సేవల’ క్షీణతకు కారణమని నికాయ్‌ విశ్లేషణ తెలిపింది. నికాయ్‌ సూచీ 50 పాయింట్ల పైనుంటే వృద్ధి ధోరణిగా ఆ లోపు ఉంటే క్షీణతగా భావించడం జరుగుతుంది.

సేవలు.. తయారీ రెండు కలిపినా నిరాశే
ఇక సేవలు.. తయారీ రెండింటికీ సంబంధించి నికాయ్‌ ఇండియా కాంపోజిట్‌ పీఎంఐ అవుట్‌పుట్‌ ఇండెక్స్‌– కూడా జూలైలో భారీగా పడిపోయి 46.0 పాయింట్లుగా నమోదయ్యింది. మార్చి 2009 తరువాత ఈ స్థాయి ఇదే తొలిసారి. జూన్‌లో మాత్రం 52.7 పాయింట్లుగా నమోదయ్యింది. ప్రైవేటు రంగం ఉత్పత్తి పడిపోవడం తాజా ఫలితానికి ప్రధాన కారణమని  నికాయ్‌  నివేదిక తెలిపింది.

మరిన్ని వార్తలు