‘జెట్‌’ కూలిపోయిందా.. కూల్చేశారా?

15 May, 2019 00:08 IST|Sakshi

జెట్‌ ఎయిర్‌వేస్‌ సంక్షోభంపై ఎన్నో అనుమానాలు

 ప్రమోటర్లు నిధులు మళ్లించినట్టు ఆరోపణలు

ఇప్పటికే ఆర్‌వోసీ దర్యాప్తు  

ఎస్‌ఎఫ్‌ఐవో దర్యాప్తుతో వెలుగుచూడనున్న వాస్తవాలు

  రుణాలిచ్చిన బ్యాంకుల చేతుల్లోకి నియంత్రణ 

 అయినా నిధులు సాయం చేయకపోవడంపై సందేహాలు

 కొనుగోలుదారుల కోసం అన్వేషణ 

 దీన్నో స్కామ్‌గా అభివర్ణిస్తున్న ప్రతిపక్ష కాంగ్రెస్‌

  ఇన్ని జరిగినా జెట్‌ ఎయిర్‌వేస్‌ షేరు పట్ల ఆసక్తి

సాక్షి, బిజినెస్‌ డెస్క్‌: విమానయాన రంగంలో 25 ఏళ్లకు పైగా దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తూ అగ్రగామి సంస్థల్లో ఒకటిగా గుర్తింపు పొందిన జెట్‌ ఎయిర్‌వేస్‌ ఉన్నట్టుండి కుప్పకూలడం వెనుక ఏం జరిగి ఉంటుంది...? ఈ మధ్య కాలంలో వచ్చిన చిన్నా చితకా ఎయిర్‌లైన్‌ కంపెనీలు సర్వీసులను చక్కగా నడిపిస్తుంటే, దశాబ్దాల చరిత్ర ఉన్న జెట్‌ ఎందుకలా రెక్కలు తెగిన విహంగంలా కూలిపోయింది...? కేవలం చమురు ధరల పెరుగుదల, రుణాల భారమే ఈ సంస్థను ముంచేసిందా? లేక కావాలనే ముంచేశారా? సంస్థ ప్రమోటర్‌ నరేష్‌గోయల్‌ నిధులను పక్కదారి పట్టించారా? భారీగా రుణాలిచ్చిన బ్యాంకులు జెట్‌ఎయిర్‌వేస్‌ స్టీరింగ్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్న తర్వాతే ఎందుకు ఉన్న ఫళంగా జెట్‌ కార్యకలాపాలు నిలిచిపోయాయి? ప్రీ ప్లాన్‌ ప్రకారం తీసుకొచ్చిన సంక్షోభమా ఇది? విశ్లేషకులు, విమానయాన పరిశ్రమ వర్గాలు, ఆఖరికి జెట్‌ ఎయిర్‌వేస్‌ ఉద్యోగులను తొలుస్తున్న ప్రశ్నలు ఇవి. వీటికి సమాధానాలు ఎవరిస్తారు..? 

స్వామి సంచలన ట్వీట్‌ 
‘‘ప్రభుత్వం జాగ్రత్త పడాలి. ఇద్దరు మంత్రులు జెట్‌ ఎయిర్‌వేస్‌ను స్పైస్‌జెట్‌కు విక్రయించేందుకు మానిప్యులేట్‌ చేస్తున్నారు. తెరవెనుక అసలు యజమానులు ఎవరన్నది తర్వాత వెల్లడిస్తాను. ప్రభుత్వం ముందున్న ఆప్షన్‌ జెట్‌ ఎయిర్‌వేస్‌ను ఎయిర్‌ ఇండియాతో విలీనం చేయడమే. ఎందుకంటే రెండు వైపులా ఎయిర్‌స్పేస్‌ విషయంలో ప్రభుత్వానిదే జోక్యం ఉంటుంది’’ అని బీజేపీ ప్రముఖ నేత సుబ్రమణ్యస్వామి గత నెల 21న చేసిన ట్వీట్‌. అంటే స్పైస్‌జెట్‌ ప్రమోటర్‌ అజయ్‌ సింగ్‌ తెరవెనుక ఎవరో ఈ కథ అంతా నడిపిస్తున్నట్టు స్వామి మాటల్లో వ్యక్తమైన సందేహంలా కనిపిస్తోంది. తిరిగి స్వామి బయటపెట్టే వరకూ అసలు కథ ఎవరికీ తెలియదేమో! 

