థామస్‌ కుక్‌ చేతికి డిజిఫొటో

26 Feb, 2019 00:22 IST|Sakshi

51 శాతం వాటా కొనుగోలు

డీల్‌ విలువ రూ.289 కోట్లు

ముంబై: పర్యాటక సేవలందించే థామస్‌ కుక్‌ ఇండియా గ్రూప్‌...ఇమేజింగ్‌ సొల్యూషన్స్, సేవలందించే డిజిఫొటో ఎంటర్‌టైన్మెంట్‌ ఇమేజింగ్‌(డీఈఐ)లో 51 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఈ కొనుగోలు విలువ రూ.289 కోట్లని థామస్‌ కుక్‌ ఇండియా తెలిపింది. ఈ కొనుగోలుకు నియంత్రణ సంస్థల ఆమోదం పొందాల్సి ఉందని పేర్కొంది. డీఈఐలో వాటా కొనుగోలుతో కొత్త వ్యాపారంలోకి ప్రవేశిస్తున్నామని థామస్‌ కుక్‌ ఇండియా సీఎమ్‌డీ మాధవన్‌ మీనన్‌ తెలిపారు. ప్రస్తుతం 25 దేశాల్లో నిర్వహిస్తున్న పర్యాటక సేవలకు అనుబంధంగా కొత్త అవకాశాలను ఈ కొనుగోలు అందించగలదని పేర్కొన్నారు.

సింగపూర్, యూఏఈ, హాంగ్‌కాంగ్, మకావూ, చైనా, అమెరికా తదితర 14 దేశాల్లో 250 నగరాల్లో 120 మంది భాగస్వాములతో డీఈఐ కార్యకలాపాలు నిర్వహిస్తోందని, గత ఏడాదిలో 36 లక్షల లావాదేవీలను నిర్వహించిందని పేర్కొన్నారు. థామస్‌ కుక్‌తో అనుబంధం కారణంగా తమ స్థానం మరింత పటిష్టమవుతుందని డీఈఐ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్, కె. రామకృష్టన్‌ తెలిపారు. 

మరిన్ని వార్తలు