కార్ల సందడి రెడీ!!

4 Feb, 2020 04:58 IST|Sakshi

ఈ నెల 7 నుంచి 12 వరకూ ఆటోఎక్స్‌పో...

ఎలక్ట్రిక్‌ వాహనాలపైనే అత్యధికంగా దృష్టి...

రెండేళ్లకొకసారి జరిగే వాహన పండుగకు రంగం సిద్ధమైంది. పర్యావరణ స్పృహ బాగా పెరిగిన నేపథ్యంలో ఈసారి ఈ ఆటో ఎక్స్‌పోలో ఎలక్ట్రిక్‌ వాహనాల జోరు బాగా ఉండగలదని నిపుణులు భావిస్తున్నారు. మందగమనం కారణంగా వాహన విక్రయాలు కుదేలయ్యాయని, ఆ ఆటో ఎక్స్‌పో వినియోగదారుల సెంటిమెంట్‌కు జోష్‌నివ్వగలదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ శుక్రవారం (ఈ నెల 7వ తేదీ) నుంచి ఆరంభం కానున్న ఆటో ఎక్స్‌పోకు  సంబంధించిన వివరాలు, పాల్గొనే కంపెనీలు, అవి ఆవిష్కరించే మోడళ్లు తదితర అంశాల సమాహారం సాక్షి పాఠకుల కోసం ప్రత్యేకం...

ఆర్థిక మందగమనం వాహన రంగాన్ని బాగా దెబ్బతీస్తోంది.  గత ఏడాది అమ్మకాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. వాహన రంగ రికవరీ ఆటో ఎక్స్‌పోతో ఆరంభం కాగలదని వాహన కంపెనీలు ఆశిస్తున్నాయి. 1986లో మొదలై ప్రతి రెండేళ్లకొకసారి జరిగే ఈ ఆటో ఎక్స్‌పోలో దేశీ, విదేశీ కంపెనీలు తమ వాహనాలను డిస్‌ప్లే చేయనున్నాయి. కొత్త మోడళ్ల ఆవిష్కరణలకు, మార్కెట్లో ప్రవేశపెట్టడానికి ఆటో ఎక్స్‌పో వేదికగా పలు వాహన కంపెనీలు సిద్ధమవుతున్నాయి.

ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి బీఎస్‌ 6 ప్రమాణాలు అమల్లోకి రానుండటంతో ఈ ఆటో షో ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే అమ్మకాలు తగ్గుతుండటం, బీఎస్‌ 6 నిబంధనలు అమల్లోకి రానుండటం తదితర కారణాల వల్ల పలు కంపెనీలు ఈ ఆటో ఎక్స్‌పోలో పాల్గొనడం లేదు. కాగా,  చైనాకు చెందిన గ్రేట్‌ వాల్‌మోటార్స్, ఫా హైమ ఆటోమొబైల్‌ కంపెనీలు ఈ ఆటో ఎక్స్‌పో ద్వారా భారత మార్కెట్లోకి ప్రవేశిస్తున్నాయి. 2018లో జరిగిన ఆటో ఎక్స్‌పోకు సుమారుగా 6 లక్షల మంది సందర్శకులు వచ్చారు. ఈ ఏడాది ఆటో ఎక్స్‌పోకు కూడా ఇదే స్థాయిలో సందర్శకులు వస్తారనేది నిర్వాహకుల అంచనా.

మారుతీ సుజుకీ....
ఈ ఆటో ఎక్స్‌పోలో మారుతీ సుజుకీ కూపే స్టైల్‌ ఎలక్ట్రిక్‌ కాన్సెప్ట్‌ కారు ‘ఫ్యూచరో–ఈ’ ను ఆవిష్కరించనుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన భారత కారుగా ఈ కాన్సెప్ట్‌ కారు నేటి యువత ఆకాంక్షలను ప్రతిబింబించేలా ఉంటుందని మారుతీ పేర్కొంది. దీంతో బీఎస్‌–6 పెట్రోల్‌ విటారా బ్రెజా, ఇగ్నిస్‌ మోడల్‌లో అప్‌గ్రేడెడ్‌ వేరియంట్‌ను, స్విఫ్ట్‌ హైబ్రిడ్‌ వేరియంట్‌ను, మరో 14 ఇతర మోడళ్లను ప్రదర్శించనున్నది.  

