ఆరోగ్య బీమా.. జాగ్రత్త సుమా

11 May, 2014 00:34 IST|Sakshi
ఆరోగ్య బీమా.. జాగ్రత్త సుమా

ఎంత త్వరగా తీసుకుంటే అంత మంచిది
 మనకు బీమా అవసరం రాకముందుగానే పాలసీ తీసుకోవడం మంచిది. ఎందుకంటే.. మనకు అవసరం పడినప్పుడు వైద్య బీమా లభించకపోవచ్చు. కనుక.. యుక్త వయసులో, సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నప్పుడే వైద్య బీమా పాలసీ తీసుకుంటే తక్కువ ప్రీమియానికే అధిక కవరేజి లభిస్తుంది. వయసు మీద పడ్డ తర్వాత కన్నా యుక్త వయసులో పాలసీ తీసుకున్నప్పుడు విస్తృతమైన కవరేజి లభిస్తుంది. వయసు పెరుగుతున్న కొద్దీ.. ప్రీమియంలు పెరుగుతాయి.

 ఒకవేళ అప్పటికే ఏదైనా అనారోగ్యం బారిన పడిన పక్షంలో, సదరు అనారోగ్యానికి కవరేజి లభించదు. ఫలితంగా మొత్తం పాలసీనే నిరర్థకమవుతుంది. చాలా కంపెనీల హెల్త్ ప్లాన్లకు నిర్దిష్టమైన ఎంట్రీ వయసుపై పరిమితి ఉంటుంది. అంటే, రిటైర్మెంట్ దగ్గరపడుతున్న కొద్దీ కవరేజీ పరిధి తగ్గిపోతుంటుంది. మరో విషయం.. ఏదైనా సంవత్సరంలో క్లెయిము చేయకపోయిన పక్షంలో పాలసీని రెన్యువల్ చే సుకునేటప్పుడు నో క్లెయిమ్ బోనస్ కూడా లభిస్తుంది.
 
 పన్ను ప్రయోజనాలు ఉంటాయి..కానీ..
 వైద్య బీమా కోసం కట్టే ప్రీమియంల మీద పన్నుపరమైన ప్రయోజనాలు కూడా లభిస్తాయి. ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 80డీ కింద ఈ ప్రీమియాలకు పన్ను మినహాయింపులు వర్తిస్తాయి. మీ వయసు 65 ఏళ్ల కన్నా తక్కువ ఉంటే.. మీకు, మీ జీవిత భాగస్వామి, పిల్లలు, మీ తల్లిదండ్రుల కోసం కట్టే హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం కింద రూ. 15,000 దాకా మినహాయింపులను క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంది. అంతే కాదు.. తల్లిదండ్రులు సీనియర్ సిటిజన్స్ అయి ఉండి, వారికీ కవరేజీ ఉండేలా తీసుకున్న పక్షంలో గరిష్టంగా రూ. 20,000 దాకా పన్ను మినహాయింపులను క్లెయిమ్ చేసుకోవచ్చు.

 అయితే, కేవలం పన్ను ప్రయోజనాలను మాత్రమే దృష్టిలో పెట్టుకుని హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోకూడదు. మీకెంత కవరేజీ అవసరమవుతుందో ముందు అంచనా వేసుకోవాలి. ఇందుకోసం కావాలంటే బీమా సలహాదారు సహాయం తీసుకోవడం మంచిది.
 
 హెల్త్ ఇన్సూరెన్స్‌లో వివిధ రకాల కవరేజీలు
 ప్రధానంగా రెండు రకాల వైద్య బీమా కవరేజీలు ఉన్నాయి.

అవి..
 వ్యక్తిగత వైద్య బీమా

 ఇది చాలా సింపుల్ హెల్త్ ఇన్సూరెన్స్ పథకం. పాలసీదారు ఆస్పత్రి పాలైనప్పుడు సమ్ అష్యూర్డ్ పరిమితి దాకా బీమా కవరేజి లభిస్తుంది. ఉదాహరణకు.. నలుగురు సభ్యులున్న కుటుంబంలో ఒక్కొక్కరు విడిగా రూ. 3 లక్షలకు వైద్య బీమా తీసుకున్నారనుకుందాం. అప్పుడు చికిత్సా వ్యయం రూ.3 లక్షలు దాటినా కవరేజ్ కేవలం సమ్ అష్యూర్డ్ రూ.3 లక్షల వరకే లభిస్తుంది. అంతేకాని నలుగురుకి కలిపి రూ.12 లక్షల వరకు బీమా ఉన్నా దాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోలేము. అలా కాకుండా కుటుంబంలోని నలుగురు సభ్యులు ఒకేసారి ఆసుపత్రిపాలైతే మాత్రం ఒక్కొక్కరు వ్యక్తిగతంగా రూ. 3 లక్షలు చొప్పున మొత్తం రూ.12 లక్షలు  క్లెయిమ్ చేసుకోవచ్చు.

 ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్..
 హెల్త్ ఇన్సూరెన్స్‌కి సంబంధించి ఇది మరింత మెరుగైన పథకం. ఇది కుటుంబ సభ్యులందరికీ కూడా కవరేజీని అందిస్తుంది. సమ్ అష్యూర్డ్ పరిమితి దాకా మొత్తం కుటుంబానికి కవరే జీ లభిస్తుంది. ఒక్కొక్కరికీ ఒక్కో పథకం తీసుకున్న దానికన్నా అందరికీ కలిపి వర్తించేలా ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ తీసుకుంటే ప్రీమియంలు తక్కువగా ఉంటాయి. ఉదాహరణకు.. మీ ఇంట్లో నలుగురు కుటుంబ సభ్యులు ఉన్నారనుకుందాం. అందరికీ కలిపి రూ. 5 లక్షలకు ఫ్యామిలీ ఫ్లోటర్‌ను తీసుకోవచ్చు.

 ఇప్పుడు కుటుంబంలోని ఒక్కొక్కరికీ గరిష్టంగా రూ. 5 లక్షల దాకా కవరేజీ ఉంటుంది. ఒకవేళ ఎవరైనా ఆస్పత్రి పాలై, వైద్య ఖర్చులు రూ. 3 లక్షలు అయ్యాయనుకుంటే.. ఆ మొత్తాన్ని బీమా కంపెనీ చెల్లిస్తుంది. మొత్తం కుటుంబం గురించి ఆలోచించినప్పుడు ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ తీసుకోవడం మంచిది. ఎందుకంటే, తక్కువ ప్రీమియంతో ఒకే ప్లాన్ ద్వారా అందరికీ పెద్ద ఎత్తున కవరేజీ లభిస్తుంది. పైగా.. అంతా ఒకేసారి అనారోగ్యం పాలయ్యే అవకాశాలు తక్కువ కాబట్టి, ఇది మరింత లాభదాయకంగా ఉంటుంది.

 కాబట్టి, మీకు అనువైన హెల్త్ పాలసీని సాధ్యమైనంత త్వరగా తీసుకోవడం ఉత్తమం. మీకు అవసరం రాక ముందే పాలసీ కొనుక్కోండి.. అదీ యుక్తవయసులోనే తీసుకోండి.
 
 గ్రూప్ మెడిక్లెయిమ్..
 ఎంత ఉపయోగం..

  ప్రస్తుతం చాలా సంస్థలు బేసిక్ హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీని కల్పిస్తున్నాయి. అయినప్పటికీ.. మీరు వ్యక్తిగతంగా వైద్య బీమా తీసుకుని ఉంచుకోవడం మంచిది.

ఎందుకంటే ..
  గ్రూప్ మెడిక్లెయిమ్ కింద కంపెనీ నుంచి బీమా కవరేజి లభించినప్పటికీ.. ఇలాంటి పాలసీల్లో సమ్ అష్యూర్డ్ పరిమాణం తక్కువగానే ఉంటుంది. వైద్య బీమా ఖర్చులు ఏటా పెరిగిపోతున్న నేపథ్యంలో తీవ్రమైన సమస్య వచ్చినప్పుడు ఈ కవరేజీ సరిపోకపోవచ్చు.

 ఒకవేళ మీ కంపెనీ గానీ బీమా పాలసీల వ్యయాలను తగ్గించుకోవాలనుకున్న పక్షంలో మొత్తానికే కవరేజీ లేకుండా పోవచ్చు.

 పలు గ్రూప్ మెడిక్లెయిమ్ పాలసీల్లో ఉండే నిర్దిష్ట నిబంధనల వల్ల కొన్ని సందర్భాల్లో పాలసీదారు సొంత  జేబు నుంచి కొంత కట్టుకోవాల్సి కూడా రావొచ్చు.

   ప్రీమియం విషయంలో వయసు చాలా కీలక పాత్ర పోషిస్తుంది. వయసు పెరిగిన కొద్దీ.. ప్రీమియం పెరుగుతూ పోతుంది. కాబట్టి.. పర్సనల్ హెల్త్ పాలసీ ఎంత ముందుగా తీసుకుంటే అంత మంచిది.

మరిన్ని వార్తలు