మళ్ళీ దేశీయ మార్కెట్లోకి థామ్సన్ బ్రాండ్

5 Aug, 2015 01:05 IST|Sakshi
మళ్ళీ దేశీయ మార్కెట్లోకి థామ్సన్ బ్రాండ్

తొలుత ఫ్లిఫ్‌కార్ట్ ద్వారా ఎల్‌ఈడీ టీవీల అమ్మకాలు
- రూ. 300 కోట్లతో హైదరాబాద్‌లో తయారీ యూనిట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో:
సుమారు పదేళ్ల విరామం అనంతరం థామ్సన్ బ్రాండ్ దేశీయ మార్కెట్లోకి అడుగు పెడుతోంది. ఇందుకోసం హైదరాబాద్ సమీపంలో రూ. 300 కోట్ల ఇన్వెస్ట్‌మెంట్‌తో తయారీ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసింది. కేవలం థామ్సన్ బ్రాండ్ ఉత్పత్తులను తయారు చేసే విధంగా రిసెల్యూట్ ఎలక్ట్రానిక్స్‌తో కంపెనీ ఒప్పం దం కుదుర్చుకుంది. ఈ యూనిట్ నుంచి తయారైన ఉత్పత్తులను తెలంగాణ రాష్ట్ర ఐటీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.టి.రామారావు మంగళవారం మార్కెట్లోకి లాంఛనంగా విడుదల చేశారు.

వచ్చే మూడేళ్లలో ఈ యూనిట్‌పై రూ. 300 కోట్ల పెట్టుబడితో పాటు, మార్కెటింగ్ కోసం రూ. 50 కోట్లు వ్యయం చేయనున్నట్లు రిసెల్యూట్ ఎలక్ట్రానిక్స్ సీఈవో ఎ.గోపాలకృష్ణ తెలిపారు. ఆగస్టు నెలాఖరు నాటికి ఫ్లిప్‌కార్ట్ ద్వారా మూడు మోడల్స్‌ను మార్కెట్లోకి అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. మార్కెట్ రేటు కంటే 10 నుంచి 12 శాతం తక్కువ ధరకే వీటిని అందించనున్నట్లు తెలిపారు.  వచ్చే ఆరునెలల్లో టీవీల తర్వాత వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజరేటర్లు, ఏసీలను తయారు చేసి విక్రయించనున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా ఏడాదిలోగా 500 స్టోర్లను, ఆ తర్వాత 1,000 స్టోర్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

ఏటా 10 శాతం వృద్ధితో ప్రస్తుతం రూ. 80,000 కోట్లుగా ఉన్న దేశీయ ఎలక్ట్రానిక్ కన్సూమర్ మార్కెట్లో మూడేళ్లలో 5 శాతం వాటాను చేజిక్కించుకోవాలని లక్ష్యంగా పెట్టకున్నట్లు తెలిపారు. ఈ మార్కెట్ పరిమాణం 2020 నాటికి రూ. 1.25 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నట్లు కృష్ణ తెలిపారు. మొదటి ఏడాది రూ. 200 కోట్ల అమ్మకాలను జరుపుతామన్న ధీమా ను ఆయన వ్యక్తం చేశారు. 2000 సంవత్సరంలో అనుబంధ కంపెనీ థామ్సన్ ఇండియా పేరుతో దేశీయ మార్కెట్లోకి అడుగుపెట్టినా వ్యూహాత్మక వ్యాపార నిర్ణయంలో భాగంగా 2005లో వెనక్కి వెళ్ళినట్లు కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు.
 
ఎలక్ట్రానిక్ హబ్‌గా హైదరాబాద్
తమ ప్రభుత్వం పిలుపునిచ్చిన ‘మేకిన్ తెలంగాణ’కు మంచి స్పందన లభిస్తోందని తారకరామారావు తెలిపారు. ఇప్పటికే పలు మొబైల్ కంపెనీలు తయారీ యూనిట్లను ఏర్పాటు చేశాయని, ఇప్పుడు అంతర్జాతీయ కంపెనీ థామ్సన్ కూడా ఇక్కడ యూనిట్ ఏర్పాటు చేయడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. మూడేళ్లలో రూ. 350 కోట్లు వ్యయం చేయడం ద్వారా నేరుగా 500 మందికి పరోక్షంగా మూడు రెట్ల మందికి ఉపాధి లభించనుందన్నారు. అంతర్జాతీయ కంపెనీల రాకతో హైదరాబాద్ ఎలక్ట్రానిక్ హబ్‌గా ఎదుగుతోందన్నారు.

మరిన్ని వార్తలు