800 కోట్లతో టయోటా ఇంజన్ ప్లాంట్

4 Sep, 2015 00:38 IST|Sakshi
800 కోట్లతో టయోటా ఇంజన్ ప్లాంట్

బెంగళూరు వద్ద ఏర్పాటు
- 2014 మాదిరిగానే ఈ ఏడాది అమ్మకాలు కూడా...
- కంపెనీ డిప్యూటీ ఎండీ జైశంకర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో:
వాహన రంగంలో ఉన్న టయోటా కిర్లోస్కర్ మోటార్ బెంగళూరు సమీపంలో డీజిల్ ఇంజన్ల తయారీ ప్లాంటును ఏర్పాటు చేయనుంది. రెండు మూడేళ్లలో పూర్తి కానున్న ఈ ప్లాంటుకు కంపెనీ రూ.700-800 కోట్లు ఖర్చు చేయనుంది. ప్రస్తు తం భారత్‌లో విక్రయిస్తున్న ఒకట్రెండు మినహా మిగిలిన మోడళ్ల ఇంజిన్లను థాయ్‌లాండ్, జపాన్ నుంచి దిగుమతి చేస్తున్నట్టు టయోటా కిర్లోస్కర్ మోటార్ డిప్యూటీ ఎండీ టి.ఎస్.జైశంకర్ తెలిపారు. హర్ష టయోటా ఏర్పాటు చేసిన డ్రైవింగ్ స్కూల్‌ను ప్రారంభించిన సందర్భంగా కంపెనీ ఎండీ నవోమీ ఇషితో కలిసి గురువారమిక్కడ మీడియాతో మాట్లాడారు. ఇక కార్ల తయారీకి 70 శాతందాకా విడిభాగాలను కంపెనీ దేశీయంగా సేకరిస్తోంది. దీనిని కొద్ది రోజుల్లో 85 శాతానికి చేర్చాలన్నది కంపెనీ భావన.
 
గతేడాది మాదిరిగానే..
టయోటా కిర్లోస్కర్ గతేడాది భారత్‌లో 1.60 లక్షల యూనిట్లను విక్రయించింది. ఇందులో మన దేశం నుంచి 9 దేశాలకు చేసిన ఎగుమతులు 20 వేల యూనిట్లు. భారత ప్యాసింజర్ కార్ల విపణిలో కంపెనీకి 5% వాటా ఉంది. 2014 మాదిరిగానే ఈ ఏడాది కూడా అదే స్థాయిలో అమ్మకాలు, మార్కెట్ వాటా ఆశిస్తున్నట్టు జైశంకర్ తెలిపారు. ‘కొత్త మోడళ్ల రాకతోనే వృద్ధి ఉంటుంది. ఈ ఏడాది టయోటా నుంచి భారత్‌లో కొత్త మోడళ్ల ఆవిష్కరణలు ఏవీ లేవు. అయితే అమ్మకాల విషయంలో కంపెనీ వెనుకంజలో ఏమీ లేదు’ అని వెల్లడించారు. గతేడాది ఆగస్టుతో పోలిస్తే గత నెలలో 1.29 శాతం వృద్ధితో 12,547 యూనిట్లను కంపెనీ విక్రయించింది.
 
మరిన్ని డ్రైవింగ్ స్కూళ్లు: టయోటా కిర్లోస్కర్ మోటార్ భారత్‌లో మూడవ ‘టయోటా డ్రైవింగ్ స్కూల్’ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది. 2020 నాటికి దేశవ్యాప్తంగా స్కూళ్ల సంఖ్యను 50కి చేరుస్తామని నవోమీ ఇషి వెల్లడించారు. హైదరాబాద్‌లో టయోటా ఎక్స్‌ప్రెస్ సర్వీస్ ఫెసిలిటీని సైతం కంపెనీ ప్రారంభించింది. ఇది భారత్‌లో 6వది కాగా, డిసెంబరు నాటికి మరో 8 కేంద్రాలను ఏర్పాటు చేయాలని సంస్థ భావిస్తోంది. నాణ్యతలో ఎటువంటి రాజీ లేకుండా 60 నిమిషాల్లోనే వాహనానికి సర్వీస్ చేసి కస్టమర్‌కు అప్పగించడం ఈ కేంద్రాల ప్రత్యేకత. హర్ష టయోటా యాక్సెస్ బాక్స్ పేరిట రూపొం దించిన యాప్‌ను సైతం ఈ సందర్భంగా ఆవిష్కరించారు. కస్టమర్లు ఈ యాప్ సహాయంతో సర్వీస్ బుకింగ్, బీమా, ఎమర్జెన్సీ తదితర సేవలు పొందవచ్చు.

మరిన్ని వార్తలు