మీ ‘సేఫ్‌’ లాకర్‌ ఎక్కడ? ఇంట్లోనా.. బ్యాంకులోనా...

17 Sep, 2018 00:36 IST|Sakshi

బ్యాంకు లాకర్లతో కొన్ని ప్రతికూలతలూ ఉన్నాయ్‌

వాటిలో వస్తువులు పోతే బ్యాంకుల బాధ్యత ఉండదు

అందుకని వాటికి బీమా తీసుకోవటం తప్పనిసరి

ప్రత్యామ్నాయంగా ఇంట్లోనే లాకర్‌ పెట్టుకోవచ్చు

అదయితే ఎప్పుడైనా, ఎన్నిసార్లయినా తెరవొచ్చు

సమయంతో పాటు చార్జీలూ ఆదా అవుతాయి

కానీ, భద్రతా పరంగా రిస్క్‌ ఎక్కువే

ఖర్చు పెట్టగలిగితే మార్కెట్లో పటిష్టమైన లాకర్లు

సీసీ కెమెరాల వంటి అదనపు భద్రత అవసరం  

బంగారు ఆభరణాలు, విలువైన డాక్యుమెంట్లను భద్రంగా ఉంచుకునేందుకు చాలా మంది బ్యాంకుల్లోని సేఫ్‌లాకర్లను ఆశ్రయిస్తారు. ఇది  సర్వసాధారణం. కారణం... బ్యాంకు లాకర్లలో ఉంచితే ఎంతో భద్రంగా ఉంటాయన్న నమ్మకం!!. కాకపోతే ఇక్కడో చిక్కుంది. బ్యాంకు లాకర్‌ మాత్రమే అద్దెకిస్తుంది. అంతవరకే దాని బాధ్యత. అందులో మనం ఏం దాచామన్నది బ్యాంకుకు తెలియదు. అనవసరం కూడా. కాబట్టి ఆ లాకర్లలో మనం దాచిన వస్తువులు పోతే... అందుకు బ్యాంకుల బాధ్యత ఉండదని ఈ మధ్యే ఆర్‌బీఐ కూడా స్పష్టం చేసింది.

అలాగే, కొన్ని చోట్ల బ్యాంకు లాకర్లను బద్దలు కొట్టి విలువైన వస్తువుల్ని దోచుకుపోయిన సంఘటనలు సైతం ఉన్నాయి. దీంతో బ్యాంకు లాకర్లలో ఉంచిన వస్తువుల భద్రత విషయంలో ఖాతాదారులు మరోసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి ఇలాంటి వాటికి ప్రత్యామ్నాయాలేంటి? ఎక్కడైతే సురక్షితంగా దాచుకోగలం? అసలు బ్యాంకు లాకర్లలో ఉంచిన వారు భద్రతా పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి?... ఇవన్నీ వివరించేదే ఈ ప్రత్యేక కథనం.   – సాక్షి, పర్సనల్‌ ఫైనాన్స్‌ విభాగం


మంచి కంపెనీల సేఫ్టీ లాకర్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. మీ అవసరాలకు సరిపోయేదాన్ని ఎంచుకుని ఇంట్లోనే ఓ చోట ఏర్పాటు చేసుకోవడం ఒక పరిష్కారం. ఇందులో కొన్ని ప్రయోజనాలున్నాయి. అలాగే, కొన్ని రిస్క్‌లు కూడా ఉన్నాయి. మీకు ఎప్పుడు అవసరం వచ్చినా లాకర్లలో ఉంచిన వాటిని తీసుకోవచ్చు. బ్యాంకుల్లో అయితే నిర్ణీత సమయాల్లోనే ఆ అవకాశం ఉంటుంది. ప్రైవేటుగా లాకర్‌ సేవలందించే సంస్థలు కూడా రోజువారీ సమయాలను పాటిస్తాయి. పైపెచ్చు సెలవు రోజుల్లో మూసి ఉంచుతాయి.

ఇక బ్యాంకు లాకర్లయితే ఏడాదిలో కనీసం ఒకసారయినా లాకర్‌ను తెరవాలన్న నిబంధన ఉంటుంది. ఒకవేళ అలా తెరవలేని పక్షంలో ఎందుకు తెరవలేదో చెప్పాలని కోరుతూ బ్యాంకు నోటీసు జారీ చేస్తుంది. దానికి సమాధానమివ్వాల్సి ఉంటుంది. ఒకవేళ దానికి స్పందించకపోతే లాకర్‌ను బలవంతంగా తెరవడం జరుగుతుంది. బ్యాంకు లాకర్లలో విలువైన వస్తువులుంచినపుడు వాటిని అవసరానికి తీసుకురావడం, పని ముగిసిన తర్వాత తిరిగి మళ్లీ తీసుకెళ్లి లాకర్లలో పెట్టడం కాస్తంత శ్రమ, సమయంతో కూడినది. పైగా క్యారీ చేసే సమయంలో దోపిడీ భయం ఉండనే ఉంది. ఇంట్లోనే లాకర్‌ ఏర్పాటు చేసుకుంటే ఈ విధమైన ఇబ్బంది ఉండదు. సమయం కూడా ఆదా అవుతుంది.  

