బంగారానికి తగ్గిన డిమాండ్

21 May, 2014 00:46 IST|Sakshi
బంగారానికి తగ్గిన డిమాండ్
  • 2014 జనవరి-మార్చి మధ్య 190 టన్నులు
  • గతేడాది ఇదే కాలంలో 257 టన్నులు
  • డబ్ల్యూజీసీ తాజా నివేదిక
  • ముంబై: భారత్ బంగారం డిమాండ్ 2014 మొదటి క్వార్టర్ జనవరి- మార్చి నెలల మధ్య 2013 ఇదే కాలంతో పోల్చితే 26 శాతం పడిపోయింది. ఈ కాలాల మధ్య బంగారం డిమాండ్ 257.5 టన్నుల నుంచి 190.3 టన్నులకు తగ్గిందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) నివేదిక ఒకటి మంగళవారం పేర్కొంది. కరెంట్ అకౌంట్ కట్టడి(సీఏడీ)లో భాగంగా ప్రభుత్వం పసిడి దిగుమతిపై విధించిన అధిక దిగుమతి సుంకాలు, సరఫరాల్లో కట్టడి అంశాలు దీనికి కారణమని నివేదిక పేర్కొంది. డబ్ల్యూజీసీ గోల్డ్ డిమాండ్ ట్రెండ్స్ పేరుతో ఆవిష్కరించిన నివేదిక ముఖ్యాంశాలను సంస్థ మేనేజింగ్ డెరైక్టర్ (ఇండియా) సోమసుందరం ఇక్కడ తెలిపారు.
     
    విలువ రూపంలో చూస్తే, మొదటి త్రైమాసికాల్లో బంగారం డిమాండ్ విలువ 33 శాతం పడిపోయింది. ఇది రూ.73,184 కోట్ల నుంచి రూ. 48,853 కోట్లకు తగ్గింది.
       
    దేశీయంగా భారీ సుంకాల వల్ల అంతర్జాతీయ మార్కెట్ రేటుతో పోల్చితే దేశీయంగా ధర దాదాపు 3 వేల వరకూ అధికంగా ఉంది.  దీన్ని సొమ్ము చేసుకోవడానికి భారత్‌లోకి బంగారం అక్రమ రవాణా భారీగా కొనసాగింది.
       
    దేశంలో బంగారంపై ఆంక్షల వల్ల ఈ పరిశ్రమపై కొంత ప్రతికూల ప్రభావం కనబడుతోంది.
       
    దేశీయంగా ధరల తీవ్రత వల్ల భారతీయులు యూఏఈలో బంగారం కొనుగోళ్లు జరిపి, దేశానికి తీసుకురావడం అధికమైంది. దీనితో యూఏఈలో బంగారం డిమాండ్ 13 శాతం పెరిగింది.
       
    క్యూ1లో ఆభరణాల డిమాండ్  విషయానికి వస్తే, ఈ పరిమాణం 9 శాతం తగ్గి 159.5 టన్నుల నుంచి 145.6 టన్నులకు క్షీణించింది. విలువ రూపంలో ఇది 18% పడిపోయి రూ.45,331.2 కోట్ల నుంచి రూ.37,377.8 కోట్లకు తగ్గింది.
       
    ఇన్వెస్ట్‌మెంట్ డిమాండ్ 54% తగ్గి 98 టన్నుల నుంచి 44.7 టన్నులకు చేరింది. విలువ రూపంలో  రూ.27,852 కోట్ల నుంచి 11,475 కోట్లకు పడింది.
           
    మోడీ-బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం.. బంగారం దిగుమతులపై స్వల్పకాలిక ఆంక్షలు తొలగించే అవకాశం ఉంది. ఇదే జరిగితే డిమాండ్ తిరిగి పుంజుకునే అవకాశం ఉంటుంది.
           
    2014లో బంగారం డిమాండ్ 900 నుంచి 1000 టన్నుల వరకూ నమోదవుతుందని అంచనా.
     
     ప్రపంచ వ్యాప్తంగా...
     కాగా ప్రపంచ వ్యాప్తంగా 2014 మొదటి క్వార్టర్‌లో బంగారం డిమాండ్ దాదాపు స్థిరంగా 1,074.5 టన్నులుగా కొనసాగింది. 2013 ఇదే క్వార్టర్‌లో ఈ పరిమాణం 1,077.2 టన్నులు.

మరిన్ని వార్తలు