పన్నుకు మందు... ఈఎల్‌ఎస్‌ఎస్

14 Mar, 2016 01:56 IST|Sakshi
పన్నుకు మందు... ఈఎల్‌ఎస్‌ఎస్

ఇది మార్చి నెల. అంటే పన్ను కోతలకు ఆఖరి నెల. ఈ నెల్లో గనక ఇన్వెస్ట్‌మెంట్ల రుజువు పత్రాలు హెచ్‌ఆర్ డిపార్ట్‌మెంట్‌కు ఇవ్వకపోతే నెలాఖర్లో చేతికి కాస్తయినా జీతం రావటం కష్టం. అయితే పన్ను ఆదా చేయటానికున్న చక్కటి మార్గాల్లో మ్యూచువల్ ఫండ్ సంస్థలు అందించే ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్ (ఈఎల్‌ఎస్‌ఎస్) కూడా ఉంటాయి. సెక్షన్ 80సీ కింద పన్ను ఆదా చేయడానికి వీలు కల్పించే ఈఎల్‌ఎస్‌ఎస్‌ల లాకిన్ వ్యవధి మూడేళ్లు. ఒకరకంగా మిగతా పథకాలతో పోలిస్తే తక్కువే.  వీటిని ఒకసారి చూద్దాం...
 
మ్యూచువల్ ఫండ్ ద్వారా పెట్టుబడులు
మూడేళ్ల లాకిన్‌తో దీర్ఘకాల రాబడులకు అవకాశం
రాబడులపై క్యాపిటల్ గెయిన్స్ కూడా ఉండదు
మంచి ఫండ్‌ను ఎంచుకోవటం; సిప్ చేయటం అవసరం


దీర్ఘకాలం ఇన్వెస్ట్ చేసి తగిన లాభాలు పొందాలనుకునేవారికి ఈక్విటీల్లో పెట్టుబడి పెట్టడమే చక్కని మార్గమని అందరూ చెబుతుంటారు. ఎందుకంటే స్వల్ప కాలమైతే స్టాక్ మార్కెట్లో హెచ్చు తగ్గులుంటాయి. వాటిని తప్పించుకోవాలంటే దీర్ఘకాలం పెట్టుబడులు కొనసాగించాలి. ఈఎల్‌ఎస్‌ఎస్‌లో పెట్టుబడులంటే స్టాక్ మార్కెట్ పెట్టుబడులే కాబట్టి మెరుగైన ఆదాయాన్ని ఆశించవచ్చు. పెపైచ్చు పన్ను మినహాయింపు కూడా ఉంటుంది. వీలుంటే ఒకేసారి మొత్తం ఇన్వెస్ట్ చేయొచ్చు. లేదంటే సిప్ పద్ధతిలో దఫదఫాలుగా కూడా పెట్టుబడి పెట్టొచ్చు.
 
వీటిలో ఉండే ప్రయోజనాలేంటంటే...
* పన్ను మినహాయింపు
* మూడేళ్ల లాకిన్ ఉంటుంది కనక పన్ను లేని ఆదాయం
* రిస్క్ సామర్థ్యాన్ని బట్టి వివిధ పథకాల్లో ఇన్వెస్ట్ చేసే అవకాశం
* పీపీఎఫ్, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, బాండ్ల వంటి సంప్రదాయ ఇన్వెస్ట్‌మెంట్ సాధనాలతో పోలిస్తే లిక్విడిటీ ఎక్కువ.
 
ఆర్థిక లక్ష్యాలకు మంచిదే...
ఆర్థిక లక్ష్యాల్ని సాధించడానికి మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడమనేది చక్కని మార్గం. ఎందుకంటే మార్కెట్ లోతుపాతులు తెలుసుకోవటానికి, పరిణామాల్ని అంచనా వేయటానికి మరీ ఎక్కువ సమయం వెచ్చించాల్సిన అవసరం ఉండదు. అయితే మీరు ఎంచుకున్న ఫండ్ ఎంత పెద్దది? ఎన్నాళ్ల నుంచి పనిచేస్తోంది? ఫండ్ ఖర్చులుగా ఎంత శాతాన్ని వెచ్చిస్తున్నారు? దాని పనితీరు ఎలా ఉంది? వంటి అంశాల్ని మాత్రం అధ్యయనం చేస్తే చాలు.