నిధుల మళ్లింపుపై ఫిర్యాదు 
ఐసీఐసీఐ బ్యాంకు–వీడియోకాన్‌ రుణ బంధం వెనుక బ్యాంకు మాజీ చీఫ్‌ చందా కొచర్, ఆమె భర్త దీపక్‌ కొచర్‌కు ప్రయోజన లబ్ధి కలిగిందంటూ ఓ ఫిర్యాదుతో సంచలన దర్యాప్తునకు కారణమైన ప్రజా వేగు అరవింద్‌ గుప్తా గుర్తుండే ఉంటుంది. ఆ వ్యక్తే జెట్‌ ఎయిర్‌వేస్‌లో నిధుల మళ్లింపుపై దర్యాప్తు సంస్థల తలుపు తట్టారు. జెట్‌ ఎయిర్‌వేస్‌ ప్రమోటర్లు కంపెనీ పుస్తకాల నుంచి రూ.5,125 కోట్లను దారి మళ్లించినట్టు ఆయన ఆరోపణ. ఈ నిధుల మళ్లింపును కంపెనీ ఆడిటింగ్‌ కంపెనీ నిరోధించలేకపోయిందంటూ 2018 ఆగస్ట్‌లో అరవింద్‌ గుప్తా ఫిర్యాదు చేశారు. 2018–19 ఆర్థిక సంవత్సరం జూన్‌ త్రైమాసికం ఫలితాలను జెట్‌ ఎయిర్‌వేస్‌ సకాలంలో వెల్లడించలేదు. వాయిదా వేసింది.

అదే సమయంలో అరవింద్‌ గుప్తా ఫిర్యాదుతో కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ పరిధిలోని రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌ (ఆర్‌వోసీ) ముంబై విభాగం జెట్‌ఎయిర్‌వేస్‌ ఖాతాల తనిఖీ చేపట్టింది. కంపెనీల చట్టం నిబంధనల ఉల్లంఘన జరిగినట్టు, నిధుల మళ్లింపు ప్రయత్నాలను గుర్తించినట్టు అధికార వర్గాల సమాచారం. ఈ నివేదికను ఆర్‌వోసీ కార్పొరేట్‌ శాఖకు ఈ నెల 8నే సమర్పించింది. ఆర్‌వోసీ గుర్తించిన అంశాల పట్ల కార్పొరేట్‌ శాఖ సంతృప్తి చెంది, నిధుల మళ్లింపుపై పూర్తి స్థాయి దర్యాప్తు అవసరం అని భావిస్తే తీవ్ర మోసాల దర్యాప్తు విభాగం (ఎస్‌ఎఫ్‌ఐవో) విచారణకు ఆదేశించే అవకాశాలు ఉంటాయని అధికార వర్గాలు తెలిపాయి. జెట్‌ ఎయిర్‌వేస్‌ ప్రమోటర్‌ నరేష్‌ గోయల్‌కు చెందిన కంపెనీలతో జెట్‌ ఎయిర్‌వేస్, జెట్‌లైట్‌ లావాదేవీలు నిర్వహించాయని అరవింద్‌ గుప్తా ఆరోపణలు. ఈ ఆరోపణల్లోని నిజానిజాలు త్వరలో నిగ్గు తేలాల్సి ఉంది. 

జెట్‌ ఆగిపోవడం ఓ స్కామ్‌: ఆనంద్‌శర్మ 
జెట్‌ఎయిర్‌వేస్‌ కూలిపోవడాన్ని స్కామ్‌గా కాంగ్రెస్‌ పార్టీ నేత ఆనంద్‌శర్మ ఆరోపించారు. ‘‘ఇదో పెద్ద స్కామ్‌గా నాకు అనిపిస్తోంది. ఎన్నికల సమయంలో దీన్ని అమలు చేశారు. దీంతో ఈ సమయంలో దీన్ని ఎవరూ ప్రశ్నించరు’’ అని శర్మ అన్నారు. కేంద్రం కాపాడుతున్న ఇతర వ్యాపారాలతో పోలిస్తే జెట్‌ రుణ భారం తక్కువేనన్నారు. ఎయిర్‌లైన్స్‌కు కావాల్సిన అత్యవసర నిధులను అందించేందుకు రుణదాతల కమిటీ తిరస్కరించడంపై సందేహాలు వ్యక్తం చేశారు. 

