వాణిజ్య యుద్ధం ముదిరితే... పసిడి పైకే!

8 Jul, 2018 23:51 IST|Sakshi

అంతర్జాతీయ వాణిజ్య యుద్ధం మరింత తీవ్రతరమైతే, వృద్ధి మందగమన పరిస్థితుల్లో బంగారం ధర మరింత పెరగడం ఖాయమని కొందరు నిపుణులు అంచనావేస్తున్నారు. ప్రత్యేకించి ఈ సందర్భంలో చైనా అమెరికా బాండ్లను విక్రయించి, బంగారం కొనుగోలుకు మొగ్గుచూపే అవకాశం ఉందని, ఇది బంగారం ధర పెరుగుదలకు సానుకూల అంశమని విశ్లేషనలు వినిపిస్తున్నాయి. ఇక డాలర్‌ ఇండెక్స్‌కు 95 వద్ద గట్టి నిరోధం ఎదురవుతోంది. ఇది పసిడికి బలాన్ని ఇచ్చే అంశమని విశ్లేషణ. శుక్రవారంతో ముగిసిన వారంలో డాలర్‌ ఇండెక్స్‌ 93.76 వద్ద ముగిసింది. వారం మొదట్లో 94.80 స్థాయిలో ఉంది.  

వారంలో భారీ ఒడిదుడుకులు...
నైమెక్స్‌లో (31.1గ్రా) ధర సోమవారం ప్రారంభంలో 1,252 డాలర్ల వద్ద ఉంది. మంగళవారం భారీగా 1,238 డాలర్ల స్థాయికి పడిపోయింది. అయితే ఈ స్థాయిలో కొనుగోళ్ల మద్దతు లభించడంతో తదుపరి రోజుకు 1,262 డాలర్లకు చేరింది. వారం చివరకు 1,256 డాలర్ల వద్ద ముగిసింది. 

టెక్నికల్‌ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, దీర్ఘకాలికంగా పసిడి  ‘ఇన్‌వర్స్‌ హెడ్‌ అండ్‌ షోల్డర్‌ ప్యాట్ర న్‌లో ఉంది. నెక్‌లైన్‌పైన ఇది స్థిరీకరణ జరిగి, (1,400 డాలర్ల) బ్రేక్‌ అయితే, పసిడి 1,700 డాలర్ల దిశగా ముందుకుసాగే అవకాశం ఉంది. గత నెల వరకూ పసిడి 1,370–1,310 డాలర్ల మధ్య తిరిగిన సంగతి తెలిసిందే.  

దేశీయంగా స్వల్ప లాభాలు..
కాగా దేశీయంగా ప్రధాన ముంబై మార్కెట్లో 99.5, 99.9 స్వచ్ఛత 10 గ్రామల ధర రూ.210 చొప్పున ఎగసి రూ.30,680, రూ.30,530 స్థాయికి ఎగశాయి. దేశీయ ఫ్యూచర్స్‌ మార్కెట్‌– ఎంసీఎక్స్‌లో ధర 30,560 వద్ద ముగిసింది.  ఇక డాలర్‌ మారకంలో రూపాయి విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో శుక్రవారం 68.76 వద్ద ముగిసింది.   


నిపుణుల అంచనా

మరిన్ని వార్తలు