పుత్తడికి సీజనల్ డిమాండ్

14 Mar, 2016 02:02 IST|Sakshi
పుత్తడికి సీజనల్ డిమాండ్

ధర పటిష్టంగా వుండవచ్చంటున్న బులియన్ ట్రేడర్లు
ముంబై: ఈ ఏడాది జోరుగా పెరిగిన బంగారం ధర మున్ముందు కూడా సీజనల్ డిమాండ్ కారణంగా పటిష్టంగానే వుంటుందని బులియన్ ట్రేడర్లు అంచనావేస్తున్నారు. ఇటీవల బాగా పెరిగినందున, చిన్నచిన్న సర్దుబాట్లు జరిగినప్పటికీ, పుత్తడికి రానున్న రోజుల్లో డిమాండ్ పెరుగుతుందని, పెళ్ళిళ్లు తదితరాల కారణంగా మార్చి, ఏప్రిల్ నెలల్లో కొనుగోళ్లు బావుంటాయని బులియన్ ట్రేడర్లు వివరించారు. క్రితం వారం ప్రథమార్థంలో దేశీయ మార్కెట్లో 22 నెలల గరిష్టస్థాయికి చేరిన పుత్తడి ధర, అటుతర్వాత లాభాల స్వీకరణకు లోనై, భారీగా పడిపోయింది.

కానీ వారం చివర్లో స్టాకిస్టులు, రిటైలర్లు జోరుగా కొనుగోళ్లు జరపడంతో తిరిగి పుంజుకుంది. అయితే అంతక్రితంవారంతో పోలిస్తే స్వల్పనష్టంతో ముగిసింది. ముంబై బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛతగల 10 గ్రాముల స్టాండర్డ్ బంగారం గత శుక్రవారం, అంతక్రితంవారం ఇదేరోజుతో పోలిస్తే రూ. 55 నష్టంతో 29,395 వద్ద ముగిసింది. 99.5 స్వచ్ఛతగల పుత్తడి ధర అంతే తగ్గుదలతో రూ. 29,245 వద్ద క్లోజయ్యింది.

ఇక అంతర్జాతీయంగా న్యూయార్క్ మార్కెట్లో ఔన్సు పుత్తడి ధర ఒకదశలో 1,287 డాలర్ల గరిష్టస్థాయికి చేరింది. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ భారీ ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించడంతో ఆ స్థాయికి ధర పెరిగినా, అటుతర్వాత లాభాల స్వీకరణతో 1,259 డాలర్ల వద్దకు తగ్గి ముగిసింది. అంతక్రితం వారంతో పోలిస్తే 11 డాలర్ల మేర క్షీణించింది.

>
మరిన్ని వార్తలు