బ్యాంకుల ఆధ్వర్యంలో మూత 
1992లో ఏర్పాటై 1995లో పూర్తి స్థాయి విమానయాన సంస్థగా కార్యకలాపాలు ఆరంభించిన జెట్‌ ఎయిర్‌వేస్‌... 2019 ఏప్రిల్‌ 17న తన కార్యకలాపాలను నిలిపివేసింది. దీనికంటే ముందు నిధుల సమీకరణకు కంపెనీ దాదాపు తీవ్రంగానే ప్రయత్నించింది. 3 నెలలుగా 20,000 మంది ఉద్యోగులకు వేతనాలు కూడా చెల్లించలేదు. బ్యాంకులకు రూ.8,000 కోట్లకు పైగా రుణ బకాయిలు చెల్లించాల్సి ఉంది. చివరకు కార్యకలాపాలను నిలిపివేయడంతో 20వేల ఉద్యోగులు రోడ్డున పడ్డారు. నరేష్‌ గోయల్‌ నిర్వహణలో జెట్‌ మొత్తం రూ.13,000 కోట్ల మేర నష్టాలను మూటగట్టుకున్నట్టు తెలుస్తోంది. 120 విమానాలతో నిత్యం 600 విమాన సర్వీసులను నడిపిన ఘన చరిత జెట్‌ ఎయిర్‌వేస్‌ది. చివరికి కార్యకలాపాలు నిలిపివేసే నాటికి సంస్థ వద్దనున్న విమానాలు కేవలం 7. లీజుకిచ్చిన సంస్థలు తమ విమానాలను స్వాధీనం చేసుకున్నాయి. జెట్‌ ఎయిర్‌వేస్‌ స్లాట్‌లను తాత్కాలికంగా ప్రభుత్వం ఇతర సంస్థలకు కేటాయించేసి చేతులు దులుపుకుందే గానీ సంస్థను కాపాడే యత్నాలు చేయలేదన్న విమర్శలు ఉన్నాయి.  అయితే, జెట్‌ ఎయిర్‌వేస్‌కు రుణాలిచ్చిన సంస్థలకు లీడ్‌బ్యాంకర్‌ ఎస్‌బీఐ. రుణాలిచ్చిన సంస్థలు తమ రుణాలను జెట్‌లో వాటాలుగా మార్చుకుని మెజారిటీ వాటాదారులుగా అవతరించాయి. ప్రమోటర్‌ నరేష్‌ గోయల్‌ను చైర్మన్‌ పదవి నుంచి తప్పుకునేలా చేశాయి కూడా. జెట్‌ ఎయిర్‌వేస్‌ ఉద్యోగుల వేతనాల చెల్లింపులు, రోజువారీ కార్యకలాపాల నిర్వహణకు తక్షణం రూ.1,500 కోట్లు అవసరం కాగా, వాటిని బ్యాంకులు సమకూరుస్తాయన్న ఆశ చిగురించింది. నిజానికి బ్యాంకులు రూ.1,500 కోట్ల నిధుల సాయానికీ తొలుత ఆసక్తి తెలిపినప్పటికీ... వాటాదారులుగా మారాక ఎందుకో వెనుకడుగు వేశాయి. ఏప్రిల్‌ 15 నాటి సమావేశంలో ఏకాభిప్రాయానికి రాకపోవడంతో నిధులు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకోలేదు. డిపాజిట్‌ దారులు, తమ చట్టబద్ధమైన ప్రయోజనాల కోణంలోనే ప్రభుత్వరంగ బ్యాంకుల నిర్ణయం తీసుకున్నట్టు నాడు కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ సెలవిచ్చారు. అయితే, జెట్‌ నిర్వహణను నియంత్రణలోకి తీసుకున్న బ్యాంకులు, రూ.1,500 కోట్ల ఇచ్చేందుకు ముందుకు రాకుండా, తర్వాత రెండు రోజులకు ఏప్రిల్‌ 17న సంస్థ మూసివేతకు కారణమయ్యాయి. రోజువారీ కార్యకలాపాలు జరిగేలా చూసి, జెట్‌ను విక్రయానికి పెడితే ఇన్వెస్టర్లు త్వరగా ముందుకు వచ్చేవారేమో. కానీ, విమానాలన్నీ కిందకు దించేసి, రుణదాతలు విక్రయానికి మొగ్గు చూపడం సందేహాలకు తావిచ్చినట్టయింది.

