నేటి నుంచి ఎన్టీపీసీ పబ్లిక్ ఆఫర్

23 Feb, 2016 01:13 IST|Sakshi
నేటి నుంచి ఎన్టీపీసీ పబ్లిక్ ఆఫర్

ఫ్లోర్ ప్రైస్ రూ.122
రిటైల్ ఇన్వెస్టర్లకు 5 శాతం డిస్కౌంట్


న్యూఢిల్లీ:  విద్యుదుత్పత్తి సంస్థ ఎన్‌టీపీసీలో 5 శాతం వాటా(41.22 కోట్ల షేర్ల)ను కేంద్ర ప్రభుత్వం నేటి(మంగళవారం) నుంచి రెండు రోజుల పాటు  విక్రయించనున్నది. ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్‌ఎస్) విధానంలో ఒక్కో షేర్‌ను రూ.122 ధరకు(సోమవారం నాటి ముగింపు ధర రూ. 127కు 4 శాతం డిస్కౌంట్‌తో)  విక్రయించనున్నారు. నేడు(మంగళవారం) సంస్థాగత బిడ్డర్లకు, రేపు(బుధవారం) రిటైల్ ఇన్వెస్టర్లకు షేర్లను విక్రయిస్తారు. మొత్తం 5 శాతం వాటా విక్రయంలో 20 శాతం వాటాను రిటైల్ ఇన్వెస్టర్లకు కేటాయించారు. రిటైల్ ఇన్వెస్టర్లకు 5 శాతం డిస్కౌంట్(ఒక్కో షేర్ రూ.116) లభిస్తుంది.  రూ. 2 లక్షలకు మించని షేర్లకు బిడ్ చేసేవారిని రిటైల్ ఇన్వెస్టర్లుగా పరిగణిస్తారు. ఈ 5 శాతం వాటా విక్రయం ద్వారా ఖజానాకు రూ.5,029 కోట్లు సమకూరుతాయని అంచనా.

మార్కెట్ నియంత్రణ సంస్థ ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్‌ఎస్) నిబంధనలు సవరించిన తర్వాత ఓఎఫ్‌ఎస్ విధానంలో షేర్ల విక్రయానికి వస్తున్న తొలి  కంపెనీ ఎన్‌టీపీసీ, ఎన్‌టీపీసీలో ప్రభుత్వానికి ప్రస్తుతం 74.96 శాతం వాటా ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం వాటా విక్రయిస్తున్న ఆరో ప్రభుత్వ రంగ కంపెనీ ఎన్‌టీపీసీ. కాగా ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం ఐదు ప్రభుత్వ రంగ సంస్థలు-ఇంజినీర్స్ ఇండియా, ఇండియన్ ఆయిల్ కార్పొ, పీఎఫ్‌సీ, ఆర్‌ఈసీ, డ్రెడ్జింగ్ కార్పొరేషన్‌లలో వాటా విక్రయం ద్వారా రూ.13,300 కోట్లు సమీకరించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ సంస్థల వాటా విక్రయం ద్వారా రూ.69,500 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. స్టాక్ మార్కెట్ తీవ్రమైన ఒడిదుడుకులకు గురవుతున్న నేపథ్యంలో  ఈ లక్ష్యంలో ఐదవ వంతు నిధులను కూడా ప్రభుత్వం సమీకరించలేకపోయింది.

మరిన్ని వార్తలు