చార్జీలు ఎలా ఉంటాయంటే...
బ్యాంకు లాకర్‌ను అద్దెకు తీసుకునేటపుడైనా... దానికి బదులు సొంతంగా లాకర్‌ కొనుగోలు చేసి ఇంట్లో ఏర్పాటు చేసుకునేటపుడైనా వాటికయ్యే ఖర్చును పోల్చి చూడాల్సి ఉంటుంది. బ్యాంకుల్లో లాకర్‌ అద్దెలు పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో వేర్వేరుగా ఉంటున్నాయి. లాకర్‌ సైజును బట్టి కూడా ఈ చార్జీలు మారుతుంటాయి. చిన్న లాకర్‌కు అయితే ఎస్‌బీఐ సంవత్సరానికి పట్టణాల్లో రూ.1,100, సెమీ అర్బన్, గ్రామీణ శాఖల్లో రూ.800 చొప్పున వసూలు చేస్తోంది. పెద్ద లాకర్‌ అయితే ఈ అద్దె పట్టణాల్లో రూ.8,000, గ్రామీణ ప్రాంతాల్లో రూ.7,000గా ఉంది. పైపెచ్చు బ్యాంకుల్లో లాకర్‌ కోసం మూడేళ్ల అద్దెను కూడా డిపాజిట్‌ చేయాల్సి రావచ్చు.

ప్రైవేటు సంస్థలయితే తిరిగి చెల్లించే మూడేళ్ల అద్దెను డిపాజిట్‌ చేయాలని కోరుతున్నాయి. ఈ సంస్థలు వసూలు చేసే అద్దె ప్రభుత్వరంగ బ్యాంకుల కంటే కొంచెం ఎక్కువగా ఉంటోంది. ఇక ఇంట్లోనే లాకర్‌ ఏర్పాటు చేసుకున్నట్టయితే ఫలానా వారే దాన్ని తెరవాలి, ఇన్ని సార్లే తెరవాలన్న అడ్డంకులేవీ ఉండవు. బ్యాంకులు లాకర్లను తెరిచే విషయంలో ఏడాదికి ఇన్ని సార్లేనన్న పరిమితులు అమలు చేస్తున్నాయి. అంతకు మించితే చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. ఎస్‌బీఐ అయితే ఏడాదికి 12 సార్లు మాత్రమే ఉచితం.

ఆ తర్వాత నుంచి ప్రతీ సందర్శనకు రూ.100 చార్జీ విధిస్తోంది. అలాగే, బ్యాంకులు ఇద్దరు వ్యక్తులను జాయింట్‌ హోల్డర్లుగా లాకర్‌ను యాక్సెస్‌ చేసుకునేందుకు అనుమతిస్తుంటాయి. వీరు మినహా మిగిలిన వారికి ఆ అవకాశం ఉండదు. నామినీని కూడా పేర్కొనాల్సి ఉంటుంది. ఇంట్లోనే లాకర్‌ ఏర్పాటు చేసుకున్నట్టయితే కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా దొంగల నుంచి కాపాడుకునే బాధ్యత ఎవరికి వారే చూసుకోవాల్సి ఉంటుంది. సీసీ కెమెరాలు, ఎవరైనా చొరబడితే గుర్తించి అప్రమత్తం చేసే పరికరాలు ఏర్పాటు చేసుకోవాల్సి వస్తుంది.  

లాకర్‌ ఎంపిక ఎలా?
ఇంట్లో ఏర్పాటు చేసుకునే లాకర్లకు సంబంధించి ఎన్నో సైజులు, మోడల్స్‌ అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా కనిపించేవి ‘కీ’తో ఉండే మెకానికల్‌ లాకర్లు. అలాకాకుండా ఎలక్ట్రానిక్‌ కీప్యాడ్‌లతో కూడిన ఖరీదైన లాకర్లు సైతం మార్కెట్లో ఉన్నాయి. కార్డుల స్వైప్‌తో, బయోమెట్రిక్‌ ద్వారా యాక్సెస్‌ చేసుకునేవీ దొరుకుతున్నాయి. మెకానికల్‌ లాకర్ల కంటే ఈ తరహా లాకర్ల ఖరీదు దాదాపు 50 శాతం ఎక్కువ ఉంటోంది.