షేరు ధర సయ్యాట 
జెట్‌ఎయిర్‌వేస్‌ 2018–19 ఆర్థిక సంవత్సరం జూన్‌ త్రైమాసికం ఫలితాలను వాయిదా వేయడం ఈ సంక్షోభానికి ఆరంభంగా చెప్పుకోవచ్చు. అప్పటి నుంచి కంపెనీ షేరు ధర తీవ్ర హెచ్చు తగ్గులకు లోనవుతూ వచ్చింది. 2018 జనవరి 5న జెట్‌ ఎయిర్‌వేస్‌ షేరు రూ.870 స్థాయిలో ఉంది. 2018 అక్టోబర్‌ 1 నాటికి రూ.172 స్థాయికి పడిపోయింది. ఆ తర్వాత టాటాలు జెట్‌ ఎయిర్‌వేస్‌ను సొంతం చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు వచ్చిన వార్తలతో ఈ షేరు ధర ఈ స్థాయి నుంచి నెల రోజుల్లోనే రూ.323 వరకు పెరిగింది. తిరిగి అక్కడి నుంచి తాజాగా రూ.129 స్థాయికి పడిపోయింది. షేరు ఏడాది గరిష్ట, కనిష్ట ధరలు రూ.489, రూ.121. 

మళ్లీ టేకాఫ్‌ అవుతుందా...?

బ్యాంకులు జెట్‌ఎయిర్‌వేస్‌కు బిడ్లు పిలిచాయి. నాలుగు సంస్థలు బిడ్లు వేశాయి కూడా. వీటిల్లో ఎతిహాద్‌ కూడా ఉంది. జెట్‌ను తాము టేకోవర్‌ చేస్తాం, రుణాలన్నీ తీర్చేస్తామంటూ పైలెట్లు, ఇంజినీర్లకు ప్రాతినిధ్యం వహించే రెండు ఉద్యోగ సంఘాలు– ఎస్‌డబ్ల్యూఐపీ, జేఏఎమ్‌ఈవీఏలు ఎస్‌బీఐని లేఖ ద్వారా కోరాయి. అయినా వారికి అవకాశం ఇవ్వలేదు. తమ నియంత్రణలోకి తీసుకుని రూపాయి కూడా విదిల్చలేదు. కానీ, నిలువునా అమ్మేసి తమ బకాయిలను రాబట్టుకునే పనిపై దృష్టి పెట్టాయి ఎస్‌బీఐ ఆధ్వర్యంలోని రుణదాతలు. చివరికి ఏ సంస్థకు జెట్‌ను అప్పగిస్తాయో, అందులో ఎవరి ప్రయోజనం నెరవేరుతుందో వేచి చూడాల్సి ఉంది. అలాగే, సుబ్రమణ్యస్వామి ఆరోపణలు, ఇటు జెట్‌ ఉద్యోగుల ఆరోపణలు, ప్రజావేగు ఫిర్యాదులోని నిజా నిజాలే నిగ్గుతేలాల్సి ఉంది.

కింగ్‌ఫిషర్‌–జెట్‌... అప్పులే ముంచాయ్‌
విజయ్‌మాల్యాకు చెందిన కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్, జెట్‌ ఎయిర్‌వేస్‌ పరిణామాలకు పోలిక కనిపిస్తుంది. ఈ రెండూ భారీగా అప్పులు తీసుకుని హారతి కర్పూరంగా మార్చి, తిరిగి చెల్లించలేక చేతులెత్తేసినవే. కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ షేరు 2008లో రూ.90కు పైగా పలికింది. చివరికి కార్యకలాపాలు మూసేసే నాటికి పడిపోతూ వచ్చి రూపాయి వరకు దిగొచ్చింది. చివరికి డీలిస్ట్‌ అయింది. నాడు కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌కు రుణాలిచ్చిన సంస్థలు ఇప్పుడు దాని ప్రమోటర్‌ విజయ్‌మాల్యాను వెంటాడుతూ, వేటాడుతున్నాయి. కానీ, కింగ్‌ఫిషర్‌ను నిలబెట్టే ప్రయత్నం చేయలేదు. కానీ, జెట్‌ ఎయిర్‌వేస్‌లో మాత్రం వాటాదారులుగా మారి ఆ సంస్థను మరెవరికో కట్టబెట్టే ప్రయత్నాలు చేస్తున్నాయి. నిజానికి జెట్‌ ఎయిర్‌వేస్‌ షేరు ఇంత జరిగినా రూ.120 స్థాయిలకు పైనే ఉందంటే జెట్‌ ఎదో ఒక గట్టి సంస్థ చేతుల్లోకి వెళ్లి, తిరిగి ఎగురుతుందన్న ఆశ ఇన్వెస్టర్లలో ఉండి ఉండొచ్చన్న విశ్లేషణ అనలిస్టుల నుంచి వినిపిస్తోంది. జెట్‌ఎయిర్‌వేస్‌ విషయంలో బ్యాంకుల తీరును విజయ్‌మాల్యా సైతం ఇటీవల తప్పుబట్టారు.  
.
ఎతిహాద్‌ కుట్ర...? 