టాటా మోటార్స్‌  
పలు ఎస్‌యూవీ మోడళ్లను టాటా మోటార్స్‌ కంపెనీ ఈ ఆటో ఎక్స్‌పోలో డిస్‌ప్లే చేయనున్నది. ఏడు సీట్ల ఎస్‌యూవీ గ్రావిటాస్‌ మోడల్‌ను ఇక్కడే ఆవిష్కరించనున్నది. ఆల్ట్రోజ్‌ ఎలక్ట్రిక్‌ వాహనాన్ని, హెచ్‌2ఎక్స్‌ కాన్సెప్ట్‌ కారును, హారియర్‌ మోడల్‌లో కొత్త వేరియంట్‌ను ప్రదర్శించడానికి సిద్ధమవుతోంది.  

స్కోడా, ఫోక్స్‌వ్యాగన్‌
స్కోడా, ఫోక్స్‌వ్యాగన్‌లు విలీనమై ఏర్పాటైన స్కోడా ఆటో ఫోక్స్‌ వ్యాగన్‌ ఇండియా పలు మోడళ్లను ఈ ఆటో ఎక్స్‌పో కోసం సిద్ధం చేస్తోంది. టిగుయాన్‌ ఆల్‌స్పేస్, టీ–రోక్‌ ఎస్‌యూవీ, విజన్‌ ఇన్, ఆక్టేవియా ఆర్‌ఎస్‌245, సూపర్బ్‌లో కొత్త వేరియంట్, కోడియాక్‌ టీఎస్‌ఐ, కరోక్‌ ఎస్‌యూవీలను తెస్తోంది.  

మహీంద్రా అండ్‌ మహీంద్రా
ఎస్‌యూవీల్లో కొత్త వేరియంట్లతో పాటు ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీలను కూడా డిస్‌ప్లే చేయనున్నది. ఎక్స్‌యూవీ300, కేయూవీ100 మోడళ్లలో ఎలక్ట్రిక్‌ వేరియంట్లను కలుపుకొని మొత్తం నాలుగు ఎస్‌యూవీ ఈవీలను సిద్ధం చేస్తోంది. బీఎస్‌–6 ప్రమాణాలతో కూడిన అల్టురాస్, ఎక్స్‌యూవీ300, మారాజో వేరియంట్లను ప్రదర్శించనున్నది.  

వందకు పైగా ఆవిష్కరణలు...
దాదాపు 31 కంపెనీలు ఈ ఆటో ఎక్స్‌పోలో పాలుపంచుకోనున్నాయి. దాదాపు వందకు పైగా కొత్త మోడళ్లు, వేరియంట్ల ఆవిష్కరణ జరగనున్నది. ఎలక్ట్రిక్‌ వాహనాలకు సంబంధించిన 30కి పైగా స్టార్టప్‌లు కూడా తమ తమ టెక్నాలజీలను, ఉత్పత్తులను డిస్‌ప్లే  చేయనున్నాయి. కాగా కరోనా వైరస్‌ కారణంగా చైనా ప్రతినిధులు తమ ప్రయాణాలను రద్దు చేసుకున్నారు. చైనా కంపెనీలు ఆ ఆటో ఎక్స్‌పోలో పాల్గొంటాయని, ఇక్కడి ఉన్నతాధికారులే వస్తారని, చైనా నుంచి పెద్ద అధికారులెవరూ రారని సమాచారం. కాగా, ఈ ఆటో ఎక్స్‌పో వినియోగదారుల సెంటిమెంట్‌కు జోష్‌నివ్వగలదని సియామ్‌ (సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ ఆటోమొబైల్‌ మాన్యుఫాక్చరర్స్‌) డైరెక్టర్‌ జనరల్‌ రాజీవ్‌ మీనన్‌ ఆశాభావం వ్యక్తంచేశారు.

