టైర్ల రంగం ఏటా 7–9 శాతం వృద్ధి 

1 Jan, 2019 02:47 IST|Sakshi

రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా అంచనా

ముంబై: టైర్ల డిమాండ్‌ ఐదేళ్ల పాటు ఏటా 7–9 శాతం చొప్పున వృద్ధి చెందగలదని, దేశీయ ఆటోమొబైల్‌ పరిశ్రమపై ఉన్న సానుకూల అంచనాలే దీనికి కారణమని రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా తెలిపింది. ఇదే కాలంలో సామర్థ్య విస్తరణపై టైర్ల పరిశ్రమ రూ.20,000 కోట్ల మేర పెట్టుబడులు పెడుతుందని పేర్కొంది. ముడి చమురు ధరలు తగ్గడం, సహజ రబ్బర్‌ ధరలు స్థిరంగా ఉండడం వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ భాగంలో మార్జిన్లు మెరుగుపడతాయని తన నివేదికలో పేర్కొంది.

భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆటోమొబైల్‌ మార్కెట్‌గా ఉండగా, 2021 నాటికి మూడో స్థానానికి చేరుతుందని ఇక్రా అంచనా వ్యక్తం చేసింది. ఏటా 5.9 శాతం చొప్పున ఈ రంగం వృద్ధి చెందుతూ 2026 నాటికి –251.4– 282.8 బిలియన్‌ డాలర్ల స్థాయికి చేరుకుంటుందని అభిప్రాయపడింది. కేరళ వరదలు, రుణాల కఠినతరం, బీమాకు సంబంధించి నియంత్రణపరమైన మార్పులు, వడ్డీ రేట్ల పెరుగుదల, ముడి చమురు ధరల పెరుగుదల ప్రభావం (ఐదేళ్ల బీమా) డిమాండ్‌పై చూపించినప్పటికీ... ఇప్పటి వరకు చూసుకుంటే మొత్తం మీద చాలా విభాగాల్లో అమ్మకాలు బలంగానే ఉన్నాయని, ఇది టైర్ల డిమాండ్‌ వృద్ధికి ప్రయోజనం కలిగిస్తుందని పేర్కొంది.   

మరిన్ని వార్తలు