అప్పుల ఊబిలో కూరుకుపోయి సేవలను నిలిపివేసిన జెట్‌ ఎయిర్‌వేస్‌ ఉదంతంలో భారీ కుట్ర చోటుచేసుకుందన్న ఆరోపణ కేవలం సుబ్రమణ్యస్వామి, కాంగ్రెస్‌ నేత ఆనంద్‌శర్మ నుంచే కాదు.. జెట్‌ ఎయిర్‌వేస్‌ పైలట్ల నుంచి కూడా రావడం ఆశ్చర్యకరం. కంపెనీ షేరు ధరను స్టాక్‌ మార్కెట్లో కుప్పకూల్చడం ద్వారా ఎతిహాద్‌ జెట్‌లో మరో 25 శాతం వాటాను చేజిక్కించుకోవాలనుకుందని,  కంపెనీలో ప్రధాన వాటాదారు అయిన ఎతిహాద్‌ ఎయిర్‌వేస్, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) కలిసి ఈ కుట్రకు తెరతీశాయని... దీనిపై దర్యాప్తు జరిపించాలని ప్రధాని నరేంద్ర మోదీని జెట్‌ఎయిర్‌వేస్‌ పైలట్లు కోరారు. జెట్‌ ఎయిర్‌వేస్‌లో యూఏఈకి చెందిన ఎతిహాద్‌ ఎయిర్‌వేస్‌కు 24 శాతం వాటా ఉంది. జెట్‌ ప్రమోటర్‌ నరేశ్‌ గోయల్‌ తన వాటా షేర్లను తనఖా పెట్టి రూ.1,500 కోట్ల తాజా నిధులను అందించేందుకు సిద్ధపడినా.. ఎస్‌బీఐ ముందుకు రాలేదని, ఎతిహాద్‌ కూడా ఈ కష్టకాలంలో కావాలనే సహాయ నిరాకరణకు పాల్పడిందని పైలట్లు పేర్కొన్నారు. జెట్‌ పతనం వెనుక ఎతిహాద్‌ పాత్రను దర్యాప్తు చేసి నిగ్గుతేల్చాలని ప్రధానిని అభ్యర్థించారు. కానీ, ప్రభుత్వం మాత్రం దర్యాప్తునకు ఆదేశించలేదు.  

జెట్‌కు అందరూ రాంరాం!  నిన్న సీఎఫ్‌ఓ.. నేడు సీఈఓ ఔట్‌
జెట్‌ ఎయిర్‌వేస్‌కు కీలక పదవుల్లోని వారు ఆకస్మికంగా రాజీనామాలు ప్రకటిస్తున్నారు. నిధుల కొరతతో సంస్థ కార్యకలాపాలు మూతబడిన నెల రోజులకు సీఈవో వినయ్‌ దూబే, కంపెనీ సెక్రటరీ కుల్‌దీప్‌ శర్మ జెట్‌ ఎయిర్‌వేస్‌కు గుడ్‌బై చెప్పేశారు. భారతీయ అమెరికన్‌ అయిన దూబే 21 నెలల పాటు జెట్‌ ఎయిర్‌వేస్‌లో పనిచేశారు. జెట్‌ ఎయిర్‌వేస్‌ డిప్యూటీ సీఈవో, చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ పదవుల నుంచి అమిత్‌ అగర్వాల్‌ తప్పుకున్న మరుసటి రోజే దూబే నుంచి ఈ నిర్ణయం వెలువడటం గమనార్హం. వ్యక్తిగత కారణాల వల్ల దూబే కంపెనీ సీఈవో పదవికి రాజీనామా చేసినట్టు జెట్‌ ఎయిర్‌వేస్‌ ప్రకటించింది. జెట్‌కు పూర్వం డెల్టా ఎయిర్‌లైన్స్, సబ్రే ఐఎన్‌సీ, అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ తదితర విమానయాన సంస్థల్లో దూబే పనిచేశారు. అలాగే, డిప్యూటీ సీఈవో, సీఎఫ్‌వో పదవులకు అమిత్‌ అగర్వాల్‌ రాజీనామా చేశారని, ఈ నెల 13 నుంచి అమల్లోకి వచ్చినట్టు జెట్‌ ఎయిర్‌వేస్‌ స్టాక్‌ ఎక్సే్ఛంజ్‌లకు సమాచారం ఇచ్చింది. మరోవైపు చీఫ్‌పీపుల్‌ ఆఫీసర్‌ రాహుల్‌ తనేజా సైతం రాజీనామా చేసినట్టు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఎస్‌బీఐ ఆధ్వర్యంలోని రుణదాతల కన్సార్షియం జెట్‌ ఎయిర్‌వేస్‌ను విక్రయించే పనిలో ఉన్న సమయంలో ఉన్నత పదవుల నుంచి వీరు తప్పుకోవడం గమనార్హం. గత నెలలో కంపెనీ ఇండిపెండెంట్‌ డైరెక్టర్‌ రాజశ్రీ పతి, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇండిపెండెంట్‌ డైరెక్టర్‌ నసీమ్‌ జైది, హోల్‌టైమ్‌ డైరెక్టర్‌ గౌరంగ్‌ శెట్టి కూడా రాజీనామా చేయడం తెలిసిందే.    

