రుణ వృద్ధికి ఆ నిధులు సరిపోవు!

8 Jun, 2018 00:49 IST|Sakshi

బ్యాంకింగ్‌కు రూ.2.11 లక్షల కోట్ల తాజా మూలధనంపై మూడీస్‌ విశ్లేషణ  

ముంబై: కేంద్ర ప్రభుత్వం 21 ప్రభుత్వ రంగ బ్యాంకులకు 2017 అక్టోబర్‌లో ప్రకటించిన రూ.2.11 లక్షల కోట్లు బ్యాంకింగ్‌ రుణ వృద్ధికి ఎంతమాత్రం సరిపోవని మూడీస్‌ పేర్కొంది. ఇది కేవలం రెగ్యులేటరీ (నియంత్రణా పరమైన) మూలధన అవసరాలకు తగిన మొత్తమేనని విశ్లేషించింది. 2017–18, 2018–19లకు సంబంధించి బ్యాంకులకు కేంద్రం రూ.2.11 లక్షల కోట్ల తాజా మూలధనాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో ఈ ఏడాది బడ్జెట్‌లో రూ. 65,000 కోట్లు కేటాయించింది. ఈ అంశాలపై మూడీస్‌ వైస్‌ ప్రెసిడెంట్, సీనియర్‌ క్రెడిట్‌ ఆఫీసర్‌ అల్కా అంబరసు అభిప్రాయాల్లో ముఖ్యమైనవి చూస్తే... 
ళి ప్రభుత్వ రంగ బ్యాంకులు మూలధన కొరతను ఎదుర్కొంటున్నాయి. మార్కెట్‌ నుంచి అదనపు క్యాపిటల్‌ను బ్యాంకింగ్‌ సమీకరించుకోలేకపోవడం దీనికి కారణం. ఈ ఏడాది ప్రారంభం నుంచీ ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్‌ ధరలు దాదాపు 19 శాతం తగ్గాయి.  

►కేంద్రం రూ.2.11 లక్షల కోట్ల ప్యాకేజ్‌ని ప్రకటిస్తున్న సమయంలో బ్యాంకులు కూడా ఈక్విటీ మార్కెట్ల నుంచి రూ.58,000 కోట్లు సమీకరించుకోగలవన్న అంచనాతో ఉంది. అయితే ఇప్పటి వరకూ దాదాపు రూ.10,000 కోట్లు మాత్రమే సమీకరించుకోగలిగాయి.  
► అంతర్గత మూలధన సృష్టి సామర్థ్యం ప్రభుత్వ రంగ బ్యాంకులకు గణనీయంగా పడిపోయింది. వాటి బలహీన ఫైనాన్షియల్‌ పరిస్థితులు దీనికి కారణం. ఇక మరోవైపు ప్రభుత్వ బాండ్‌ ఈల్డ్‌ పెరగడం బ్యాంకుల పెట్టుబడుల ఆదాయంపై ప్రభావం చూపుతోంది.  ఆయా అంశాలన్నీ దీర్ఘకాలంలో బ్యాంకింగ్‌ మూల«ధన సమస్యలు సృష్టించేవే. 

భారత్‌ వ్యయాల తగ్గింపు తప్పదు.. 
ఇదిలావుండగా, ప్రభుత్వ ఆదాయాలు– వ్యయాల మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటును స్థూల దేశీయోత్పిత్తి (2018–19)లో 3.3 శాతానికి కట్టడి చేయడం కేంద్రానికి కీలకమని మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌ పేర్కొంది. ఇందుకుగాను వ్యయాలను తగ్గించే అవకాశం ఉందని కూడా విశ్లేషించింది. ‘అంతర్జాతీయంగా తీవ్ర స్థాయిలో ఉన్న చమురు ధరల నేపథ్యంలో, పెట్రోలియం, డీజిల్‌ ప్రొడక్ట్స్‌పై ఎక్సైజ్‌ సుంకాలను తగ్గిస్తే ఇబ్బందే. దీనివల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయాలు తగ్గుతాయి. ద్రవ్యలోటు పెరుగుతుంది. ఇది దేశ సావరిన్‌ క్రెడిట్‌ ప్రొఫైల్‌పై ఒత్తిడి తెచ్చే అంశం’’ అని మూడీస్‌ విశ్లేషించింది. మూడీస్‌ గత ఏడాది 13 యేళ్లలో మొట్టమొదటిసారి భారత్‌ సావరిన్‌ రేటింగ్‌ను స్టేబుల్‌ అవుట్‌లుక్‌తో ‘బీఏఏ2’కు పెంచిన సంగతి తెలిసిందే.  

పీఎస్‌బీల చీఫ్‌లతో నేడు కేంద్రం భేటీ
న్యూఢిల్లీ: పశ్చిమ, దక్షిణాది రాష్ట్రాలు కేంద్రంగా పనిచేస్తున్న ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్‌బీ) చీఫ్‌లతో కేంద్ర ఆర్థిక మంత్రి పియుష్‌ గోయల్‌ శుక్రవారం సమావేశం కానున్నారు. ఆయా బ్యాంకులు ఎదుర్కొంటున్న సమస్యలు, పరిష్కార మార్గాలపై చర్చించనున్నారు. ముంబైలో జరిగే ఈ సమావేశాన్ని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) నిర్వహిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. రెండు ప్రాంతాలకు చెందిన పీఎస్‌బీలకు సంబంధించి 15 మంది సీఈవోలు దీనికి హాజరు కానున్నారు. 2017–18 ఆర్థిక ఫలితాలు వెల్లడైన తర్వాత పీఎస్‌బీల చీఫ్‌లతో కేంద్రం సమావేశం నిర్వహించడం ఇదే తొలిసారి. గత ఆర్థిక సంవత్సరం చాలా మటుకు బ్యాంకులు భారీ నష్టాలు ప్రకటించిన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. మొండిబాకీల పరిష్కారానికి సంబంధించి రిజర్వ్‌ బ్యాంక్‌ నిర్దేశిత దిద్దుబాటు చర్యల (పీసీఏ) పరిధిలో మొత్తం 11 బ్యాంకులు ఉన్నాయి. ఇందులో 7 బ్యాంకులు పశ్చిమ, దక్షిణాది రాష్ట్రాలకు చెందినవే. ఆర్‌బీఐ వాచ్‌లిస్ట్‌లో అలహాబాద్‌ బ్యాంక్, యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, కార్పొరేషన్‌ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్, దేనా బ్యాంక్, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర ఉన్నాయి. నీరవ్‌ మోదీ కుంభకోణం దెబ్బతో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) నాలుగో త్రైమాసికంలో ఏకంగా రూ. 13,417 కోట్లు నష్టం ప్రకటించింది. కుంభకోణానికి సంబంధించిన రూ. 14,356 కోట్ల మొత్తంలో సుమారు సగభాగం .. అంటే రూ. 7,178 కోట్లకు పీఎన్‌బీ ప్రొవిజనింగ్‌ చేసింది. మిగిలిన మొత్తాన్ని ఈ ఆర్థిక సంవత్సరం మరో మూడు త్రైమాసికాల్లో సర్దుబాటు చేయనుంది. మరోవైపు, ఎస్‌బీఐ సైతం జనవరి–మార్చి త్రైమాసికంలో రూ. 7,718 కోట్ల నష్టం నమోదు చేసింది. అంతక్రితం ఏడాది నాలుగో త్రైమాసికంలో నమోదైన రూ. 3,442 కోట్లతో పోలిస్తే ఇది రెట్టింపు.  

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా