రూ. 2.4 లక్షల కోట్లు వదులుకోవాలి!

20 Jul, 2017 00:59 IST|Sakshi
రూ. 2.4 లక్షల కోట్లు వదులుకోవాలి!

రూ.4 లక్షల కోట్ల అప్పుల్లో 40 శాతమే దక్కేది
50 మొండి ఖాతాలకు సంబంధించి ఇదే పరిస్థితి
బ్యాంకుల ’హెయిర్‌కట్‌’ భారీగానే ఉంటుంది
వీటిలో అధికం మెటల్, నిర్మాణ, విద్యుత్‌ కంపెనీలే
విద్యుత్‌ కంపెనీల హెయిర్‌కట్‌ కాస్త తక్కువే: క్రిసిల్‌  


ముంబై: భారీగా మొండి బకాయిలు పేరుకుపోయిన దాదాపు 50 ఖాతాలను పరిష్కరించుకునేందుకు బ్యాంకులు సుమారు రూ.2.4 లక్షల కోట్లు వదులుకోవాల్సి (హెయిర్‌కట్‌) రావొచ్చని రేటింగ్‌ సంస్థ క్రిసిల్‌ అంచనా వేసింది. ఆయా సంస్థలు చెల్లించాల్సిన మొత్తంలో ఇది సుమారు 60%మని తెలియజేసింది. ఈ 50 మొండి బాకీల ఖాతాలు.. మెటల్స్, నిర్మాణ, విద్యుత్‌ రంగాలకు చెందినవి. బ్యాంకింగ్‌ వ్యవస్థలో పేరుకున్న మొత్తం రూ.8 లక్షల కోట్ల పైగా నిరర్థక ఆస్తుల (ఎన్‌పీఏ) పరిమాణంలో వీటి వాటా దాదాపు సగభాగం ఉంటుందని క్రిసిల్‌ తెలిపింది. ‘దాదాపు రూ.4 లక్షల కోట్ల రుణభారం పేరుకుపోయిన 50 భారీ మొండి బాకీల ఖాతాల సమస్యను సెటిల్‌ చేసుకునేందుకు బ్యాంకులు సుమారు 60%.. అంటే దాదాపు రూ.2.4 లక్షల కోట్ల మేర వదులుకోవాల్సి వస్తుంది‘ అని పేర్కొంది.

ఈ హెయిర్‌కట్‌ను స్వల్ప (25% కన్నా తక్కువ), ఒక మోస్తరు (25–50 %), అధికం (50–75%), అత్యధికం (75% పైగా) కింద నాలుగు రకాలుగా వర్గీకరించింది. ప్రస్తుతం ఇలా ఎన్‌పీఏలు బాగా పేరుకుపోయిన సంస్థలపై రిజర్వు బ్యాంకు సూచనల మేరకు అప్పులిచ్చిన బ్యాంకులు దివాలా ప్రక్రియను ఆరంభించిన విషయం తెలిసిందే. దివాలా ప్రక్రియలో భాగంగా చివరకు ఆయా సంస్థల ఆస్తుల్ని విక్రయించుకునే అవకాశం బ్యాంకులకు ఉంటుంది. ఇలా విక్రయించిన పక్షంలో బ్యాంకులకు 40% మొత్తమే దక్కుతుందని, మిగిలిన 60%న్ని వదులుకోవాల్సి ఉంటుందని క్రిసిల్‌ నివేదిక హెచ్చరించింది.

ఒక మోస్తరుగా విద్యుత్‌ రంగం..
విద్యుత్‌ రంగ కంపెనీలకు ఒక మోస్తరు హెయిర్‌కట్‌ సరిపోతుందని, అయితే మెటల్స్, నిర్మాణ రంగ సంస్థల మొండి బాకీల విషయంలో బ్యాంకులు అధికంగానే వదులుకోవాల్సి రావొచ్చని క్రిసిల్‌ చీఫ్‌ అనలిటికల్‌ ఆఫీసర్‌ పవన్‌ అగ్రవాల్‌ తెలిపారు. అత్యధికంగా హెయిర్‌కట్‌ అవసరమయ్యే ఖాతాల్లో ఎక్కువ భాగం సంస్థలు నిలదొక్కుకోలేని వ్యాపార రంగాల్లో ఉన్నవేనని ఆయన పేర్కొన్నారు. ఒక మోస్తరు లేదా అధిక హెయిర్‌కట్‌ అవసరమైన కంపెనీలు చాలా మటుకు పెట్టుబడి వ్యయాల కోసం రుణాలు తీసుకున్నవే.

అయితే డిమాండ్‌ పడిపోవడమో లేదా నియంత్రణపరమైన అడ్డంకులతో అవి తలపెట్టిన ప్రాజెక్టులు నిల్చిపోవడం.. ఫలితంగా సమయం వృధా కావడంతో పాటు వ్యయాలూ భారీగా పెరిగిపోయి సదరు ప్రాజెక్టు లాభదాయకత దెబ్బతినడమో జరిగిందని క్రిసిల్‌ తెలిపింది. ఇక స్వల్ప హెయిర్‌కట్‌ అవసరమయ్యే కంపెనీలు.. తాత్కాలికంగా ఎదురుదెబ్బలు ఎదుర్కొంటున్నవని, కాలక్రమేణా అవి సర్దుకోగలవని వివరించింది. నిర్ణయాలు వాయిదా వేయడం కన్నా ఎకానమీ విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని బ్యాంకులు ఒకింత కష్టమైనా హెయిర్‌కట్‌ చేదు మాత్ర తీసుకోవడమే శ్రేయస్కరమని తెలిపింది.

బ్యాంకులకు మూలధనంపై కేంద్రం కసరత్తు..
ప్రభుత్వ రంగ బ్యాంకులకు మరింత మూలధనం సమకూర్చే వ్యూహంపై కేంద్ర ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. త్వరలో దీనిపై ప్రకటన చేయొచ్చని ఆర్థిక శాఖ సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. తమ తమ మూలధన అవసరాలపై వివిధ బ్యాంకులు పంపిన అభ్యర్ధనలకు సంబంధించి ఇంద్రధనుష్‌ స్కీము కింద నిధులు సమకూర్చే ప్రతిపాదనలకు తుది రూపునిచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని వివరించారు.

లబ్ధి పొందే బ్యాంకుల జాబితాను త్వరలో విడుదల చేస్తామని, గత ంలోలాగే ఈసారీ మూలధన నిధులు దశలవారీగా అందిస్తామని అధికారి తెలిపారు. ఇంద్రధనుష్‌ స్కిము కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకుల మూలధన అవసరాలకోసం రూ. 10,000 కోట్లు కేటాయించినప్పటికీ.. మొండిబాకీల పరిష్కారాల కోసం బ్యాంకులు అధిక ప్రొవిజనింగ్‌ చేయాల్సి వస్తుండటంతో ఈ మొత్తం సరిపోకపోవచ్చని భావిస్తున్నారు. స్వయంగా ఆర్‌బీఐ డిప్యుటీ గవర్నర్‌ ఎస్‌ఎస్‌ ముంద్రా సైతం గత నెలలో ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు.

>
మరిన్ని వార్తలు