హ్యుందాయ్‌....
క్రెటా మోడల్‌లో కొత్త వేరియంట్‌ను ఆవిష్కరించనున్నది. ఎలంత్ర, ట్యూసన్, ఐ30ఎన్‌ హ్యాచ్‌బాక్‌లతో పాటు నెక్సో ఫ్యూయల్‌ సెల్‌ ఎస్‌యూవీని కూడా ప్రదర్శించనున్నది.  

ఎమ్‌జీ మోటార్స్‌  
చైనాకు చెందిన ఈ కంపెనీ పలు ఎస్‌యూవీలను ఆ ఆటో ఎక్స్‌పోలో డిస్‌ప్లే చేయనున్నది. ఐ–విజన్‌ కాన్సెప్ట్, మాక్సస్‌ డి90, 6 సీట్ల హెక్టర్, ఎమ్‌జీ 6 హ్యాచ్‌బ్యాక్, ఎమ్‌జీ 360 సెడాన్‌లను సిద్ధం చేస్తోంది.  

కియా మోటార్స్‌
ఈ కంపెనీ కార్నివాల్‌ ఎమ్‌పీవీ(మల్టీ పర్పస్‌ వెహికల్‌)ను, క్యూవైఐ ఎస్‌యూవీని, సోల్‌ ఈవీ, స్ట్రింజర్‌ జీటీ, స్పోర్టేజ్‌ క్రాసోవర్, నిరో హ్యాచ్‌బ్యాక్‌ తదితర కార్లను ప్రదర్శించనున్నది.  

రెనో  
ఈ కంపెనీ మొత్తం 12 కార్లను డిస్‌ప్లే చేయనున్నది. హెచ్‌బీసీ ఎస్‌యూవీ, జో ఈవీ హ్యాచ్‌బాక్, ట్రైబర్‌ ఏఎమ్‌టీ, ట్రైబర్‌ పెట్రోల్‌ కార్లను ఆవిష్కరించనున్నది.

గ్రేట్‌ వాల్‌ మోటార్స్‌  
చైనాకు చెందిన ఈ కంపెనీ హావల్, ఓరా బ్రాండ్‌ ఎస్‌యూవీ, ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రదర్శించనున్నది. హెచ్‌9, హెచ్‌6, హెచ్‌1 ఎస్‌యూవీలతో పాటు హెచ్, విజన్‌ 2025 కాన్సెప్ట్‌ కార్లను డిస్‌ప్లే చేయనుంది.

మెర్సిడెస్‌ బెంజ్‌  
కొత్త ఏ–క్లాస్‌ లిమోసిన్, 2020 జీఎల్‌ఏ, ఈక్యూసీ ఎడిషన్‌ 1886– ఈ మూడు కార్లను ఆవిష్కరించనుంది.  ఏఎమ్‌జీ జీటీ 63 ఎస్‌ 4మ్యాటిక్‌ 4 డోర్ల కూపే కారుతో పాటు వి–క్లాప్‌ మార్కోపోలో కార్లను తీసుకొస్తోంది.

ఎప్పుడు:  ఈ నెల 7–12 తేదీల్లో  
ఎక్కడ: ఢిల్లీ సమీపంలోని గ్రేటర్‌ నోయిడాలోని
ఇండియా ఎక్స్‌పో మార్ట్‌లో  
ఇది ఎన్నవ సారి: 15వ సారి  
పాల్గొనే కంపెనీల సంఖ్య: 30కి పైగా  
ఆవిష్కరణలు: కొత్త మోడళ్లు,
వేరియంట్లు కలుపుకొని 100కు పైగా  
సందర్శకుల సంఖ్య: 6 లక్షలకు పైగా (అంచనా)
ఎవరు నిర్వహిస్తున్నారు: ఏసీఎమ్‌ఏ (ఆటోమోటివ్‌ కాంపొనెంట్‌ మాన్యుఫాక్చరర్స్‌ అసోసియేషన్‌)
సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ ఆటోమొబైల్‌ మాన్యుఫాక్చరర్స్‌ (సియామ్‌); కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ(సీఐఐ) 

>
మరిన్ని వార్తలు