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అజీం ప్రేమ్‌జీ అండతో ఆ స్టార్టప్‌ అరుదైన ఘనత

కార్పొరేట్‌ బ్రదర్స్‌ : అనిల్‌ అంబానీకి భారీ ఊరట

లాభాల్లోకి మార్కెట్లు : బ్యాంక్స్‌ జూమ్‌

రెడ్‌మి కే 20 ప్రొ వచ్చేసింది

రెడ్‌మి కే20 ప్రొ స్మార్ట్‌ఫోన్‌ : బిగ్‌ సర్‌ప్రైజ్‌

స్వల్ప లాభాలతో స్టాక్‌మార్కెట్లు

మార్కెట్లోకి ‘స్కోడా రాపిడ్‌’ లిమిటెడ్‌ ఎడిషన్‌

‘ఐటీఆర్‌ ఫామ్స్‌’లో మార్పుల్లేవ్‌..

ఇక ‘స్మార్ట్‌’ మహీంద్రా!

సు‘జలం’ @ 18.9 లక్షల కోట్లు!

విప్రోకు ఉజ్వల భవిష్యత్‌: ప్రేమ్‌జీ

ప్రైమ్‌ డే సేల్ ‌: అమెజాన్‌కు షాక్‌

నేటి నుంచీ కియా ‘సెల్టోస్‌’ బుకింగ్స్‌ ప్రారంభం

ఎక్కడైనా వైఫై కనెక్టివిటీ !

అశోక్‌ లేలాండ్‌ ప్లాంట్‌ తాత్కాలిక మూసివేత

కొనుగోళ్ల జోష్‌ : లాభాల్లోకి సూచీలు 

ఎయిరిండియాకు భారీ ఊరట

ఫ్లాట్‌గా స్టాక్‌మార్కెట్లు

మందగమనానికి ఆనవాలు!

27 ఏళ్ల కనిష్టానికి చైనా వృద్ధి రేటు

జీవీకే ఎయిర్‌పోర్టులో 49% వాటా విక్రయం!

మార్కెట్లో ‘వాటా’ ముసలం!

మహిళల ముంగిట్లో డిజిటల్‌ సేవలు : జియో

బడ్జెట్‌ ధరలో రియల్‌మి 3ఐ

అద్భుత ఫీచర్లతో రియల్‌ మి ఎక్స్‌ లాంచ్‌

లాభనష్టాల ఊగిసలాట

రెండేళ్ల కనిష్టానికి టోకు ధ‌ర‌ల ద్ర‌వ్యోల్బ‌ణం

16 పైసలు ఎగిసిన రూపాయి

భారీ లాభాల్లో మార్కెట్లు : ఇన్ఫీ జూమ్‌

ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ షాపింగ్‌ డేస్‌ సేల్‌ : భారీ ఆఫర్లు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

హైకోర్టులో ‘బిగ్‌బాస్‌’ కి ఊరట

‘చెట్ల వెంట తిరుగుతూ డాన్స్‌ చేయలేను’

కండలవీరుడికి కబీర్‌ సింగ్‌ షాక్‌

గుర్తుపట్టారా... తనెప్పటికీ బ్యూటీక్వీనే!

తమన్నా ప్లేస్‌లో అవికానా!

‘పూరి ముఖంలో సక్సెస్‌ కనిపించింది’