నగదు ఉపసంహరణలపై పరిమితుల్లేవు

24 Feb, 2018 00:49 IST|Sakshi

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ స్పష్టీకరణ

న్యూడిల్లీ/ముంబై: ఖాతాదారుల నగదు ఉపసంహరణలపై ఎలాంటి పరిమితులు విధించలేదని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు (పీఎన్‌బీ) శుక్రవారం స్పష్టం చేసింది. ప్రతి కస్టమర్‌కు రూ.3,000 పరిమితి విధించినట్టు సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని తోసిపుచ్చింది. అలాగే, 18 వేల మంది సిబ్బందిని ఇటీవల బదిలీ చేసినట్టు వచ్చిన వార్తల్లోనూ నిజం లేదని, 1,415 మందినే బదిలీ చేశామని తెలిపింది.

మరోవైపు ఖాతాదారుల డెబిట్, క్రెడిట్‌ కార్డుల సమాచారం లీక్‌ అయిం దంటూ వస్తున్న నివేదికలను పీఎన్‌బీ తోసిపుచ్చింది. డేటా భద్రత కోసం అవసరమైన అన్ని రకాల చర్యలు చేపడుతుందని వివరించింది.   క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ తమ బ్రాండ్‌ అంబాసిడర్‌గా కొనసాగుతున్నారని స్పష్టం చేసింది. అలాగే, రూ.11,400 కోట్ల స్కామ్‌పై ఫోరెన్సిక్‌ ఆడిటింగ్‌కు ప్రైస్‌ వాటర్‌హౌస్‌ కూపర్స్‌ను (పీడబ్ల్యూసీ) నియమించుకోలేదని తెలిపింది.

నిఘా వ్యవస్థను సమీక్షించుకోవాలి: అలహాబాద్‌ బ్యాంక్‌ సీఈవో
బ్యాంకులు తమ నిఘా వ్యవస్థలను  సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని అలాహాబాద్‌ బ్యాంకు ఎండీ, సీఈవో ఉషా అనంత సుబ్రమణ్యం చెప్పారు. పీఎన్‌బీకి ఆమె గతంలో చీఫ్‌గా ఉన్నారు.

స్విఫ్ట్, సీబీఎస్‌ అనుసంధానం
మరోవైపు బ్యాంకుల మధ్య అంతర్గత సమాచారానికి వీలు కల్పించే స్విఫ్ట్‌ వ్యవస్థను కోర్‌ బ్యాంకింగ్‌ సిస్టమ్‌తో (సీబీఎస్‌) ఏప్రిల్‌ 1 నాటికి అనుసంధానించుకోవాలని ఆర్‌బీఐ గడువు విధించింది. పీఎన్‌బీలో మోసానికి స్విఫ్ట్‌ వ్యవస్థను దుర్వినియోగం చేసిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు