మార్కెట్‌ ర్యాలీయా.. దిద్దుబాటా?

4 May, 2020 06:10 IST|Sakshi

సోమవారం భారీ గ్యాప్‌డౌన్‌తో ప్రారంభమయ్యే అవకాశం

కరోనా వైరస్‌ వ్యాప్తి విషయంలో అమెరికా–చైనాల మధ్య ట్రేడ్‌వార్‌

ఒడిదుడుకులకు అవకాశం: సామ్కో సెక్యూరిటీస్‌

ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ ఫలితాలు ఈవారంలోనే..

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ ఈ వారంలోనూ ర్యాలీని కొనసాగిస్తుందా..లేక మరో భారీ పతనాన్ని నమోదుచేస్తుందా..? అనే సందిగ్ధంలో పడే స్తోంది.  దశల వారీగా లాక్‌డౌన్‌ను ఎత్తివేయడం అనేది మార్కెట్‌కు సానుకూలాంశమేమి కాదని, మార్కెట్‌ గ్యాప్‌డౌన్‌తోప్రారంభం కావచ్చని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ అన్నారు. కంపెనీల ఫలితాలు, కోవిడ్‌–19 వ్యాక్సిన్, ముడి చమురు ధరలే కీలకంగా ఉండనున్నాయని మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రిటైల్‌ రీసెర్చ్‌ హెడ్‌ సిద్ధార్థ  విశ్లేషించారు. వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో అమెరికా–చైనాల మధ్య ట్రేడ్‌వార్‌ ముదిరితే భారీ పతనం ఉంటుందని అన్నారు. స్వల్పకాలంలోనే దిగువస్థాయి నుంచి ర్యాలీ చేసిన మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్‌ షేర్లలో లాభాల స్వీకరణ అవకాశం ఉండనుండగా.. ఈవారంలో ఒడిదుడుకులకు ఆస్కారం ఉందని సామ్కో సెక్యూరిటీస్‌ సీఈఓ జిమిత్‌ మోడీ అన్నారు.

గణాంకాల ప్రభావం: ఏప్రిల్‌ నెల మార్కిట్‌ తయారీ పీఎంఐ సోమవారం విడుదలకానుండగా.. సేవారంగ పీఎంఐ బుధవారం వెల్లడికానుంది. అమెరికా మార్కిట్‌ కాంపోజిట్‌ పీఎంఐ, సేవారంగ పీఎంఐ మంగళవారం విడుదలకానుంది. నిరుద్యోగ జాబితా శుక్రవారం రానుంది.  

24 కంపెనీల ఫలితాలు
ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్, మారికో, అదానీ పోర్ట్స్, ఎస్‌బీఐ లైఫ్, యస్‌ బ్యాంక్, నెరోలాక్‌ పెయింట్స్‌ ఫలితాలు ఈవారంలోనే వెల్లడికానున్నాయి. ఇక గతవారం మార్కెట్‌ ముగిసిన తర్వాత రిలయన్స్‌ ఫలితాలు వెల్లడికాగా, సంస్థ క్యూ4 నికర లాభం 39 శాతం తగ్గింది. ఈ ప్రభావం సోమవారం మార్కెట్‌ ప్రారంభంపై స్పష్టంగా ఉండనుందని రెలిగేర్‌ బ్రోకింగ్‌ పరిశోధన విభాగం వైస్‌ ప్రెసిడెంట్‌ అజిత్‌ మిశ్రా అన్నారు. ఇక చరిత్రలోనే తొలిసారిగా ఆటోమొబైల్‌ పరిశ్రమ ఏప్రిల్‌ అమ్మకాలను సున్నాగా ప్రకటించింది.

మరిన్ని వార్తలు