ఆ నల్లధనంపై సమాచారం లేదు

5 Sep, 2017 03:32 IST|Sakshi
ఆ నల్లధనంపై సమాచారం లేదు

► జమయిన నోట్ల ధృవీకరణ పూర్తికి మరింత సమయం
►  డీమోనిటైజేషన్‌పై పార్లమెంటరీ ప్యానెల్‌కు ఆర్‌బీఐ వివరణ


న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు పర్యవసానంగా చలామణీ నుంచి ఎంత మేర నల్లధనం తొలగిపోయినదీ తమ దగ్గర ‘ఎలాంటి సమాచారమూ’ లేదని రిజర్వ్‌ బ్యాంక్‌ తెలిపింది. అదే విధంగా లెక్కల్లో చూపని ఎంత ధనం చట్టబద్ధంగా ఖాతాల్లోకి వచ్చినదీ కూడా తమ దగ్గర వివరాలు లేవని పేర్కొంది. ఆర్థిక అంశాలపై పార్లమెంటరీ స్థాయీ సంఘానికి రిజర్వ్‌ బ్యాంక్‌ ఈ మేరకు వివరణ ఇచ్చింది. డీమోనిటైజేషన్‌ అనంతరం బ్యాంకుల్లో జమ అయిన డబ్బు గణాంకాలు పక్కాగా తేల్చే ప్రక్రియ అత్యాధునిక వెరిఫికేషన్‌ మెషీన్స్‌ సాయంతో ఇంకా కొనసాగుతోందని ఆర్‌బీఐ తెలిపింది.

ఇందుకోసం చాలా మటుకు రిజర్వ్‌ బ్యాంక్‌ కార్యాలయాల్లో సిబ్బంది రెండు షిఫ్టుల్లో పనిచేస్తున్నారని వివరించింది. బ్యాంకుల్లోకి జమయిన పెద్ద నోట్ల విలువ సుమారు రూ. 15.28 లక్షల కోట్లు ఉంటుందని, ధృవీకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఇందులో కొంత మార్పులు, చేర్పులు ఉండొచ్చని తెలిపింది. తదుపరి మళ్లీ మళ్లీ డీమోనిటైజేషన్‌ ప్రణాళికలేమైనా ఉన్నాయా అన్న దాని గురించీ తమకు సమాచారం లేదని పేర్కొంది.  

నల్లధనం అరికట్టే దిశగా కేంద్రం గతేడాది నవంబర్‌ 8న రూ. 500, రూ. 1,000 నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. డీమోనిటైజేషన్‌ తర్వాత వ్యవస్థలోకి రూ. 15,280 కోట్ల విలువ చేసే పెద్ద నోట్లు తిరిగొచ్చాయంటూ ఆర్‌బీఐ ఇటీవలే వార్షిక నివేదికలో వెల్లడించింది. పెద్ద నోట్ల రద్దుపై స్థాయీ సంఘం లేవనెత్తిన అంశాలపై రిజర్వ్‌ బ్యాంక్‌ తాజాగా రాతపూర్వక సమాధానం ఇచ్చింది. సంఘటిత, అసంఘటిత రంగాలపై డీమోనిటైజేషన్‌ ప్రతికూల ప్రభావాల గురించి రిజర్వ్‌ బ్యాంకు నేరుగా సమాధానం చెప్పలేదు. పారిశ్రామిక, సేవల రంగాల్లో బలహీనతల కారణంగా 2016–17లో వృద్ధి మందగమనం.. డీమోనిటైజేషన్‌ కన్నా ముందే మొదలైందని పేర్కొంది.  

వర్చువల్‌ కరెన్సీలతో రిస్కే..
బిట్‌కాయిన్‌ వంటి వర్చువల్‌ కరెన్సీలతో ‘బ్లాక్‌ మనీ’ ముప్పు పొంచి ఉందని ఆర్‌బీఐ హెచ్చరించింది. టెర్రరిస్టులు, మోసగాళ్లు ఇలాంటి మార్గాల్లో మనీల్యాండరింగ్‌కు పాల్పడే అవకాశం ఉందని పేర్కొంది. బిట్‌కాయిన్‌ లేదా ఇతరత్రా ఏ వర్చువల్‌ కరెన్సీతో సంబంధమున్న లావాదేవీలు నిర్వహించడానికి దేశీయంగా ఏ సంస్థకూ తాము అనుమతులు ఇవ్వలేదని స్పష్టం చేసింది. ఈ లావాదేవీలు జరిపేవారు సొంతంగా రిస్కు భరించాల్సి ఉంటుందని పార్లమెంటరీ ప్యానెల్‌కి ఆర్‌బీఐ తెలిపింది. వర్చువల్‌ కరెన్సీలపై నియంత్రణలపరమైన విధి విధానాలను రూపొందించే అంశాన్ని పరిశీలించేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటైనట్లు తెలిపింది.

మరిన్ని వార్తలు