ఆ కార్ల ధరలు పెరిగాయ్‌

13 Sep, 2017 17:39 IST|Sakshi
ఆ కార్ల ధరలు పెరిగాయ్‌
సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ అంతర్జాతీయ కార్ల తయారీ సంస్థ టయోటా కిర్లోస్కర్ మోటార్ కంపెనీ తన కార్ల ధరలు పెంచేసింది. జీఎస్టీ కౌన్సిల్‌ ఇటీవల పెద్ద కార్లు, ఎస్‌యూవీలు, మధ్య తరహా కార్లపై సెస్‌ను పెంచుతున్నట్టు ప్రకటించడంతో, తన మోడల్స్‌ అన్నింటిపై కూడా సెస్‌కు అనుకూలంగా ధరలను పెంచుతున్నట్టు తెలిపింది. మిడ్‌ సైజు నుంచి పెద్ద సైజు కార్లు, ఎస్‌యూవీల వరకు 2-7 శాతం వరకు సెస్‌ పెరిగింది. ఈ మేరకు ఇన్నోవా క్రిస్టాపై టయోటా రూ.78వేల వరకు ధర పెంచింది. అదేవిధంగా అన్ని కొత్త ఫార్చ్యూనర్లపై రూ.1,60,000 వరకు ధరలను పెంచుతున్నట్టు ప్రకటించింది.
 
అన్ని కొత్త కరోలా ఆల్టిస్‌లపై రూ.72వేల వరకు ధర పెంపును చూడొచ్చు. ప్లాటినం ఎతియోస్ ధరను రూ.13వేల వరకు పెంచింది. ఈ సమీక్షించిన ధరలు 2017 సెప్టెంబర్‌ 12 నుంచి అమల్లోకి రానున్నాయి. హైబ్రిడ్‌, చిన్న కార్ల ధరలలో మాత్రం ఎలాంటి మార్పులను టయోటా చేపట్టలేదు. జీఎస్టీ సవరణలతో తమ ఉత్పత్తుల ధరలను పెంచామని, ప్రీ-జీఎస్టీకి ముందున్న రేట్లకు దగ్గర్లో ఇవి ఉన్నట్టు టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ మార్కెటింగ్‌, సేల్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ డైరెక్టర్‌ ఎన్‌ రాజ చెప్పారు.   
మరిన్ని వార్తలు