టయోటా– ప్యానాసోనిక్‌ జట్టు

23 Jan, 2019 00:13 IST|Sakshi

ఎలక్ట్రిక్‌ కార్ల బ్యాటరీ తయారీకి జేవీ

2020 కల్లా ఏర్పాటు!  

టోక్యో: ఎలక్ట్రిక్‌ కార్లకు అవసరమైన బ్యాటరీల తయారీ కోసం జపాన్‌ వాహన దిగ్గజం టొయోటా కంపెనీ మరో జపాన్‌ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం ప్యానాసోనిక్‌తో చేతులు కలుపుతోంది. ప్యానాసోనిక్‌తో కలసి 2020 నాటికల్లా ఒక జాయింట్‌ వెంచర్‌ను ఏర్పాటు చేస్తామని, ఈ జేవీలో తమ వాటా 51 శాతంగా ఉండనున్నదని టయోటా తెలిపింది.  

బ్యాటరీలు కీలకం  
టయోటా కంపెనీ ప్రపంచ వ్యాప్త అమ్మకాల్లో ఎలక్ట్రిక్‌ వాహనాల వాటా 15% వరకూ ఉంటుంది. 2030 కల్లా ఈ వాటా 50%కి పెంచుకోవాలనుకుంటున్నట్లు  టయోటా అధినేత అకియో టయోడా గతంలోనే వెల్లడించారు. ఎలక్ట్రిక్‌ కార్లకు బ్యాటరీలు కీలకమని టయోడా భావిస్తున్నారు. జపాన్‌లో సహజ వనరులకు సంబంధించి భారీ మార్పులేమీ లేనందున బ్యాటరీల తయారీ తమకు తప్పనిసరి అని, పుష్కలంగా బ్యాటరీల సరఫరా ఉండేలా చూడాల్సిన అవసరముందన్నారు. బ్యాటరీల రంగంలో ప్యానాసోనిక్‌ కంపెనీకి ప్రత్యేక సామర్థ్యాలున్నాయి. అంతర్జాతీయ ఎలక్ట్రిక్‌ వాహన కంపెనీ టెస్లాకు అమెరికాలో ఉన్న  భారీ స్థాయి గిగా ఫ్యాక్టరీ నిర్వహణలో పాలు పంచుకోవడానికి ప్యానాసోనిక్‌ ఇటీవలే ఒక ఒప్పందం కూడా కుదుర్చుకుంది.    

మరిన్ని వార్తలు