ఫార్మా షేర్ల కి డిమాండ్

25 Feb, 2014 10:16 IST|Sakshi
ఫార్మా షేర్ల కి డిమాండ్

 దేశీ స్టాక్స్‌లో ఎఫ్‌ఐఐల కొనుగోళ్లు కొనసాగడంతోపాటు, ఫార్మా దిగ్గజాలకు డిమాండ్ పెరగడంతో సెంటిమెంట్ బలపడింది. దీంతో వారం ఆరంభంలోనే సెన్సెక్స్ 111 పాయింట్లు లాభపడి 20,811 వద్ద ముగిసింది. ఇది నెల రోజుల గరిష్టంకాగా, నిఫ్టీ కూడా 36 పాయింట్లు పుంజుకుని 6,186 వద్ద ముగిసింది.

ఫార్మా షేర్లు క్యాడిలా హెల్త్, ర్యాన్‌బాక్సీ, డాక్టర్ రెడ్డీస్, లుపిన్, గ్లెన్‌మార్క్ 5-2% మధ్య ఎగశాయి. వెరసి డాక్టర్ రెడ్డీస్(రూ. 2,795), లుపిన్(రూ. 956), క్యాడిలా(రూ. 995) చరిత్రాత్మక గరిష్ట స్థాయిల వద్ద ముగిశాయి. గత వారం రూ. 2,500 కోట్లను ఇన్వెస్ట్ చేసిన ఎఫ్‌ఐఐలు తాజాగా రూ. రూ. 267 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. దేశీయ ఫండ్స్ యథాప్రకారం రూ. 249 కోట్ల విలువైన అమ్మకాలను చేపట్టాయి.

 ఎన్‌టీపీసీ డౌన్, టాటా పవర్ అప్
 కేంద్ర విద్యుత్ నియంత్రణ సంస్థ(సీఈఆర్‌సీ) విద్యుత్ టారిఫ్‌లకు సంబంధించి కొత్తగా ప్రకటించిన నిబంధనల కారణంగా ప్రభుత్వ రంగ దిగ్గజం ఎన్‌టీపీసీ బీఎస్‌ఈలో 11%పైగా పతనమై రూ. 117 వద్ద ముగిసింది. ఇది 52 వారాల కనిష్టంకాగా, రెండు ఎక్స్ఛేంజీలలోనూ కలిపి దాదాపు 3.5 కోట్ల షేర్లు చేతులు మారాయి. ఉత్పత్తినిబట్టి కాకుండా అమ్మకపుస్థాయి(ఆఫ్‌టేక్) ఆధారంగా టారిఫ్ నిర్ణయంకానుండం ఇందుకు కారణమైంది. అయితే ముంద్రా ప్రాజెక్ట్‌లో ఉత్పత్తయ్యే విద్యుత్‌పై నష్టపరిహారంకింద యూనిట్‌కు రూ. 50 పైసలను అదనంగా వసూలు చేసుకునేందుకు సీఈఆర్‌సీ అంగీకరించడంతో టాటా పవర్ 5% జంప్‌చేసి రూ. 83 వద్ద ముగిసింది.
 
 అమెరికా మార్కెట్ల దూకుడు
 న్యూయార్క్: అమెరికా స్టాక్ మార్కెట్లు జోరుమీదున్నాయి. కేటర్‌పిల్లర్, మెర్క్ అండ్ కంపెనీ వంటి దిగ్గజాలు ఏడాది గరిష్టానికి చేరడంతో ఎస్‌అండ్‌పీ-500 సూచీ చరిత్రాత్మక గరిష్ట స్థాయిని తాకింది. ఇంతక్రితం జనవరి 15న సాధించిన 1,848 పాయింట్ల లైఫ్‌టైమ్ హైను అధిగమించి 1,857 వద్ద కదులుతోంది. ఇక నాస్‌డాక్ 14 ఏళ్ళ గరిష్టమైన 4,309కు చేరగా, డోజోన్స్ 184 పాయింట్లు ఎగసి 16,287 వద్ద ట్రేడవుతోంది.

మరిన్ని వార్తలు