విదేశీ నిల్వలు ఎక్కువగా ఉన్న దేశాలివే!

9 Jul, 2018 20:51 IST|Sakshi

విదేశీ నిల్వలు.. ఇవి లేక కొన్నిసార్లు కుప్పకూలుతున్న ఆర్థిక వ్యవస్థలను కాపాడుకోలేని పరిస్థితులు చూసుంటాం​. ఇవి దేశీయ కరెన్సీకి ఇచ్చే మద్దతు అంతా ఇంతా కాదు. ప్రపంచంలో ఒక ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడంలో వీటి పాత్ర చాలా కీలకం. దేశంలో ఎమర్జెన్సీ పరిస్థితులు నెలకొనప్పుడు విదేశీ నిల్వలుంటే చాలు, ఎలాగోఅలా గట్టెక్కే అవకాశాలుంటాయి. తాజాగా అంతర్జాతీయ ద్రవ్య సంస్థ ఓ డేటా రూపొందించింది. దీనిలో ఏ దేశంలో విదేశీ నిల్వలు అధికంగా ఉన్నాయో వెల్లడించింది. ఈ జాబితాలో చైనా టాప్‌లో ఉందట. 3.2 ట్రిలియన్‌ డాలర్ల రిజర్వులతో విదేశీ నిల్వల్లో చైనా అగ్రస్థానంలో ఉన్నట్టు పేర్కొంది. ఐఎంఎఫ్‌ డేటా ప్రకారం హోమ్‌మచ్‌.నెట్‌ లో పొందుపరిచిన జాబితా ఈ విధంగా  ఉంది. 

ర్యాంకు           దేశం                    విదేశీ నిల్వలు
1                  చైనా                3,161.5 బిలియన్‌ డాలర్లు
 2                జపాన్‌               1,204.7 బిలియన్‌ డాలర్లు
3               స్విట్జర్లాండ్‌            785.7 బిలియన్‌ డాలర్లు
4              సౌదీ అరేబియా       486.6 బిలియన్‌ డాలర్లు
5               హాంకాంగ్‌             437.5 బిలియన్‌ డాలర్లు
6               భారత్‌                 397.2 బిలియన్‌ డాలర్లు
7               దక్షిణ కొరియా       385.3 బిలియన్‌ డాలర్లు
8               బ్రెజిల్‌                  358.3 బిలియన్‌ డాలర్లు
9               రష్యా                   356.5 బిలియన్‌ డాలర్లు
10             సింగపూర్‌            279.8 బిలియన్‌ డాలర్లు

ఈ జాబితాలో అత్యంత కీలకమైన ఆర్థిక వ్యవస్థలు అమెరికా, యూరప్‌ దేశాలు లాంటి దేశాలను పరిగణలోకి తీసుకోలేదు. ఎందుకంటే అమెరికా డాలర్‌ను, యూరోను అంతర్జాతీయ లావాదేవీల్లో అత్యంత సాధారణ రిజర్వు కరెన్సీలుగా పరిగణించడమే దీనికి గల కారణం. దీంతో అమెరికా లాంటి దేశాలు ఎక్కువ రిజర్వులను కలిగి ఉండాల్సినవసరం లేదు.

సెంట్రల్‌ బ్యాంకులు ఏ విదేశీ కరెన్సీని ఎక్కువగా కలిగి ఉన్నాయి....
ర్యాంక్‌                     రిజర్వు కరెన్సీ        గ్లోబల్‌ హోల్డింగ్స్‌
1                          అమెరికా డాలర్‌         63.5 శాతం
2                           యూరో                  20.0 శాతం
3                          జపనీస్‌ యెన్‌           4.5 శాతం
4                          బ్రిటీష్‌ పౌండ్‌             4.5 శాతం
5                       కెనడియన్‌ డాలర్‌         2.0 శాతం
6                         ఆ‍స్సి డాలర్‌              1.8 శాతం
7                         చైనీస్‌ యువాన్‌         1.1 శాతం
8                        ఇతర కరెన్సీ               2.6 శాతం

విదేశీ కరెన్సీ నిల్వలు ఎందుకు అవసరం ?

  • విదేశీ నిల్వలు తమ దేశీయ కరెన్సీ విలువను ఒక స్థిర రేటు వద్ద నిర్వహించడానికి ఆ దేశానికి అనుమతిస్తాయి.
  • ఆర్థిక సంక్షోభ సమయంలో లిక్విడిటీని నిర్వహించడానికి విదేశీ నిల్వలు సహకరిస్తాయి.
  • విదేశీ పెట్టుబడిదారులకు ఈ రిజర్వులు నమ్మకాన్ని కల్పిస్తాయి. వారి పెట్టుబడులను కాపాడేందుకు సెంట్రల్‌ బ్యాంకు ఎప్పడికప్పుడు చర్యలు తీసుకుంటూ ఉంటుంది.
  • బాహ్య చెల్లింపు బాధ్యతల కోసం విదేశీ కరెన్సీ నిల్వలు దేశానికి అదనపు బీమాగా ఉంటాయి
  • మౌలిక సదుపాయాలు వంటి పలు రంగాలకు నిధులు ఇవ్వడానికి విదేశీ నిల్వలు ఉపయోగపడతాయి
  •  మొత్తంగా పోర్టుఫోలియోలో ప్రమాదకర పరిస్థితులను తగ్గించుకోవడం కోసం సెంట్రల్‌ బ్యాంకులకు ఇవి ఎంతో సహకరిస్తాయి.
మరిన్ని వార్తలు