సంస్కరణలు వేగవంతం చేయండి

23 Sep, 2015 01:52 IST|Sakshi
సంస్కరణలు వేగవంతం చేయండి

వ్యాపారాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడేలా చూడండి
- భారత్‌ను కోరిన అమెరికా
- వైస్ ప్రెసిడెంట్ జో బెడైన్
వాషింగ్టన్:
పెట్టుబడుల రాకకు, వ్యాపారాల నిర్వహణకు అనుకూల పరిస్థితులు కల్పించేలా ఆర్థిక సంస్కరణల అమలును మరింత వేగవంతం చేయాలని అమెరికా ఉపాధ్యక్షుడు జో బెడైన్.. భారత్‌ను కోరారు. మేధోహక్కులను పరిరక్షించడం, వాణిజ్య నిబంధనలను సరళతరం చేయడంపైనా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో భారత్-అమెరికాల మధ్య తొలి వ్యూహాత్మక, వాణిజ్య చర్చలు.. ఇరు దేశాల సంబంధాల్లో నూతన శకాన్ని ఆవిష్కరించగలవని బెడైన్ వ్యాఖ్యానించారు. అమెరికా-ఇండియా బిజినెస్ కౌన్సిల్ (యూఎస్‌ఐబీసీ) 40వ వార్షిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా  బెడైన్ ఈ విషయాలు చెప్పారు.

భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్, కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సదస్సులో పాల్గొన్నారు. వ్యాపార సంస్థలు తమ ఉత్పత్తులు, సర్వీసులను మార్కెట్లో స్వేచ్ఛగా విక్రయించుకునే వీలు కల్పించేలా విదేశీ పెట్టుబడులపై పరిమితులు తొలగించాల్సిన అవసరం ఉందని బెడైన్ పేర్కొన్నారు. వాణిజ్య నిబంధనల సరళీకరణ ద్వారా మాత్రమే ఇది సాధ్యపడుతుందన్నారు. అటు వాతావరణంలో ప్రతికూల మార్పులను సరిదిద్దేందుకు కూడా ఇరు దేశాలు మరింతగా పరస్పరం సహకరించుకోవాలని, ఇది ప్రపంచంలోనే రెండు అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాల ఆర్థిక ప్రగతిలో కొత్త శకాన్ని ఆవిష్కరించగలదని బెడైన్ చెప్పారు. ఇరు దేశాలు వాణిజ్య సంబంధాలు వేగవంతంగా పటిష్టం చేసుకుంటున్నాయని అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ పేర్కొన్నారు.

ఇండియాలో ఇన్వెస్ట్ చేయండి.. సుష్మా స్వరాజ్
భారత్‌లో అపార వ్యాపార అవకాశాలు ఉన్నాయని, వీటిని అందిపుచ్చుకునేందుకు పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేయాలని అమెరికన్ ఇన్వెస్టర్లకు సుష్మా స్వరాజ్ పిలుపునిచ్చారు. భారత్ పట్టణీకరణను పెంచేందుకు, ప్రజలందరికీ చౌకగా విద్యుత్‌ను, అందుబాటు ధరల్లో ఇళ్లను అందించేందుకు కృషి చేస్తోందని ఆమె తెలిపారు. అలాగే అంతర్జాతీయ తయారీ కేంద్రంగా భారత్‌ను తీర్చిదిద్దేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోందని మంత్రి వివరించారు. వీటన్నింటా కూడా వ్యాపార అవకాశాలు ఉన్నాయని, అమెరికా ఇన్వెస్టర్లు వీటిని అందిపుచ్చుకోవచ్చని ఆమె పేర్కొన్నారు.
 
మరోవైపు, వ్యాపారాలకు అనువైన దేశాల జాబితాలో భారత్ .. టాప్ 50లోకి చేరాలంటే .. కాంట్రాక్టుల అమలును మెరుగుపర్చాలని, దివాలా చట్టాలను ఆధునీకరించాలని అమెరికా వాణిజ్య మంత్రి పెనీ ప్రిట్జ్‌కర్ అభిప్రాయపడ్డారు. భారత్‌లో వ్యాపారపరమైన కాంట్రాక్టుల వివాదాలు పరిష్కారం కావడానికి సంవత్సరాలు పట్టేస్తుందని, నిబంధనలు తరచూ మారిపోతుంటాయని ఆమె వ్యాఖ్యానించారు. ఇలాంటి పరిస్థితుల వల్ల భారత్‌లో వ్యాపార నిర్వహణ చాలా ఖరీదైన వ్యవహారంగానూ, అనూహ్యమైన విధంగానూ ఉంటోందని పెనీ పేర్కొన్నారు. ఇవే దేశీ, విదేశీ పెట్టుబడుల రాకకు అవరోధంగా మారుతున్నాయన్నారు. ఇలాంటి వాటిని పరిష్కరించే దిశగా అత్యుత్తమ విధానాలదే రూపకల్పన చేసేందుకు ఇరు దేశాల బృందాలు కలిసి పనిచేయనున్నాయని పెనీ చెప్పారు.
 
నూయి, భార్తియాకు పురస్కారాలు..
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో అందర్నీ భాగస్వాములు చేసే దిశగా కృషి చేస్తున్నందుకు గాను పెప్సీకో చైర్మన్ ఇంద్రా నూయి, హిందుస్తాన్ టైమ్స్ గ్రూప్ చైర్‌పర్సన్ శోభనా భార్తియా ప్రతిష్టాత్మక పురస్కారాలు అందుకున్నారు. 2015 సంవత్సరానికి గాను యూఎస్‌ఐబీసీ.. గ్లోబల్ లీడర్‌షిప్ అవార్డును దక్కించుకున్నారు. భారత్-అమెరికా సంబంధాల్లో యూఎస్‌ఐబీసీ కీలకపాత్ర పోషిస్తోందని ఈ సందర్భంగా ఇంద్రా నూయి పేర్కొన్నారు. రెండు దేశాల మీడియా, టెక్నాలజీ సంస్థలు కలిసి పనిచే సేందుకు అపార అవకాశాలున్నాయని శోభనా భార్తియా తెలిపారు. ప్రముఖ ఇండియన్-అమెరికన్ ఆర్టిస్టు నట్వర్ భవ్సార్.. ఆర్టిస్టిక్ అచీవ్‌మెంట్ పురస్కారాన్ని అందుకున్నారు.

మరిన్ని వార్తలు