యాపిల్ సెంటర్ ఆరంభం

20 May, 2016 00:39 IST|Sakshi
యాపిల్ సెంటర్ ఆరంభం

టిమ్ కుక్‌తో కలసి ప్రారంభించిన సీఎం కేసీఆర్
దాదాపు 4వేల ఉద్యోగాలొస్తాయన్న యాపిల్ సీఈఓ
అత్యుత్తమ ఉత్పత్తులను అందిస్తామని వ్యాఖ్య
క్యాంపస్ ఏర్పాటు చేయాలని కోరిన కేటీఆర్

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : టెక్నాలజీ దిగ్గజం యాపిల్ తాజాగా మ్యాప్స్ అభివృద్ధి కార్యకలాపాల కోసం హైదరాబాద్‌లో తమ కార్యాలయాన్ని ప్రారంభించింది. కంపెనీ సీఈవో టిమ్ కుక్, తెలంగాణ ఐటీ మంత్రి కె.టి.రామారావు సమక్షంలో తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర రావు గురువారం దీన్ని ప్రారంభించారు. స్థానికంగా సమర్ధులైన నిపుణుల లభ్యతను కుక్ ఈ సందర్భంగా ప్రశంసించారు. మరింత మంది భాగస్వాములతో చేతులు కలపడం ద్వారా కార్యకలాపాలను పెంచుకుంటామన్నారు. ‘మేం అందరికన్నా ముందుగా కొత్త ఉత్పత్తులు ఆవిష్కరించకపోవచ్చు.

కానీ ఎప్పుడూ ఉత్తమమైనవే అందించేందుకు ప్రయత్నిస్తాం. మారుతున్న కాలానికి అనుగుణంగా, ప్రపంచాన్ని మరింత మెరుగ్గా మార్చే.. జీవితాలను ప్రభావితం చేసే అత్యుత్తమ ఉత్పత్తులను ప్రపంచానికి అందించడంలో యాపిల్ ఎప్పుడూ ముందుంటుంది’ అని కుక్ చెప్పారు. మ్యాప్స్ డెవలప్‌మెంట్ సెంటర్‌పై పెట్టుబడులను వెల్లడించని యాపిల్... దీని ద్వారా దాదాపు 4,000 దాకా ఉద్యోగాలొస్తాయని ఒక  ప్రకటనలో తెలియజేసింది. ప్రస్తుతం సుమారు 6,40,000 పైచిలుకు ఐవోఎస్ యాప్ డెవలపర్స్, ఐవోఎస్ సంబంధిత ఉద్యోగాలకు తోడ్పాటునిస్తున్నట్లు తెలిపింది.

అయిదు రోజుల పర్యటన కోసం టిమ్ కుక్  భారత్‌కు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా టాటా గ్రూప్ చైర్మన్ సైరస్ మిస్త్రీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, టీసీఎస్ ఎండీ ఎన్.చంద్రశేఖరన్, ఐసీఐసీఐ బ్యాంక్ చీఫ్ చందా కొచర్ తదితరులతో భేటీ ఆయ్యారు. పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీతో కూడా సమావేశమవుతారు. మ్యాప్స్ ప్రాజెక్టు కోసం యాపిల్ తమతో జట్టు కట్టడంపై ఐటీ సేవల సంస్థ ఆర్‌ఎంఎస్‌ఐ సీఈవో అనూప్ జిందాల్ హర్షం వ్యక్తం చేశారు.

క్యాంపస్ కూడా ఏర్పాటు చేయాలి: కేటీఆర్
యాపిల్ సొంత క్యాంపస్‌ను కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలని, అలాగే టెక్నాలజీ ఇంక్యుబేటర్ టీ-హబ్‌తో కూడా చేతులు కలపాలని ఈ సందర్భంగా టిమ్ కుక్‌ను కేటీఆర్ కోరారు. మ్యాప్స్ డెవలప్‌మెంట్ ఆఫీస్ ఏర్పాటుకు హైదరాబాద్‌ను యాపిల్ ఎంపిక చేసుకోవడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ క్రియాశీలకతకు, మెరుగైన మౌలిక సదుపాయాలు, పుష్కలంగా నిపుణుల లభ్యతకు ఇది నిదర్శనమని చెప్పారు. యాపిల్ కార్యాలయంతో స్థానికంగా వేల కొద్దీ ఉద్యోగాల కల్పన జరుగుతుందని కేటీఆర్ పేర్కొన్నారు.