ఉదాహరణకు గోద్రెజ్‌ 23 లీటర్ల ఎలక్ట్రానిక్‌ మోడల్‌ లాకర్‌ ధర రూ.11,522. అదే మెకానికల్‌ లాకర్‌ ధరయితే రూ.8,000. లాకర్‌ బరువు కూడా చూడాల్సి ఉంటుంది. చాలా బరువుతో ఉండేవి ఎంచుకోవడం వల్ల దొంగలెవరైనా చొరబడి వాటిని ధ్వంసం చేయాలనుకున్నా, తీసుకెళ్ళాలనుకున్నా కష్టమవుతుంది. అలాంటి వాటి ధర ఇంకాస్త ఎక్కువ ఉంటుంది. 30 లీటర్ల ఎలక్ట్రానిక్‌ సేఫ్‌ లాకర్, 14 కిలోల బరువున్న దాన్ని పెప్పర్‌ఫ్రైలో కొనుగోలు చేయాలంటే ధర సుమారు రూ.12,200 వరకూ ఉంది. 18 కిలోల బరువుతో ఉన్న దాని ధర రూ.13,530.  

ఎక్కడ ఏర్పాటు చేయాలి?
ఇళ్లలో లాకర్‌ను పెట్టుకోవాలనుకున్న వారు... దాన్ని ఎక్కడ ఉంచాలన్నది కూడా ఆలోచించతగినదే. ఇంటి నిర్మాణ సమయంలోనే లాకర్‌ను కొని ఏర్పాటు చేయించుకోవడం మంచి ఆలోచన. ఇలా చేస్తే లాకర్‌ కనిపించకుండా చేసుకునేందుకు వీలుంటుంది. నిర్మాణం పూర్తయిన ఇంట్లో అయితే గోడలకు స్క్రూతో గట్టిగా ఫిట్‌ చేయించుకోవాలి.

కాకపోతే ఇలా లాకర్‌ను ఏర్పాటు చేసేటపుడు ఎవరికీ తెలియకుండా చూసుకోవటం తప్పనిసరి. ఇల్లు కట్టేటపుడు ఏర్పాటు చేసుకోవాలనుకున్నా కూడా ఈ జాగ్రత్తలు తప్పనిసరి. అగ్ని ప్రమాద నిరోధ లాకర్లు కూడా ఉన్నాయి. అగ్ని ప్రమాదం జరిగితే ఈ లాకర్లలో ఉంచిన డాక్యుమెంట్లకు కాలిపోయే రిస్క్‌ ఉండదు. ఏ మేరకు భద్రత అవసరం అన్నదాన్ని బట్టి ఈ ఫీ చర్లను జోడించుకుంటూ వెళ్లొచ్చు. అలాగే, ధర కూడా ఎంచుకున్నదాన్ని బట్టి ఉంటుంది.  

బీమా తప్పనిసరి
బ్యాంకు లాకర్‌ అద్దెకు తీసుకున్నా లేక ఇంట్లో లాకర్‌ను ఏర్పాటు చేసుకున్నా తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన అంశం బీమా పాలసీ తీసుకోవడం. లాకర్లలో ఉంచిన వస్తువులు మాయం అయితే బ్యాంకులు బాధ్యత తీసుకోవడం లేదు. కనుక అందులో ఉంచిన వాటి విలువకు సమానంగా బీమా రక్షణతో పాలసీ తీసుకోవడం అవసరం. హోమ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలో చాలా వాటికి బీమా రక్షణ లభిస్తుంది. బీమా పాలసీ తీసుకునే వారు బ్యాంకు లాకర్లలో ఉంచినవి కోల్పోతే కచ్చితంగా పరిహారం పొందడానికి అవకాశం ఉంటుంది.

ఎందుకంటే బ్యాంకు శాఖలు పటిష్ట భద్రతతో ఉంటాయి కనుక. కానీ, ఇంట్లో లాకర్‌ ఏర్పాటు చేసుకుని అందులో విలువైన వాటిని ఉంచిన వారు బీమా ఉందిలే అని నిర్లక్ష్యం చూపిస్తే పరిహారం ఇచ్చేందుకు కంపెనీలు నిరాకరించే ప్రమాదం ఉంటుంది. అందుకే ఇంట్లో లాకర్‌ ఏర్పాటు చేసుకునే వారు సీసీ కెమెరాలు, పటిష్టమైన లాకర్, అగ్ని నిరోధక తదితర అన్ని భద్రతా చర్యలు తీసుకోవడం కచ్చితంగా అవసరం. అప్పుడే క్లెయిమ్‌ తిరస్కరణ ప్రమాదాన్ని నివారించుకోవచ్చు. 

మరిన్ని వార్తలు