భారత్ కోసం మెర్సిడెస్ ప్రత్యేక మోడల్

30 Mar, 2016 11:31 IST|Sakshi
భారత్ కోసం మెర్సిడెస్ ప్రత్యేక మోడల్

2016లో 12 కొత్త కార్లు తీసుకొస్తాం...
కంపెనీ ఎండీ రోలాండ్ ఫాల్గర్  
భారత మార్కెట్లో ఎస్-400 విడుదల

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లగ్జరీ కార్ల తయారీ సంస్థ జర్మనీకి చెందిన మెర్సిడెస్ బెంజ్ భారత్‌లో ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలకు విస్తరిస్తోంది. కంపెనీ అమ్మకాల్లో ముంబై, ఢిల్లీ మినహా మిగిలిన ప్రాం తాల వాటా 55% ఉండడమే ఇందుకు కారణం. 2016లో కొత్తగా ఏర్పాటు చేయనున్న డీలర్‌షిప్‌లలో ఒకట్రెండు మినహా మిగిలినవన్నీ ఈ నగరాల్లోనే రానున్నాయని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ రోలాండ్ ఫాల్గర్ మంగళవారం తెలిపారు. హైదరాబాద్ వేదికగా సరికొత్త ఎస్-400 కారును భారత మార్కెట్లో విడుదల చేసిన సందర్భంగా మహవీర్ మోటార్స్ గ్రూప్ చైర్మన్ యశ్వంత్ జబఖ్‌తో కలసి మీడియాతో మాట్లాడారు. 2016లో అప్‌గ్రేడెడ్ వెర్షన్లతోసహా మొత్తం 12 మోడళ్లను ప్రవేశపెడతామని వెల్లడించారు. ఎస్-400తో కలిపి కంపెనీ ఇప్పటికే మూడు మోడళ్లను విడుదల చేసింది. 2015లో మెర్సిడెస్ బెంజ్ 32 శాతం వృద్ధి రేటుతో 13,500లపైగా కార్లను విక్రయించింది. ఇందులో 40 శాతం వృద్ధితో దక్షిణాది రాష్ట్రాల వాటా 35 శాతం ఉంది.

 భారత్ కోసం ప్రత్యేకంగా..: నెక్స్ట్‌జనరేషన్ వాహనాలకు యువత ఆకర్షితులవుతున్నారని రోలాండ్ వెల్లడించారు. తమ కస్టమర్ల సగటు వయసు 45 నుంచి ఇప్పుడు 37కు వచ్చి చేరడమే ఇందుకు ఉదాహరణ అని వివరించారు. ‘మహిళలూ లగ్జరీ కార్లలో దూసుకెళ్తున్నారు. సంస్థ కస్టమర్లలో 12 శాతం వాటా వీరిదే’ అని చెప్పారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో అడుగుపెట్టడం తొలుత రిస్క్‌తో కూడుకున్నదేనని అన్నారు. కానీ భవిష్యత్ ఈ నగరాలదేనని పేర్కొన్నారు. భారత మార్కెట్ కోసం ప్రత్యేక మోడల్‌ను ప్రవేశపెడతామని సాక్షి బిజినెస్ బ్యూరోతో చెప్పారు. ఇందుకు కొంత సమయం పడుతుందన్నారు.

 ప్రపంచంలో అత్యుత్తమ కారుగా కంపెనీ అభివర్ణిస్తోంది. 3 లీటర్, వి6 పెట్రోల్ ఇంజన్‌తోపాటు స్మూత్ రైడ్ కోసం ఇందులో అత్యాధునిక ఎయిర్‌మ్యాటిక్ సస్పెన్షన్ ఉంది. భద్రతకు పెద్ద పీట వేస్తూ 8 ఎయిర్‌బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రాం, ప్రి-సేఫ్, డైనమిక్ కార్నరింగ్ కంట్రోల్ సిస్టమ్, హోల్డ్ ఫంక్షన్‌తో అడాప్టివ్ బ్రేక్, బ్రేక్ అసిస్ట్ ఫీచర్లు జోడించారు. 360 డిగ్రీ సరౌండ్ వ్యూ కెమెరా, యాక్టివ్ పార్క్ అసిస్ట్, పనోరమిక్ సన్‌రూఫ్, వీనుల విందైన సంగీతం కోసం 1,520 వాట్స్ సామర్థ్యమున్న 24 స్పీకర్లతో కూడిన బర్మెస్టర్ 3డీ సరౌండ్ సౌండ్ వ్యవస్థ పొందుపరిచారు. హైదరాబాద్ ఎక్స్‌షోరూంలో కారు ధర రూ.1.31 కోట్లు.

మరిన్ని వార్తలు