మెగా మెర్జర్‌ : మూడు బ్యాంకులు విలీనం

17 Sep, 2018 18:45 IST|Sakshi

దెనా,  విజయ బ్యాంకు, బీవోబీ విలీనం

ఆయా బ్యాంకుల బోర్డు ఆమోదానికి ప్రతిపాదనలు

 మూడవ అతిపెద్ద బ్యాంకుగా విలీన బ్యాంకు

సాక్షి, న్యూఢిల్లీ: ఎనలిస్టులు అంచనా వేసినట్టుగానే మెగా మెర్జర్‌కు కీలక అడుగు పడింది. మూడు ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనానికి ప్రభుత్వం ప్రతిపాదించింది.  ఈ ప్రతిపాదన  మేరకు దెనా బ్యాంక్, విజయ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకులు విలీనానికి సర్వం సిద్దమైంది. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని ఫైనాన్సియల్ సర్వీసెస్ కార్యదర్శి రాజీవ్ కుమార్  సోమవారం వెల్లడించారు. 

ఈ మూడు బ్యాంకుల విలీనం అనంతరం దేశంలోని మూడవ అతిపెద్ద బ్యాంక్‌గా విలీన బ్యాంకు అవతరించనుందని ఆయన పేర్కొన్నారు. బ్యాంకింగ్ రంగంలో విదేశీ కార్యకలాపాల  హేతుబద్ధత బాగా  పుంజుకుందని చెప్పారు.  బ్యాంకుల క్యాపిటల్ అవసరాలపై ప్రభుత్వం శ్రద్ధ వహించడంతోపాటు బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలపై దృష్టిపెట్టినట్టు చెప్పారు.  ఈ విలీన ప్రక్రియలో ఈ మూడు బ్యాంకుల ఉద్యోగుల భద్రతను కాపాడతామన్నారు.  ఈ సందర్భంగా  ఎస్‌బీఐ అనుబంధ బ్యాంకుల విలీనం సందర్భంగా ఎలాంటి ఉద్యోగ నష్టం జరగ లేదని ఆయన గుర్తు చేశారు.  ముఖ్యంగా విలీన ప్రక్రియ పూర్తయ్యేంతవరకు ఈ మూడు బ్యాంకులు  స్వతంత్రంగా వ్యవహరిస్తాయని  రాజీవ్‌ కుమార్‌ స్పష్టం చేశారు. 

అనంతరం ఈ విలీన ప్రతిపాదనలను కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ  మీడియాకు వివరించారు. ఇప్పటికే బలహీనంగా ఉన్నబ్యాంకులను విలీనం చేయడం కాకుండా , రెండు విజయవంతమైన  బ్యాంకుల విలీనం ద్వారా మరో దృఢమైన అతిపెద్ద బ్యాంకును అందుబాటులోకి  తేనున్నామని, ఈ విలీన బ్యాంకుకు  మూలధన మద్దతును కూడా అందిస్తామని తెలిపారు.  దీనిపై ఆయా బ్యాంకుల  బోర్డుల తుది ఆమోదం తర్వాత  విలీనం అమల్లోకి వస్తుందని చెప్పారు. అలాగే మూడు  బ్యాంకులకు చెందిన  ఉద్యోగలు, ఖాతాదారుల భద్రతపై పూర్తి హామీ ఇచ్చారు.

మరిన్ని వార్తలు