ఇక ‘టాటా’ చీరలు

7 May, 2019 00:23 IST|Sakshi

హైదరాబాద్‌లో ‘తనైరా’ షోరూం ప్రారంభం

ఈ ఏడాది 14 అవుట్‌లెట్స్‌ ఏర్పాటు 

టైటాన్‌ ఎండీ భాస్కర్‌ భట్‌ వెల్లడి

ఈ ఏడాది మధ్యప్రాచ్యానికి తనిష్క్‌  

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూప్‌నకు చెందిన ఆభరణాలు, వాచీల ఉత్పత్తుల విక్రయ సంస్థ టైటాన్‌ బ్రాండెడ్‌ చీరల విభాగంలోకి అడుగుపెట్టింది. చీరలు, మహిళల సాంప్రదాయ దుస్తులకు సంబంధించి తనైరా పేరిట హైదరాబాద్‌లో షోరూం ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో టైటా న్‌ ఎండీ భాస్కర్‌ భట్, సినీ నటి అదితి రావు హైదరీ పాల్గొన్నారు. తనైరా బ్రాండ్‌ కింద ఇది అయిదో స్టోర్‌ అని, హైదరాబాద్‌లో మొట్టమొదటిదని భాస్కర్‌ భట్‌ తెలిపారు. ‘ప్రస్తుతం బెంగళూరు, ఢిల్లీల్లో కలిపి నాలుగు షోరూమ్‌లు ఉన్నాయి. ఈ ఏడాది కొత్తగా మొత్తం 14 స్టోర్స్‌ ఏర్పాటు చేయనున్నాం. దీంతో 2020 మార్చి నాటికి తనైరా స్టోర్స్‌ సంఖ్య 18కి చేరుతుంది’ అని ఆయన వెల్లడించారు. బెనారస్, కంచి మొదలుకుని పోచంపల్లి, ఉప్పాడ వరకు దాదాపు 3,000 రకాల చీరలు ఈ స్టోర్స్‌లో అందుబాటులో ఉంటాయని భట్‌ చెప్పారు. వీటి కోసం ప్రత్యేకంగా 300 మంది దాకా చేనేతకారులతో ఒప్పందాలు చేసుకున్నట్లు ఆయన తెలియజేశారు. ఒక్కో స్టోర్‌పై సుమారు రూ. 4–5 కోట్ల దాకా ఇన్వెస్ట్‌మెంట్‌ ఉంటుందన్నారు. ధరల శ్రేణి రూ. 1,000 నుంచి ప్రారంభమవుతుందని భట్‌ చెప్పారు.  ప్రస్తుతం ప్రత్యేక సందర్భాల కోసం ఉద్దేశించిన దుస్తుల మార్కెట్‌ పరిమాణం సుమారు రూ. 20,000 కోట్లు ఉంటుందని భట్‌ చెప్పారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి విజయవాడ, వైజాగ్‌ తదితర ప్రాంతాల్లో కూడా స్టోర్స్‌ ఏర్పాటు పరిశీలించనున్నట్లు టైటాన్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అజయ్‌ చావ్లా తెలిపారు. మరోవైపు, ఆభరణాల బ్రాండ్‌ తనిష్క్‌ స్టోర్స్‌ను ఈ ఏడాది మధ్యప్రాచ్య దేశాల్లో ప్రారంభించనున్నట్లు ఆయన వివరించారు.
 
టైటాన్‌ 20 శాతం వృద్ధి అంచనా.. 
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో టైటాన్‌ ఆదాయ వృద్ధి సుమారు 20 శాతం మేర ఉండొచ్చని అంచనా వేస్తున్నట్లు భట్‌ చెప్పారు. క్రిత ఆర్థిక సంవత్సరం వృద్ధి 22 శాతంగా ఉండగా, 2018 డిసెంబర్‌ 31తో ముగిసిన తొమ్మిది నెలల్లోను సుమారు అదే స్థాయిలో నమోదైందని ఆయన పేర్కొన్నారు. 2018–19 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు నేడు (మంగళవారం) వెల్లడి కానున్నాయి. 2017–18లో సంస్థ ఆదాయం రూ. 15,472 కోట్లుగా ఉంది. గత ఆర్థిక   సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో ఇది రూ. 14,769 కోట్లుగా నమోదైంది. ఆదాయ వృద్ధికి ఆభరణాల వ్యాపార విభాగం గణనీయంగా తోడ్పడగలదని ఆయన పేర్కొన్నారు. టైటాన్‌ ఆదాయాల్లో దాదాపు 83 శాతం వాటా    ఈ విభాగానిదేనని భట్‌ వివరించారు.   

మరిన్ని వార్తలు