స్టార్టప్స్ కోసం ‘బిలియన్ డాలర్ బేబీస్’

19 Dec, 2014 01:08 IST|Sakshi
స్టార్టప్స్ కోసం ‘బిలియన్ డాలర్ బేబీస్’

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో:  అంతర్జాతీయంగా భారీ స్థాయిలో ఎదగాలనే ఆకాంక్ష గల హైదరాబాదీ స్టార్టప్ సంస్థలకు ఊతం ఇచ్చేందుకు ది ఇండస్ ఎంట్రప్రెన్యూర్స్ (టై) హైదరాబాద్ విభాగం  గురువారం బిలియన్ డాలర్ బేబీస్ ప్రాజెక్టును ఆవిష్కరించింది. బిలియన్ డాలర్ల కంపెనీలుగా ఎదిగే సత్తా ఉన్న భారతీయ సంస్థలను గుర్తించి, ప్రోత్సహించడం ఈ ప్రాజెక్టు ముఖ్యోద్దేశమని ఈ సందర్భంగా టై సిలికాన్ వ్యాలీ ప్రెసిడెంట్ వెంకటేష్ శుక్లా  తెలిపారు.

దీని కింద ఎంపికైన దేశీ స్టార్టప్స్‌కు  టై సిలికాన్ వ్యాలీకి చెందిన వ్యాపారవేత్తలు, వెంచర్ క్యాపిటలిస్టులు మొదలైన వారి నుంచి వ్యాపార మెళకువలు తదితర అంశాలపై తోడ్పాటు లభించగలదని శుక్లా పేర్కొన్నారు. అలాగే, టై సీఐవో ఫోరం మొదలైన వాటిల్లో పాల్గొనవచ్చని.. అకౌంటింగ్, చట్టాలు, హైరింగ్, మార్కెటింగ్ వంటి  అంశాల్లోనూ సహాయ, సహకారాలు లభిస్తాయన్నారు. నూతనంగా కంపెనీలను ఏర్పాటు చేసుకునే వారికి బిలియన్ డాలర్ బేబి ప్రాజెక్టు ఎంతగానో ఉపయోగపడుతుందని కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ చీఫ్ సెక్రటరీ ప్రదీప్ చంద్ర పేర్కొన్నారు.

హైదరాబాద్ యువత వద్ద వినూత్న వ్యాపార ఐడియాలు పుష్కలంగా ఉన్నాయని, ప్రాజెక్టులో పాల్గొనే ఇతర స్టార్టప్స్‌కి గట్టినివ్వగలరని టై హైదరాబాద్ విభాగం ప్రెసిడెంట్ మురళి బుక్కపట్నం తెలిపారు. హైదరాబాద్‌లో ఔత్సాహిక వ్యాపారవేత్తలకు తెలంగాణ ప్రభుత్వం తోడ్పాటు అందిస్తోండటం హర్షణీయమని ఆయన చెప్పారు. అంతర్జాతీయంగా ఎదగాలనుకునే దేశీ తయారీ సంస్థలు ఈ ప్రాజెక్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇవి ఇప్పటికే వెంచర్/ఏంజెల్ ఫండింగ్ పొంది ఉండటంతో పాటు .. ఇటు దేశీయంగాను.. అటు విదేశాల్లోనూ చెప్పుకోతగిన ఫలితాలు సాధించి ఉండాలి. కంపెనీ సహ-వ్యవస్థాపకుల్లో ఎవరో ఒకరు సిలికాన్ వ్యాలీలో నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అక్కడే ఉండాల్సి ఉంటుంది.

మరిన్ని వార్తలు