హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ లాభం స్వల్పవృద్ధి

20 Jan, 2016 01:21 IST|Sakshi
హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ లాభం స్వల్పవృద్ధి

కొత్త టెక్నాలజీలపై పెట్టుబడుల వల్లే: కంపెనీ సీఈఓ
న్యూఢిల్లీ: సాఫ్ట్‌వేర్ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ కంపెనీ నికర లాభం తాజా డిసెంబర్ త్రైమాసికంలో స్వల్పంగా పెరిగింది. 2014 సంవత్సరం డిసెంబర్ క్వార్టర్‌లో రూ.1,915 కోట్లుగా ఉన్న నికర లాభం 2015 డిసెంబర్ క్వార్టర్‌లో 0.2 శాతం వృద్ధితో రూ.1,920 కోట్లకు పెరిగిందని హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ తెలిపింది. కొత్త తరం టెక్నాలజీలపై పెట్టుబడుల కారణంగా నికర లాభం స్వల్పంగానే వృద్ధి సాధించిందని  హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ప్రెసిడెంట్, సీఈఓ అనంత్ గుప్తా చెప్పారు. ఆదాయం రూ.9,283 కోట్ల నుంచి రూ.10,341 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. ఇక డాలర్ టర్మ్‌ల్లో... నికర లాభం 5.4 శాతం క్షీణించి 29 కోట్ల డాలర్లకు తగ్గగా,  ఆదాయం 5 శాతం వృద్ధితో 156 కోట్ల డాలర్లకు పెరిగిందని పేర్కొన్నారు. ఈ కంపెనీ జూలై-జూన్ ఆర్థిక సంవత్సరాన్ని పాటిస్తోంది.
 
వీసా ‘సమస్య’ కాదు..: వివిధ విభాగాల్లో మంచి వృద్ధిని సాధించామని బియాండిజిటల్, నెక్స్‌ట్‌జెన్ ఐటీఓ, ఐఓటీవర్క్స్ వంటి టెక్నాలజీలపై దృష్టి సారిస్తున్నామని, పెట్టుబడులు పెడుతున్నామని అనంత్ గుప్తా పేర్కొన్నారు. తాజా డిసెంబర్ క్వార్టర్‌లో వంద కోట్ల డాలర్ల మొత్తం కాంట్రాక్ట్ వేల్యూ(టీసీవీ) ఉన్న ఎనిమిది ఒప్పందాలను కుదుర్చుకున్నామని వివరించారు. అమెరికా వీసా వ్యయాలు పెంచడం పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని గుప్తా పేర్కొన్నారు.

హెచ్1బీ వీసా ఉద్యోగులు స్వల్పమేనని, అమెరికాలో స్థానికులకే అధికంగా ఉద్యోగాలిచ్చామని, ఈ సమస్య తమను పెద్దగా బాధించదని వివరించారు. తాజా డిసెంబర్ క్వార్టర్ చివరి నాటికి రూ.1,762 కోట్ల విలువైన నగదు, నగదు సమానమైన నిల్వలున్నాయని తెలిపారు.
 
చైనాలో విస్తరణ
గత ఏడాది రిటర్న్ ఆన్ ఈక్విటీ 29 శాతం సాధించామని, ఇది ఐటీ పరిశ్రమలో ఉత్తమమని హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ సీఎఫ్‌ఓ అనిల్ చనన తెలిపారు. చైనాలో తయారీ కార్యకలాపాలున్న క్లయింట్ల కోసం ఆ దేశంలో విస్తరిస్తున్నామని వివరించారు. ఆర్థిక ఫలితాల అంచనాలను అందుకోలేకపోవడంతో ఈ షేర్ 0.5 శాతం క్షీణించి రూ.839 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు