వడ్డీ రేట్ల కోతకు సరైన సమయమిదే

6 Nov, 2014 00:42 IST|Sakshi
వడ్డీ రేట్ల కోతకు సరైన సమయమిదే

 న్యూఢిల్లీ: దేశీ ఆర్థిక వ్యవస్థలో సానుకూల పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో వృద్ధికి ఊతమిచ్చే దిశగా రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను తగ్గించడంపై దృష్టి పెట్టేందుకు ఇది సరైన సమయమని మహీంద్రా గ్రూప్ సీఎండీ ఆనంద్ మహీంద్రా అభిప్రాయపడ్డారు. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతున్న తరుణంలో ఈ అవకాశాన్ని చేజారనివ్వకూడదని, పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు.

భారత ఆర్థిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా మహీంద్రా ఈ విషయాలు చెప్పారు. ధరల కట్టడి కోసం ఆర్‌బీఐ గవర్నర్ ఇప్పటిదాకా భేషైన చర్యలే తీసుకున్నారని మహీంద్రా కితాబిచ్చారు. ‘నియంతలాగా కొరడా ఝుళిపించి మరీ ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తేగలిగే వ్యక్తి అవసరం నెలకొందన్న విషయాన్ని ఎవరూ విస్మరించరాదు. ఆ పనిని ఆయన అద్భుతంగా నిర్వర్తించారు. ఆర్థిక క్రమశిక్షణకు సంబంధించి ప్రపంచానికి ఆయన సానుకూల సంకేతాలు పంపారు’ అని పేర్కొన్నారు.

అయితే, ప్రస్తుతం పరిస్థితులు మారినందున ఎకానమీని అధిక వృద్ధి బాట పట్టించేందుకు విభిన్నమైన విధానాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉంటుందని మహీంద్రా చెప్పారు. మరోవైపు మళ్లీ రెండంకెల స్థాయి వృద్ధి సాధించే విషయంపై స్పందిస్తూ.. రాత్రికి రాత్రి అద్భుతాలను ఆశించకూడదన్నారు. సరైన పనులు చేస్తూ, సరైన స్థాయిలో సంస్కరణలతో పాటు వడ్డీ రేట్ల తగ్గుదల వంటి అంశాలు తోడైతే వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం నుంచి వృద్ధి మరింత మెరుగుపడగ లిగే సంకేతాలు కనిపించగలవని మహీంద్రా చెప్పారు.

 రేటు తగ్గించినా పెట్టుబడులకు ఊతం ఉండదు: క్రిసిల్
 ఇటీవలి ఎకానమీ మందగమనానికి, అధిక వడ్డీ రేట్లకు సంబంధమేమీ లేదని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ ఒక నివేదికలో తెలిపింది. విధానపరమైన అనిశ్చితి, దేశీయంగా డిమాండ్ అంతంత మాత్రంగా ఉండటమే ఎకానమీ మందగమనానికి కారణమని వివరించింది. ప్రస్తుతం రెపో రేటును ఆర్‌బీఐ తగ్గించినా పెట్టుబడులకు పెద్దగా ఊతం ఇవ్వకపోవచ్చని తెలిపింది.

వడ్డీ రేట్లను తగ్గించాలంటూ పారిశ్రామిక దిగ్గజాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో క్రిసిల్ నివేదిక ప్రాధాన్యం సంతరించుకుంది. పెట్టుబడులపై అధిక రాబడులు వచ్చే విధంగా ప్రభుత్వం విధానపరంగా పరిస్థితులను మెరుగుపరిస్తే ప్రయోజనం ఉండగలదని క్రిసిల్ తెలిపింది.

మరిన్ని వార్తలు