మరోవైపు యాపిల్ రాకతో అమెరికా వెలుపల భారీ కార్యాలయాలున్న అయిదు అతి పెద్ద దిగ్గజాల్లో నాలుగు సంస్థలకు హైదరాబాద్ కేంద్రమైనట్లయిందని కేటీఆర్ ట్వీట్ చేశారు. మైక్రోసాఫ్ట్, అమెజాన్‌లు ఇప్పటికే ఉండగా.. గత మేలో గూగుల్ వచ్చిందని, తాజాగా ఈ ఏడాది మే లో యాపిల్ కార్యాలయం ప్రారంభించిందని ఆయన పేర్కొన్నారు. రెండు రోజుల క్రితం తాను ప్రస్తావించిన గొప్ప విశేషం గురించి స్పందిస్తూ.. ‘నేను చెప్పిన గొప్ప వార్త బహుశా బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడన్న దానికి సమాధానం అయి ఉంటుందని మీరంతా అనుకుంటూ ఉండొచ్చు. కానీ ఆ విషయం నాకూ తెలియదు. కావాలంటే మిత్రుడు రానా దగ్గుబాటినే అడగాలి’ అంటూ సరదాగా వ్యాఖ్యానించారు.

 కీలకంగా భారత మార్కెట్..: యాపిల్‌కు ఇప్పటిదాకా అమెరికా తర్వాత రెండో అతి పెద్ద మార్కెట్ చైనానే. ఇప్పటిదాకా అటువైపే మొగ్గు చూపిన కంపెనీ... భారత్‌పై పెద్దగా దృష్టి పెట్టలేదు. అయితే, ఇటీవల చైనాలో అమ్మకాలు మందగించడంతో పాటు ఐట్యూన్స్ స్టోర్ ద్వారా అందించే ఐమూవీ, ఐబుక్స్ మొదలైన సర్వీసులను అక్కడి ప్రభుత్వం అకస్మాత్తుగా మూసివేసింది. ఈ పరిణామాలతో కంపెనీ కలవరపడుతోంది. చాలా కాలం తర్వాత ఇటీవలి త్రైమాసికంలో కంపెనీ లాభాలు కూడా 12 శాతం క్షీణించాయి. అదే సమయంలో భారత్‌లో అమ్మకాలు మెరుగవుతుండటం కనిపించింది.

ఈ నేపథ్యంలో వంద కోట్లకు పైగా జనాభా గల, ప్రపంచంలోనే రెండో అతి పెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్ అయిన భారత్‌పై యాపిల్ దృష్టి పెట్టింది. ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్‌ఫోన్ల ఆధిపత్యం ఉన్న భారత మార్కెట్లో చొచ్చుకుపోయేందుకు ప్రణాళికలు వేస్తోంది. ఇటీవలే ఐఫోన్ ఎస్‌ఈని కూడా ఇక్కడి యూజర్లను దృష్టిలో పెట్టుకునే విడుదల చేసింది. ఈ పరిణామాలన్నింటి దరిమిలా టిమ్ కుక్ భారత పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.

 ఐ లవ్ హైదరాబాద్..
‘ఈ పర్యటనలో నేను ప్రధానంగా భారతీయుల ఆదరాభిమానాలు, సంస్కృతి గురించి తెలుసుకున్నాను. ఎంతో నేర్చుకున్నాను. నా స్వదేశం సహా నేను పర్యటించిన మిగతా ఏ దేశం కూడా దీనికి సాటి రాదు. ఇనుమడించిన ఉత్తేజంతో తిరిగి వెడతాను. కేసీఆర్ గారూ!.. ఇప్పటికే హైదరాబాద్ అంటే నాకు చాలా ఇష్టం. మీరు చూపిన ఆదరాభిమానాలు ఎంతగానో నచ్చాయ్’ అని కుక్ వ్యాఖ్యానించారు. కుక్.. రాక్‌స్టార్: షారూక్
ముంబై: బాలీవుడ్ సూపర్‌స్టార్ షారూక్ ఖాన్.. యాపిల్ సీఈవో టిమ్ కుక్‌కు తన బంగ్లా మన్నత్‌లో విందును ఏర్పాటు చేశారు. దీనికి బాలీవుడ్‌లోని అతిరథులందరూ విచ్చేశారు. అమితాబ్ బచ్చన్, ఆయన భార్య జయ, కుమారుడు అభిషేక్, కోడలు ఐశ్వర్య రాయ్, అమీర్ ఖాన్, మాధురి దీక్షిత్, ఏఆర్ రెహ్మాన్, సానియా మీర్జా తదితర ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా షారూక్.. టిమ్ కుక్‌ను రాక్‌స్టార్ అంటూ కొనియాడారు. కుక్‌తో ఫోటోలు దిగి వాటిని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు.

మరిన్ని వార్తలు