కాల్ డ్రాప్స్ కు కఠిన శిక్షలు

9 Jun, 2016 00:54 IST|Sakshi
కాల్ డ్రాప్స్ కు కఠిన శిక్షలు

చట్టాన్ని సవరించండి  ప్రభుత్వాన్ని కోరిన ట్రాయ్

 న్యూఢిల్లీ: ఎయిర్‌టెల్, వొడాఫోన్, బీఎస్‌ఎన్‌ఎల్ వంటి మొబైల్ కంపెనీలు  రేడియో లింక్ టైమ్-అవుట్ టెక్నాలజీ(ఆర్‌ఎల్‌టీ)ని కాల్‌డ్రాప్స్‌కు ముసుగుగా వాడుకుంటున్నాయని టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ తెలిపింది. హైదారబాద్‌లో నిర్వహించిన నెట్‌వర్క్ పరీక్షల్లో ఈ విషయం వెల్లడైందని పేర్కొంది. కాల్‌డ్రాప్స్‌కు సంబంధించి  హైదరాబాద్‌లో 14 నెట్‌వర్క్‌ల్లో తాము నిర్వహించిన తనిఖీల్లో 11 నెట్‌వర్క్‌లు  విఫలమయ్యాయని పేర్కొంది. నిర్దేశిత పరిమితి కంటే తక్కువకు సిగ్నల్ నాణ్యత పడిపోతే కాల్ ఎంత కాలం కొనసాగగలదో  ఆర్‌ఎల్‌టీ వెల్లడిస్తుంది.

నెట్‌వర్క్ కవరేజ్ బలహీనంగా ఉన్నప్పటికీ, కాల్స్ కనెక్టయ్యేలా,  సిగ్నల్స్ లేవని  వినియోగదారులే కాల్స్‌ను డిస్‌కనెక్ట్ చేసుకునేలా ఈ టెక్నాలజీని టెల్కోలు వాడుకుంటున్నాయనేది ఆరోపణ. ఆర్‌ఎల్‌టీని టెల్కోలు  కాల్‌డ్రాప్స్‌కు వాడుతున్నాయనడాన్ని సెల్యులర్ ఆపరేటర్స్ ఆసోసియేషన్(సీఓఏఐ) ఖండించింది. కాగా, కాల్‌డ్రాప్స్ విషయంలో మరింత కఠినంగా వ్యవహరించడానికి మరిన్ని అధికారాలు కావాలని ట్రాయ్ కోరుతోంది. కాల్‌డ్రాప్స్ సంబంధిత నియమాలను ఉల్లంఘించిన కంపెనీలపై రూ.10 కోట్ల జరిమానా విధించడానికి,  కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లకు రెండేళ్ల వరకూ జైలు శిక్ష విధించడానికి వీలు కల్పిస్తూ చట్టాలను సవరించాలని ట్రాయ్ ప్రభుత్వాన్ని కోరింది.

>
మరిన్ని వార్తలు