ఎల్‌ఐసీ ఏజెంట్ల గ్రాట్యుటీ పెంపు

7 Feb, 2017 01:35 IST|Sakshi
ఎల్‌ఐసీ ఏజెంట్ల గ్రాట్యుటీ పెంపు

ముంబై: ఏజంట్ల వలసలను నివారించే దిశగా.. ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ).. గ్రాట్యుటీ మొత్తాన్ని రూ.3 లక్షలకు పెంచింది. ప్రస్తుతం పదిహేనేళ్ల సర్వీస్‌ తర్వాత వైదొలిగే ఏజం ట్లకు గ్రాట్యుటీ రూ. 2 లక్షలుగా ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో తొలగించిన వారు పోగా.. నికరంగా 2.45 లక్షల మంది ఎల్‌ఐసీ ఏజంట్లుగా చేరారు. 3.40 లక్షల మంది స్వచ్ఛందంగా వైదొలగడమో లేదా కంపెనీ తొలగించడమో జరిగింది. గతేడాది మార్చిలో ఏజంట్ల సంఖ్య 10.6 లక్షలుగా ఉండగా.. ఈ ఏడాది జనవరి ఆఖరు నాటికి 11.05 లక్షలకు చేరింది.

ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటిదాకా 2.7 లక్షల మందిని రిక్రూట్‌ చేసుకోగా 2.25 లక్షల మంది స్వచ్ఛందంగా సంస్థను విడిచిపెట్టడమో లేదా వివిధ కారణాలతో సంస్థ తొలగించడమో జరిగింది. దీంతో నికరంగా 45,000 మందే చేరినట్లయిందని ఎల్‌ఐసీ వర్గాలు తెలిపాయి. ఆన్‌లైన్లోనూ, బ్యాంకెష్యూరెన్స్‌ మార్గాల్లోనూ పాలసీలు విక్రయిస్తున్నప్పటికీ.. ఎల్‌ఐసీ ఆదాయాల్లో దాదాపు 94% వాటా ఏజెన్సీ ద్వారానే వస్తోంది.

>
మరిన్ని వార్తలు