వాయిదా భారమెంతో తెలుసా?

27 Jul, 2014 02:00 IST|Sakshi
వాయిదా భారమెంతో తెలుసా?

 పొదుపు విషయంలో కాలపరిమితి అనేది చాలా విలువైనది. ఎంత తొందరగా పొదుపు మొదలు పెడితే అంత తక్కువ మొత్తంతో ఎక్కువ లాభాలను పొందొచ్చు. అలా కాకుండా ఆలస్యం అయ్యే కొద్ది పొదుపు వ్యయం పెరుగుతుంది.

 చిన్న తనంలోనే పొదుపు చేయడం ప్రారంభించడం వల్ల కలిగే ప్రయోజనాలపై ఏగాన్ రెలిగేర్ లైఫ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ యతీష్ శ్రీవాత్సవ ఏమంటున్నారో చూద్దాం...
 ఎంబీఏ పూర్తి చేసిన సుమీత్ (23) హైదరాబాద్ మల్టీ నేషనల్ కంపెనీలో చేరాడు. ఇతని నెల జీతం రూ.30,000. తండ్రి ప్రభుత్వరంగ బ్యాంకు ఉద్యోగి, సొంతింటిలోనే మకాం ఉండటంతో సుమీత్‌కు ఎటువంటి బాదరబందీలు లేవు. ఇప్పటి యువతరం లాగానే జీతాన్ని అంతా కొత్త కొత్త ఫ్యాషన్ దుస్తులు, గాడ్జెట్స్, ఇతర విలాసాలకు ఖర్చు చేస్తున్నాడు. కాని తన  భవిష్యత్తు ఆర్థిక భద్రత, దానికి సంబంధించి ఇప్పటి నుంచే ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలన్న దానిపై అవగాహన లేదు.

 ఇలాంటి సుమీతులు మనకు దేశవ్యాప్తంగా లక్షల్లో కనిపిస్తుంటారు. దీనికంతటికీ కారణం వారికి ఎటువంటి ఆర్థిక బాధ్యతలు లేకపోవడం, పొదుపుపై అవగాహన లేకపోవడమే. కాని సుమీత్ లాంటి వారు చిన్నతనంలోనే పొదుపు చేయడం ప్రారంభించకపోవడం వల్ల ఎంత నష్టపోతున్నారో అర్థం చేసుకోవటం లేదు. ఉదాహరణకు బీమా విషయానికి వస్తే ఇక్కడ ప్రీమియంలు అనేవి వయసుతో ఆధారపడి ఉంటాయి. వయసు పెరిగే కొద్దీ ప్రీమియం పెరిగిపోతుంది.

 సుమీత్ 23 ఏట కాకుండా 30 ఏళ్లప్పుడు రూ. 50 లక్షలకు బీమా పాలసీ తీసుకుంటే 26 శాతం అధిక ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఇలా అతను 75 ఏళ్లు వచ్చే వరకు అదనపు ప్రీమియం చెల్లిస్తూనే ఉండాలి. అంతేకాదు రూ. 50 లక్షల బీమాకు అతను చెల్లించే ప్రీమియం విలువ ఎంతో తెలుసా?... తన వార్షిక జీతంలో ఒక శాతం కూడా ఉండదు. ఇది అతని కొత్త ఫోన్ ఖరీదు కంటే తక్కువ. కాబట్టి సుమీత్ లాంటి వాళ్లు ఆర్థిక ఇబ్బందులు లేవు కాబట్టి లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నా, ఇదే సమయంలో భవిష్యత్తు ఆర్థిక భద్రత విషయంలో మాత్రం అలసత్వం వహించకూడదు.

మరిన్ని వార్తలు