అనిల్‌ అంబానీకి తప్పిన ‘కారాగార’ ముప్పు

19 Mar, 2019 00:46 IST|Sakshi

ఎరిక్‌సన్‌కు ఆర్‌కామ్‌ రూ.458.77 కోట్ల చెల్లింపులు

ఉన్నత న్యాయస్థానం గడువుకు ఒకరోజు ముందు జమ

న్యూఢిల్లీ: బిలియనీర్, రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ చైర్మన్‌ అనిల్‌ అంబానీకి ‘కారాగార’ ముప్పు తప్పింది. అత్యున్నత న్యాయస్థానం విధించిన  గడువుకు సరిగ్గా ఒక్కరోజు ముందు స్వీడన్‌     టెలికం పరికరాల తయారీ సంస్థ–  ఎరిక్‌సన్‌కు ఇవ్వాల్సిన రూ.458.77 కోట్లను రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ (ఆర్‌కామ్‌) చెల్లించింది. సోమవారం ఎరిక్‌సన్‌కు బకాయిలు చెల్లించినట్లు ఆర్‌కామ్‌ సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఆర్‌కామ్‌ నుంచి రావాల్సిన మొత్తం అందినట్లు (సోమవారం రూ.458.77 కోట్లు. అంతక్రితం 118 కోట్లు) ఎరిక్‌సన్‌ ప్రతినిధి కూడా ధ్రువీకరించారు. వడ్డీతోసహా రావాల్సిందంతా అందినట్లు ప్రతినిధి పేర్కొన్నారు.  సోమవారం రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ షర్‌ ధర నేషనల్‌ స్టాక్‌ ఎక్సే్చంజ్‌లో 9 శాతం పడి, రూ.4 వద్ద ముగిసింది.
కేసు క్రమం ఇదీ...

►ఆర్‌కామ్‌ దేశవ్యాప్త టెలికం నెట్‌వర్క్‌ నిర్వహణకు అనిల్‌ గ్రూప్‌తో 2014లో ఎరిక్సన్‌ ఇండియా ఏడేళ్ల ఒప్పందం కుదుర్చుకుంది. రూ.1,500 కోట్లకుపైగా బకాయిలు చెల్లించలేదని            ఆరోపించింది. 
​​​​​​​►రూ.47,000 కోట్లకుపైగా రుణ భారంలో కూరుకుపోయిన రిలయన్స్‌ కమ్యూనికేషన్స్, తనకు బకాయిలు చెల్లించలేకపోవడంతో, ఎరిక్సన్‌ నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ)లో  దివాలా పిటిషన్‌ దాఖలు చేసింది. గత ఏడాది మే నెలలో ఈ పిటిషన్‌ను ట్రిబ్యునల్‌ అడ్మిట్‌ చేసుకుంది.
​​​​​​​►అయితే ఈ కేసును ఆర్‌కామ్‌ సామరస్య పూర్వకంగా పరిష్కరించుకుంది. ఇందుకు వీలుగా రూ.550 కోట్లు చెల్లిస్తానని హామీ ఇచ్చింది. 2018 సెప్టెంబర్‌ 30 లోపు ఈ చెల్లింపులు జరుపుతామని పేర్కొంది. 
​​​​​​​►ఈ హామీకి కట్టుబడకపోవడంతో ఎరిక్సన్‌      సెప్టెంబర్‌లో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 
​​​​​​​►ఎరిక్సన్‌కు చెల్లించాల్సిన బకాయిలపై గతేడాది అక్టోబర్‌ 23న ఆర్‌కామ్‌కు అత్యున్నత న్యాయస్థానం చివరి అవకాశం ఇచ్చింది. డిసెంబర్‌ 15లోపు బకాయిలు మొత్తం చెల్లించాలని ఆదేశించింది. జాప్యం జరిగితే ఇందుకు సంబంధించి మొత్తంపై 12 శాతం వార్షిక వడ్డీ చెల్లించాలని              స్పష్టం చేసింది. 
​​​​​​​►డిసెంబర్‌ 15లోపు బకాయిలు చెల్లించలేకపోతే, ఎరిక్సన్‌ కోర్టు ధిక్కరణ కేసు ప్రొసీడింగ్స్‌ను ప్రారంభించవచ్చని సూచించింది.
​​​​​​​► అయితే ఆ లోపూ బకాయిలు చెల్లించలేకపోవడంతో జనవరి 4న ఎరిక్సన్‌ మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేసింది. 
​​​​​​​► దీనిపై ఫిబ్రవరి 20వ తేదీన అత్యున్నత న్యాయస్థానం తన తీర్పును ప్రకటించింది.
​​​​​​​► ఈ కేసులో అనిల్‌ అంబానీపై  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.  రూ.550 కోట్ల బకాయి చెల్లించకుండా తన ఉత్తర్వులను ఉల్లంఘించారని, ఇది పూర్తిగా ధిక్కరణ కిందకే వస్తుందని స్పష్టం చేసింది. 
​​​​​​​►  నాలుగు వారాల్లో రూ.453 కోట్లు కనక ఎరిక్సన్‌కు చెల్లించకపోతే మూడు నెలల జైలు శిక్ష తప్పదని స్పష్టం చేసింది. 
​​​​​​​►ఈ కేసులో ఆర్‌కామ్‌ చైర్మన్‌ అనిల్‌తో పాటు రిలయన్స్‌ టెలికం చైర్మన్‌ సతీశ్‌ సేథ్, రిలయన్స్‌ ఇన్‌ఫ్రాటెల్‌ చైర్‌పర్సన్‌ చిరహా విరాణి కూడా సుప్రీంకోర్టు ఇదే హెచ్చరికలు చేసింది. 
​​​​​​​► ధర్మాసనం ఈ హెచ్చరిక చేస్తున్న సమయంలో అనిల్‌ అంబానీ సహా ముగ్గురూ కోర్టు హాల్లోనే ఉన్నారు. 
​​​​​​​►తదనంతరం ఆదాయ పన్ను రిఫండ్‌ ద్వారా     తమ బ్యాంక్‌ ఖాతాకు వచ్చిన రు.260         కోట్లను ఎరిక్సన్‌కు చెల్లించేందుకు  అనుమతివ్వాలంటూ ఆర్‌కామ్‌ రుణ దాతలు– బ్యాంకర్లును అభ్యర్థించింది. అయితే ఇందుకు అవి   ససేమిరా అన్నాయి. 

ఆదుకున్న అన్న!
‘‘ఈ క్లిష్ట సమయాల్లో నా వెంట నిలిచిన గౌరవనీయులైన నా అన్న, వదిన ముకేశ్, నీతాలకు హృదయపూర్వక ధన్యవాదములు. సకాలంలో సహకారం అందించడం ద్వారా మా కుటుంబ విలువలకు ఉన్న ప్రాముఖ్యాన్ని తెలియజేశారు. నేను, నా కుటుంబం గతాన్ని దాటి వచ్చినందుకు కృతజ్ఞులం’’ అంటూ ఆర్‌కామ్‌ చైర్మన్‌ అనిల్‌ అంబానీ  ప్రకటించారు. దీంతో ఎరిక్‌సన్‌కు బకాయిల చెల్లింపునకు కావాల్సిన మొత్తాన్ని సోదరుడు ముకేశ్‌ అంబానీ సమకూర్చి ఆదుకున్నట్టు అనిల్‌ ప్రకటన ద్వారా తెలుస్తోంది. 

మరిన్ని వార్తలు