టైటాన్.. ‘కారీగర్’ కేంద్రాలు

21 Feb, 2014 01:18 IST|Sakshi
టైటాన్.. ‘కారీగర్’ కేంద్రాలు

 దేశంలోనే తొలిసారిగా ఇన్‌హౌస్ ఆభరణాల తయారీ
 మెరుగైన సౌకర్యాలతో స్వర్ణకారులకు రెట్టింపు ఆదాయం
 త్వరలోనే ఆభరణాల తయారీపై శిక్షణా కేంద్రం
 హోసూరు నుంచి బిజినెస్ బ్యూరో ప్రతినిధి
 
 దేశీయ బంగారు ఆభరణాల తయారీ రంగంలో టాటా గ్రూపునకు చెందిన టైటాన్ సరికొత్త అధ్యాయానికి తెరతీసింది. దేశంలోనే తొలిసారిగా స్వర్ణకారుల కోసం అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నాలుగు ఆభరణాల తయారీ కేంద్రాలను (కారీగర్ సెంటర్స్) ఏర్పాటు చేసింది. సుమారు రూ.22 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాలను సంస్థ  డెరైక్టర్ డాక్టర్ సి.జి.కె.నాయర్ గురువారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆభరణాల వినియోగంలో ఇండియా మొదటి స్థానంలో ఉన్నప్పటికీ ఎగుమతుల్లో చాలా వెనుకబడి ఉందని, ఈ కేంద్రాల ద్వారా అంతర్జాతీయ ప్రమాణాలతో ఆభరణాలు తయారై ఎగుమతులు పెరుగుతాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. స్వర్ణకారులకు ఆదాయాన్ని పెంచే ఇటువంటి కేంద్రాలు ఇతర జ్యుయెలరీ సంస్థలు  కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టైటాన్ మేనేజింగ్ డెరైక్టర్ భట్ మాట్లాడుతూ గత పదేళ్లలో తనిష్క్ వినియోగదారుల్లో సంతోషాన్ని చూశాం కానీ, దానికి కారణమైన స్వర్ణకారులు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారని చెప్పారు. స్వర్ణకారుల ముఖాల్లో సంతోషాన్ని చూడాలన్న తమ పదేళ్ల కల ఇప్పటికి నిజమయ్యిందన్నారు. సుమారు పదేళ్ల క్రితం కారీగర్ పార్క్‌తో ప్రారంభించి ఇప్పుడు కారీగర్ కేంద్రాల స్థాయికి వచ్చామన్నారు. త్వరలోనే కోల్‌కతాలో మరో రెండు కారీగర్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని, మరింత నైపుణ్యం పెంచే విధంగా శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నామని భట్ తెలియజేశారు.
 
 రెట్టింపైన ఆదాయాలు: తమ కారీగర్ సెంటర్స్‌తో స్వర్ణకారులు ఎక్కువ ఆభరణాలను తయారు చేయడం ద్వారా అధికాదాయాన్ని పొందుతున్నట్లు టైటాన్ సీఈవో(జ్యుయెలరీ విభాగం) సి.కె.వెంకటరామన్ తెలిపారు. సాధారణంగా ఒక స్వర్ణకారుడు నెల రోజుల్లో 500- 600 గ్రాముల ఆభరణాలను తయారు చేస్తాడని, కానీ ఈ అధునాతన సౌకర్యాల వల్ల నెలకు 1,500 గ్రాముల వరకు తయారు చేయగలుగుతున్నారని తెలిపారు. త్వరలోనే దీన్ని 3 కిలోలకు (3వేల గ్రాములు) తీసుకెళ్ళాలన్నది టైటాన్ లక్ష్యమని ఆయన తెలియజేశారు. ప్రస్తుతం ఈ నాలుగు కారీగర్ సెంటర్స్‌లో 300 మంది స్వర్ణకారులు పనిచేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు