టైటాన్‌ లాభం 31 శాతం అప్‌ 

4 Aug, 2018 00:07 IST|Sakshi

8 శాతం పెరిగిన మొత్తం ఆదాయం

న్యూఢిల్లీ: టాటా గ్రూప్‌నకు చెందిన టైటాన్‌ కంపెనీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో 31 శాతం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో రూ.267 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1లో రూ.349 కోట్లకు పెరిగిందని టైటాన్‌ పేర్కొంది. మొత్తం ఆదాయం రూ.4,054 కోట్ల నుంచి 8 శాతం వృద్ధితో రూ.4,355 కోట్లకు ఎగసిందని టైటాన్‌ కంపెనీ ఎమ్‌డీ భాస్కర్‌ భట్‌ తెలిపారు. గత ఏడాది జూలై నుంచి జీఎస్‌టీ అమల్లోకి వచ్చినందున ఈ రెండు ఆదాయ గణాంకాలను పోల్చడానికి లేదని పేర్కొన్నారు. నిర్వహణ లాభం రూ.389 కోట్ల నుంచి 27 శాతం వృద్ధితో రూ.495 కోట్లకు, నిర్వహణ మార్జిన్‌ 9.7 శాతం నుంచి 11.5 శాతానికి పెరిగాయని వివరించారు.

తమ కీలక వ్యాపారాలన్నీ లాభాల పరంగా మంచి వృద్ధిని సాధించాయని, అంతేకాకుండా మార్కెట్‌ వాటా కూడా పెరిగిందని భాస్కర్‌ భట్‌ తెలిపారు. జ్యూయలరీ వ్యాపారం మాత్రం ఒక్క అంకె వృద్ధినే సాధించిందని పేర్కొన్నారు. ఈ విభాగం ఆదాయం 6 శాతం వృద్ధితో రూ.3,572 కోట్లకు, వాచ్‌ల వ్యాపార ఆదాయం 15 శాతం వృద్ధితో రూ.594 కోట్లకు పెరిగాయని, కళ్లజోళ్ల వ్యాపార విభాగం ఆదాయం 16 శాతం వృద్ధితో రూ.132 కోట్లకు పెరిగిందని  ఆయన వివరించారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో టైటాన్‌ కంపెనీ షేర్‌ 0.2 శాతం లాభంతో రూ.918 వద్ద ముగిసింది. గురువారం రూ.920 వద్ద ముగిసిన ఈ షేర్‌ శుక్రవారం ఇంట్రాడేలో రూ.902, రూ.942 కనిష్ట, గరిష్ట స్థాయిల మధ్య కదలాడింది.  ఏడాది కాలంలో ఈ షేర్‌ విలువ 67 శాతం ఎగసింది.

 

మరిన్ని వార్తలు