టైర్ల పరుగు.. మొదలైందిప్పుడు!!

9 May, 2018 00:41 IST|Sakshi

సామర్థ్యం పెంపుపై టైర్ల కంపెనీల దృష్టి

జాబితాలో సియట్, ఎంఆర్‌ఎఫ్, అపోలో వంటి సంస్థలు

వచ్చే 7–10 ఏళ్లలో రూ.13,600 కోట్ల పెట్టుబడులు

వాహన విక్రయాలు, రబ్బరు ధరలు కలిసొచ్చే అంశాలు

క్రూడ్‌ ధరల కారణంగా టైర్ల ధరలూ పెరిగే అవకాశం  

డిమాండ్‌– సప్లై గురించి మనకు తెలియనిదేమీ కాదు. డిమాండ్‌ను అందిపుచ్చుకోవాలంటే సరఫరా పెరగాలి. సరఫరా పెరగాలంటే తయారీ సామర్థ్యం పెంచుకోవాలి. ఇప్పుడు టైర్ల కంపెనీలూ అదే దార్లో పడ్డాయి.

ఆటోమొబైల్‌ సంస్థలు, రిప్లేస్‌మెంట్‌ మార్కెట్‌ నుంచి డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో టైర్ల కంపెనీలు వాటి తయారీ సామర్థ్యాన్ని మరింత పెంచుకునే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. కార్యకలాపాలను విస్తరించడానికి టైర్ల కంపెనీలు వచ్చే 7–10 ఏళ్ల కాలంలో మొత్తంగా రూ.13,600 కోట్లు వెచ్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో ఎక్కువ భాగం కొత్త యూనిట్ల ఏర్పాటుకే ఖర్చు చేయనున్నాయి.

ఉత్పత్తిని 40 శాతం పెంచుకుంటాం: సియట్‌
ఆర్‌పీజీ గ్రూప్‌నకు చెందిన సియట్‌ టైర్స్‌ తన తయారీని మరింత పెంచుకోవాలని ప్రయత్నిస్తోంది. ‘ప్రస్తుత ఉత్పత్తిని 35– 40 శాతం మేర పెంచుకోవాలని భావిస్తున్నాం. గుజరాత్‌లోని హలోల్‌ ప్లాంటులో బస్సు, ట్రక్‌ రేడియల్స్‌ సామర్థ్యాన్ని విస్తరిస్తున్నాం.

అలాగే ప్యాసింజర్‌ కార్‌ రేడియల్స్‌ కోసం ఒక గ్రీన్‌ఫీల్డ్‌ యూనిట్‌(కొత్త ప్లాంట్‌)  ఏర్పాటుకు  ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం’ అని సియట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అనంత్‌ గోయెంకా తెలిపారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీ ప్రభావం తగ్గిపోయిందని, అందువల్ల రిప్లేస్‌మెంట్‌ విభాగం, ఒరిజినల్‌ ఎక్విప్‌మెంట్‌ మ్యానుఫ్యాక్చరర్స్‌ (ఓఈఎం) నుంచి డిమాండ్‌ అధికంగా ఉందని పేర్కొన్నారు. అందుకే సామర్థ్యం పెంపునకు రూ.1,200–రూ.1,300 కోట్ల ఇన్వెస్ట్‌మెంట్లను కేటాయించామన్నారు.

వాహన విక్రయాలతో జోరు.. క్రూడ్‌ ధరలతో బేజారు..
భారత్‌లో ఇటీవల కాలంలో వాహన విక్రయాలు జోరుగానే ఉన్నాయి. మరీ ముఖ్యంగా టూవీలర్లు, ట్రక్‌ విక్రయాల్లో మంచి వృద్ధి నమోదవుతోంది. సియామ్‌ గణాంకాల ప్రకారం.. 2018 ఆర్థిక సంవత్సరంలో ఆటోమొబైల్‌ పరిశ్రమ మొత్తంగా 2.9 కోట్ల యూనిట్ల వాహనాలను తయారు చేసింది. 2017 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 15% వృద్ధి నమోదయింది.

అలాగే ఎగుమతులు సహా దేశీ మార్కెట్ల నుంచి ఆర్డర్‌ బుక్‌ బలంగా ఉండటం, రబ్బరు ధరలు స్థిరంగా ఉండటం, యాంటీ డంపింగ్‌ నిబంధనలపై కేంద్ర ప్రభుత్వ వైఖరి వంటివి టైర్ల కంపెనీలకు కలిసొస్తున్నాయి. అయితే ఇక్కడ క్రూడ్‌ ధరలు పెరుగుతుండటం ప్రతికూల అంశం.

ముడిచమురు ధరల పెరుగుదల వల్ల ప్రస్తుత త్రైమాసికం నుంచే చాలా టైర్ల కంపెనీల లాభదాయకతపై ఒత్తిడి పెరిగే అవకాశముంది. క్రూడ్‌ ఆధారిత ముడిపదార్థమైన కార్బన్‌బ్లాక్‌.. టైర్ల తయారీ కంపెనీల వ్యయాల్లో దాదాపు 45 శాతం వాటాను ఆక్రమించింది. ముడి చమురు ధరలు సగటున 62 డాలర్ల నుంచి 75 డాలర్లకు పెరగటం తెలిసిందే.

