స్మార్ట్ఫోన్లపై హోమ్ క్రెడిట్ జీరో శాతం వడ్డీ ఆఫర్

10 Oct, 2016 01:10 IST|Sakshi
స్మార్ట్ఫోన్లపై హోమ్ క్రెడిట్ జీరో శాతం వడ్డీ ఆఫర్

పండుగ సీజన్ సందర్భంగా స్మార్ట్‌ఫోన్ కొనుగోళ్లకు సంబంధించి ప్రముఖ నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (ఎన్‌బీఎఫ్‌సీ)- హోమ్ క్రెడిట్... తన వినియోగదారులకు ఆకర్షణీయమైన స్కీమ్‌ను ప్రకటించింది. పలు స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ల కొనుగోళ్లకు సంబంధించి జీరోశాతం వడ్డీని ఆఫర్ చేసింది. ఈ మేరకు జియోనీ, ఇంటెక్స్, లివా, మైక్రోమ్యాక్స్, ఒప్పో, శ్యామ్‌సంగ్, వివో కంపెనీల ప్రతినిధులతో అవగాహన కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. దేశ వ్యాప్తంగా 50 పట్టణాల్లో 6,000 పాయింట్-ఆఫ్-సేల్స్ (పీఓఎస్) వద్ద ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది.

ఏగాన్ లైఫ్... సరికొత్త ఆన్‌లైన్ ప్రొటెక్షన్ ప్లాన్
ఏగాన్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ తాజాగా అత్యుత్తమ ఫీచర్లు, ప్రీమియంలతో సరికొత్త ఆన్‌లైన్ ప్రొటెక్షన్ ప్లాన్‌ను ఆవిష్కరించింది. పరిశ్రమలో అతి తక్కువ ప్రీమియం ధర దీని ప్రత్యేకత. వినియోగదారులకు అదనపు లైఫ్ స్టేజ్ ప్రయోజనం ఉంటుంది. దీనిలో భాగంగా తమ జీవితంలో ముఖ్యమైన అంశాలకు సంబంధించి ప్రొటెక్షన్ కవర్‌ను పెంచుకునే వీలుంది. ప్రీమియంను నెలసరి, అర్ధ సంవత్సరం, వార్షిక పద్ధతిలో చెల్లించొచ్చు. గతంలో ఇది వార్షిక పద్ధతిన చెల్లించాల్సి వచ్చేది. గరిష్ట మెచ్యూరిటీ వయసును 80 ఏళ్లకు పెంచారు. గరిష్ట పాలసీ టర్మ్ 62 సంవత్సరాలు. డెత్ బెనిఫిట్ చెల్లింపులను ఏక మొత్తంలో లేదా 100 నెలల కోసం నిద్ధిష్ట నెలసరి ఆదాయ రూపంలో లేదా ఈ రెండింటి సమ్మేళనంగా ఎంచుకునే వీలుంది.

ఆన్‌లైన్ రుణ సంస్థలతో వైడర్ భాగస్వామ్యం...
మొబైల్ హోల్‌సేల్ బీ2బీ మార్కెట్‌ప్లేస్... ‘వైడర్’ పండుగల సందర్భాన్ని పురస్కరించుకుని పలు ఆన్‌లైన్ రుణ సంస్థలతో వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పరుచుకుంది. లెండింగ్ కార్ట్, క్యాపిటల్ ఫ్లోట్, ఇండిఫై, ఫ్లెక్సీ లోన్స్ వంటి సంస్థలు ఇందులో ఉన్నాయి. తక్కువ డాక్యుమెంటేషన్‌తోనే రిటైలర్లకు వర్కింగ్ క్యాపిటల్ లోన్ ఇవ్వడం ఈ భాగస్వామ్యం ఉద్దేశమని సంస్థ ప్రతినిధి తెలిపారు. సంబంధిత రిటైలర్లు వైడర్ వేదికపై వస్తువుల్ని క్రెడిట్ ప్రాతిపదికన కొనుగోలు చేసినప్పుడు ఇది వర్తిస్తుంది. దీపావళి వరకు కొనుగోలు మొత్తంపై వచ్చే వడ్డీని వైడర్ చెల్లిస్తుంది. 

బిర్లా సన్‌లైఫ్ ఫండ్ నుంచి స్మార్ట్ బిజినెస్ యాప్
బిర్లా సన్‌లైఫ్ మ్యూచ్‌వల్ ఫండ్‌కు ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్ గా వ్యవహరిస్తున్న బిర్లా సన్‌లైఫ్ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ తాజాగా మొబైల్ అప్లికేషన్ ‘ఫిన్‌గో పార్ట్‌నర్’ను ఆవిష్కరించింది. ఈ యాప్‌ను స్మార్ట్ బిజినెస్ సొల్యూషన్‌గా సంస్థ వర్ణించింది. వివిధ ప్రక్రియలను సులభతరం చేసే ఈ యాప్... డిస్ట్రిబ్యూటర్లకు ఎంతో తోడ్పాటునందిస్తుందని పేర్కొంది. కస్టమర్లను ట్రాక్ చేసేందుకు, వారికి సేవలు అందించేందుకు, విలువైన వ్యాపార సమాచారాన్ని తక్షణం యాక్సెస్ చేసుకోవటం ద్వారా వారు తమ వ్యాపారాన్ని విస్తరించుకోడానికి ఈ యాప్ దోహదపడుతుందని తెలిపింది. ఈ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్, ఐవోఎస్ నుంచి డౌన్‌లోడ్ చేసేకోవచ్చు.

మరిన్ని వార్తలు