ఐటీ రిటర్నుల దాఖలు గడువుపై తప్పుడు ప్రచారం

30 Aug, 2019 14:28 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలుకు సంబంధించి సోషల్‌ మీడియాలో ఒక తప్పుడు వార్త హల్‌చల్‌ చేస్తోంది. దీనిపై కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ), ఐటీ శాఖ స్పందించాయి.  2018-19 సంవత్సరానికి (అసెస్‌మెంట్‌ ఇయర్‌ 2019–20) సంబంధించి ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలుకు గడువులో ఎలాంటి పొడిగింపు లేదని సీబీడీటీ స్పష్టం చేసింది. సోషల్‌ మీడియాలో ప్రచారమవుతున్న ఆర్డర్‌  ఫేక్‌ ఆర్డర్‌ అనీ, ఆగస్టు 31వ తేదీ అంటే రేపటితో  ఐటీఆర్‌ ఫైలింగ్‌ గడువు ముగియనుందని ఐటీ విభాగం ట్వీట్‌ చేసింది.

ఐటి రిటర్న్స్ దాఖలు చేయడానికి గడువును పొడిగిస్తూ సీబీడీటీ ఆర్డర్‌ పేరుతో చలామణి అవుతున్న వార్త నిజమైంది కాదని సీబీడీటీ స్పష్టం చేసింది. గడువులోపు పన్ను చెల్లింపుదారులు తమ ఐటీ రిటర్న్‌లను దాఖలు చేయాలని సూచించింది.

కాగా ఐటీఆర్‌లు దాఖలు చేయడానికి ఐదు వెబ్‌సైట్లు అందుబాటులో ఉన్నాయి. ఆదాయపు పన్ను విభాగం పోర్టల్‌... ఐటీఆర్‌ దాఖలు చేయడానికి అధికారిక వెబ్‌సైట్‌గా అందుబాటులో ఉంది. క్లియర్‌ ట్యాక్స్, మైఐటీ రిటర్న్, ట్యాక్స్‌స్పానర్, పైసాబజార్‌ ఈ వెబ్‌సైట్‌ల ద్వారా కూడా ఐటీఆర్‌లు దాఖలు చేయవచ్చు. ఇవే కాకుండా చాలా బ్యాంక్‌లు ఈ–ఫైలింగ్‌ ఆప్షన్‌ను అందిస్తున్నాయి. ఐటీఆర్‌లు దాఖలు చేయాలనుకుంటున్న వాళ్లు సంబంధిత బ్యాంక్‌ల ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా ఐటీఆర్‌లను దాఖలు చేయవచ్చు. ఈ నెల 31లోపు ఐటీఆర్‌ దాఖలు చేయలేకపోతే, ఈ ఏడాది డిసెంబర్‌ వరకూ రూ. 5,000 జరిమానాతో, ఆ తర్వాత రూ.10,000 ఫైన్‌తో దాఖలు చేయవచ్చు.

మరిన్ని వార్తలు