విస్తరణ బాటలో ఎంఆర్‌ఎఫ్, అపోలో టైర్స్‌
సియట్‌ ప్రత్యర్థులైన ఎంఆర్‌ఎఫ్, అపోలో టైర్స్‌ కూడా విస్తరణపై దృష్టి కేంద్రీకరించాయి. బస్సు/ ట్రక్‌ రేడియల్స్, టూవీలర్‌ టైర్స్‌ విభాగంలో ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న ఎంఆర్‌ఎఫ్‌.. వచ్చే దశాబ్ద కాలంలో గుజరాత్‌లో రూ.4,500 కోట్లమేర ఇన్వెస్ట్‌ చేయనుంది. తమిళనాడు వెలుపల కంపెనీకి ఇదే అతిపెద్ద విస్తరణ. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరులో ఏర్పాటవుతున్న కొత్త ప్లాంటులో రూ.1,800 కోట్లు ఇన్వెస్ట్‌ చేస్తామని అపోలో టైర్స్‌ జనవరిలోనే ప్రకటించింది.

వచ్చే రెండేళ్ల కాలంలో ఈ ప్లాంటు సేవలు అందుబాటులోకి రానున్నవి. ఏడాదికి 55 లక్షల టైర్ల తయారీ సామర్థ్యంతో ఈ ప్లాంటు నిర్మితమౌతోంది. 2017–18, 2018–19 కాలంలో రూ.4,500 కోట్లు ఇన్వెస్ట్‌ చేయాలనుకున్నామని, అందులో భాగమే ఏపీ ప్లాంటులోని ఇన్వెస్ట్‌మెంట్లని కంపెనీ తెలిపింది. ‘చెన్నైలో విస్తరణ దాదాపు పూర్తయింది. ఇప్పుడు చెన్నై యూనిట్‌లో 12,000 రేడియల్స్‌ను తయారు చేయగలం’ అని అపోలో టైర్స్‌ అధికార ప్రతినిధి పేర్కొన్నారు.

టైర్ల కంపెనీలు వాటి తయారీ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి రెండు ప్రధాన కారణాలున్నాయని ఆటోమోటివ్‌ టైర్‌ మాన్యుఫాక్చరర్స్‌ అసోసియేషన్‌ డైరెక్టర్‌ జనరల్‌ రాజీవ్‌ బుధ్‌రాజా తెలిపారు. 5–6 ఏళ్లనాటి పాత ఫెసిలిటీలు పూర్తి సామర్థ్యంతో నడుస్తుండటం ఒక కారణమైతే.. జీఎస్‌టీ, పెద్ద నోట్ల రద్దు వల్ల గత రెండేళ్లుగా రిప్లేస్‌మెంట్‌ మార్కెట్, వాహన కంపెనీల నుంచి డిమాండ్‌ పెరగడం రెండోదని పేర్కొన్నారు.


టైర్ల ధరలు పెరగొచ్చు!!
భవిష్యత్‌లో టైర్ల ధరలు పెరగొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అన్ని విభాగాల నుంచి ఉన్న బలమైన డిమాండ్‌ నేపథ్యంలో టైర్ల కంపెనీలు ఉత్పత్తి వ్యయాలను ధరల పెంపు ద్వారా బదిలీ చేసుకుంటున్నాయని అభిప్రాయపడ్డారు.  ‘వచ్చే రెండు త్రైమాసికాల కాలంలో ముడిపదార్థాల ధరలు 3–4 శాతం మేర పెరుగుతాయని అంచనా వేస్తున్నాం. క్రూడ్‌ ధరల పెరగుదల దీనికి కారణం. దీనివల్ల టైర్ల ధరలు 2–2.5 శాతంమేర పెరగొచ్చు’ అని కోటక్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ అనలిస్ట్‌లు నిశిత్‌ జలాన్, హితేశ్‌ గోయెల్‌ వివరించారు.

కంపెనీ            ఇన్వెస్ట్‌మెంట్లు (రూ.కోట్లు)            ఉద్దేశం
ఎంఆర్‌ఎఫ్‌         4,500                       గుజరాత్‌లో గ్రీన్‌ఫీల్డ్‌ ఫెసిలిటీ ఏర్పాటు
అపోలో             4,500                       ఏపీలో గ్రీన్‌ఫీల్డ్‌ ఫెసిలిటీ ఏర్పాటు, యూనిట్ల విస్తరణ
జేకే టైర్స్‌              500                      ప్రస్తుత యూనిట్ల విస్తరణ
సియట్‌ టైర్స్‌    1,300                        గ్రీన్‌ఫీల్డ్‌ ఫెసిలిటీ ఏర్పాటు, ప్రస్తుత యూనిట్ల విస్తరణ
మాక్సిస్‌          2,640                         గుజరాత్‌లో గ్రీన్‌ఫీల్డ్‌ యూనిట్‌ ఏర్పాటు

- (సాక్షి, బిజినెస్‌ విభాగం)

మరిన్ని వార్తలు