టీసీఎస్ లాభం 6,083 కోట్లు..

13 Jan, 2016 00:20 IST|Sakshi
టీసీఎస్ లాభం 6,083 కోట్లు..

క్యూ3లో 14 శాతం వృద్ధి..
♦  ఆదాయం రూ. 27,364 కోట్లు;
12 శాతం పెరుగుదల...
♦  షేరుపై రూ. 5.50 డివిడెండ్

 
 ముంబై: మార్కెట్ ముందస్తు అంచనాలకు అనుగుణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో దేశీ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) బలహీనమైన ఆర్థిక ఫలితాలు వెల్లడించింది. నికర లాభం 14 శాతం వృద్ధితో రూ. 6,083 కోట్లుగా నమోదైంది. క్రితం ఆర్థిక సంవత్సరం అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో ఇది రూ. 5,328 కోట్లు.  ఆదాయం రూ. 24,501 కోట్ల నుంచి రూ. 27,364 కోట్లకు 12 శాతం మేర పెరిగింది. టీసీఎస్ రూ. 1 ముఖవిలువ గల షేరు ఒక్కింటిపై రూ. 5.50 మేర డివిడెండ్ ప్రకటించింది.
 
 సాధారణంగానే మూడో త్రైమాసికంలో కంపెనీల పనితీరు బలహీనంగానే ఉంటుందని, ఈసారి చెన్నై వరదలు కూడా దీనికి తోడయ్యాయని టీసీఎస్ ఎండీ ఎన్ చంద్రశేఖరన్ చెప్పారు. అయినప్పటికీ తమ వ్యాపార విభాగాలన్నీ కూడా మెరుగైన పనితీరు కనపర్చాయని ఆయన పేర్కొన్నారు. స్థిరమైన కరెన్సీ మారక విలువపరంగా చూసినప్పుడు సంపన్న దేశాల్లో ఉత్తర అమెరికా .. యూరప్ మార్కెట్లు, వర్ధమాన దేశాల్లో లాటిన్ అమెరికా మార్కెట్‌లో వ్యాపారం చెప్పుకోతగినంత స్థాయిలో వృద్ధి చెందినట్లు ఆయన వివరించారు. మొత్తం మీద కరెన్సీ మారక విలువపరంగానే కాకుండా ఇతరత్రా అనేక సవాళ్లతో కూడిన త్రైమాసికంలో కూడా కంపెనీ క్రమశిక్షణతో పురోగమించి, గణనీయమైన మార్జిన్లు సాధించగలిగిందని చంద్రశేఖరన్ తెలిపారు.
 
 
 సీక్వెన్షియల్‌గా చూస్తే కంపెనీ నికర లాభం రూ. 6,055 కోట్ల నుంచి కేవలం 0.9 శాతం మాత్రమే వృద్ధి చెందింది. అటు ఆదాయం కూడా రూ. 27,165 కోట్ల నుంచి 0.7 శాతం మాత్రమే పెరిగింది. స్థిరమైన కరెన్సీ మారకం ప్రాతిపదికన సీక్వెన్షియల్‌గా చూస్తే వృద్ధి కేవలం 0.5 శాతమేనని చంద్రశేఖరన్ పేర్కొన్నారు. పూర్తి ఆర్థిక సంవత్సర ఆదాయాలు క్రితం సంవత్సరం లాగా భారీగా ఉండకపోవచ్చని ఆయన చెప్పారు. అయితే, రాబోయే ఆర్థిక సంవత్సరం మెరుగ్గా ఉండగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. అమెరికా వీసా ఫీజును గణనీయంగా పెంచడం తమకు పెద్దగా సమస్య కాబోదని, వనరుల సమర్ధ వినియోగం ద్వారా ఈ ప్రభావాన్ని కొంత మేర ఎదుర్కొనగలమని చంద్రశేఖరన్ చెప్పారు.

3.44 లక్షలకు ఉద్యోగుల సంఖ్య..
 టీసీఎస్ స్థూలంగా 22,118 మందిని, నికరంగా 9,071 మంది ఉద్యోగులను తీసుకుందని, దీంతో మొత్తం సిబ్బంది సంఖ్య 3,44,691కి చేరిందని సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అజయ్ ముఖర్జీ చెప్పారు. ఉద్యోగుల వలసలు (అట్రిషన్ రేటు) ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం(క్యూ3)లో తగ్గిందని వివరించారు. వ్యాపార వృద్ధికి అనుగుణంగా నియామకాలు జరుపుతున్నామని, అలాగే నైపుణ్యాలను పెంచేందుకు శిక్షణా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామని ముఖర్జీ పేర్కొన్నారు.
 
 దాదాపు 70,000 మంది ఉద్యోగులు కొత్త టెక్నాలజీలపై శిక్షణ పొందుతున్నార చెప్పారు. అటు, 100 మిలియన్ డాలర్ల కాంట్రాక్టులు ఇచ్చిన క్లయింట్ల సంఖ్య మరొకటి పెరిగి 34కి చేరిందని, 20 మిలియన్ డాలర్ల క్లయింట్ల సంఖ్య 2 పెరిగి 173కి చేరిందని ముఖర్జీ ఈ సందర్భంగా తెలిపారు. కంపెనీ ఫలితాలపై అంచనాలతో మంగళవారం బీఎస్‌ఈలో టీసీఎస్ షేరు 1.65 శాతం తగ్గి రూ. 2,324 వద్ద ముగిసింది.
 
 డిజిటల్ వ్యాపారంపై ప్రధానంగా దృష్టి..
 కంపెనీ ఆదాయాల్లో 13.7 శాతం డిజిటల్ వ్యాపార విభాగం నుంచే వచ్చాయని, ఈ విభాగం అత్యధిక వృద్ధి నమోదు చేస్తోందని చంద్రశేఖరన్ తెలిపారు. ఈ నేపథ్యంలో 2016లో కూడా డిజిటల్ వ్యాపారంపై ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు చంద్రశేఖరన్ పేర్కొన్నారు. లైఫ్ సెన్సైస్.. హెల్త్‌కేర్, తయారీ, హై-టెక్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సర్వీసులు తదితర వ్యాపార విభాగాలన్నీ కూడా మెరుగైన పనితీరే కనపర్చాయని ఆయన వివరించారు.
 

మరిన్ని వార్తలు