ఎందుకంటే కాస్త పెద్ద పోర్టుఫోలియో ఉండి, దీర్ఘకాలంగా కొనసాగుతున్న ఫండ్ సంస్థలైతే మార్కెట్ పరిస్థితులు బాగులేనపుడు కూడా స్థిరంగా ఉండే అవకాశముంటుంది. అలాగే ఖర్చుల శాతం ఎక్కువైతే అది మీ రాబడిపై ప్రభావం చూపిస్తుంది. ఖర్చుల్లో కనీసం 0.5 శాతం తక్కువ ఉన్నా... దీర్ఘకాలంలో అది రాబడులపై ఎక్కువ ప్రభావమే చూపిస్తుంది. సంస్థను, ఫండ్‌ను ఎంచుకున్నాక... ఇన్వెస్ట్‌మెంట్ విధానాన్ని ఎంపిక చేసుకోవాలి. అంటే ఏకమొత్తంగా ఇన్వెస్ట్ చేయటమా? లేక సిప్ పద్ధతిలో ఇన్వెస్ట్ చేయటమా? అన్నది. ఒకరకంగా సిప్ విధానమే ఉత్తమం. ఎందుకంటే మార్కెట్ పడినా, పెరిగినా కూడా దానిద్వారా లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మార్కెట్ పడే పరిస్థితుల్లో ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ యూనిట్లు, పెరుగుతున్నపుడు ఇన్వెస్ట్ చేస్తే తక్కువ యూనిట్లు వస్తాయి. సరాసరిన మంచి రాబడులుంటాయి.
 
లాకిన్ వ్యవధిపై జాగ్రత్త!
ఈఎల్‌ఎస్‌ఎస్‌లో ఎప్పుడైనా పెట్టుబడులు పెట్టొచ్చు. కానీ వెనక్కి తీసుకోవటానికి మాత్రం లాకిన్ వ్యవధి ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఇది మూడేళ్లు. ఒకవేళ సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేస్తే.. ప్రతి మొత్తానికీ మూడేళ్ల లాకిన్ ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఉదాహరణకు... ఈ నెలలో ఇన్వెస్ట్ చేసిన మొత్తాన్ని మూడేళ్ల తరవాత వెనక్కి తీసుకోవచ్చు. వచ్చేనెలలో ఇన్వెస్ట్ చేసిన మొత్తానికి... అప్పటి నుంచి మూడేళ్ల గడువు వర్తిస్తుంది. మూడేళ్ల తరవాత తీసుకునే మొత్తానికి క్యాపిటల్ గెయిన్స్ పన్ను ఉండదు కనక ‘గ్రోత్’ ఫండ్‌ను ఎంచుకోవటమే మంచిది. ఎందుకంటే డివిడెండ్ చెల్లించే ఫండ్‌ను ఎంచుకుంటే డివిడెండ్‌పై పన్నును సంస్థ చెల్లిస్తుంది.

దీనివల్ల మన లాభాలు తగ్గుతాయి. ఒకవేళ డివిడెండ్‌ను రీ-ఇన్వెస్ట్ చేస్తే... అలా ఇన్వెస్ట్ చేసే ప్రతి మొత్తానికీ మూడేళ్ల లాకిన్ వ ర్తిస్తుందని గుర్తుంచుకోవాలి. ఈ ఫండ్ల నుంచి ఎప్పుడు కావాలంటే అప్పుడు వెనక్కి తీసుకోవటం ఉండదు కనక... ఈ ఫండ్ల మేనేజర్లు దీర్ఘకాలంలో చక్కని రాబడులొచ్చే షేర్లలో ఇన్వెస్ట్ చేస్తారు. దీంతో మిగిలిన ఫండ్ల కన్నా ఇవి మంచి రాబడులే ఇస్తాయి. మొత్తంగా చూస్తే ఈఎల్‌ఎస్‌ఎస్‌లో సిప్ పద్ధతిలో నెలవారీ పెట్టుబడి పెట్టడమే మంచిదనేది నా సలహా. పెపైచ్చు ఇలా నెలవారీ ఇన్వెస్ట్ చేసే విధానాన్ని ఆటోమేట్ చేసుకుంటే ఆలస్యం కాకుండా ఉంటుంది. పెపైచ్చు ఇలా దఫదఫాలుగా ఇన్వెస్ట్ చేయటం వల్ల బడ్జెట్‌పై కూడా పెద్దగా ప్రభావం పడదు.
- అనిల్ రెగో
సీఈవో, రైట్ హొరెజైన్స్

>
మరిన్ని వార్తలు